శ్రీలంక జైలులో ఘర్షణ.. 25 మంది మృతి

శ్రీలంక జైలులో ఘర్షణ, నీగోంబో
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

శ్రీలంకలోని నీగొంబో జైలులో జరిగిన ఘర్షణలో మరణించిన వారి సంఖ్య 25కు పెరిగినట్లు స్థానిక పోలీసు మీడియా విభాగం తెలిపింది.

గాయపడిన వంద మందికి పైగా ఆసుపత్రిలో చేరినట్లు నీగొంబో జిల్లా ఆసుపత్రి డైరెక్టర్ తెలిపారు.

గాయపడిన వారిలో కొందరిని తదుపరి చికిత్స కోసం కొలంబో నేషనల్ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారిలో జైలు అధికారులు కూడా ఉన్నారని నీగొంబో ఆసుపత్రి డైరెక్టర్ పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీలంక జైలులో ఘర్షణ, నీగోంబో

నీగొంబో జైలు ఘర్షణ

కొలంబో శివారు ప్రాంతంలో ఉన్న నీగొంబో జైలులో ఆదివారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మొదట ఇద్దరు మరణించారు, మరో 34 మంది గాయపడ్డారు.

గాయపడిన ఖైదీలను నీగొంబో ఆసుపత్రిలో చేర్చారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కొలంబో నేషనల్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘర్షణ అనంతరం నీగొంబో సహా పలు పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసు అధికారులు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బంది జైలుకు చేరుకున్నారు.

నీగొంబో జైలులో సుమారు 1800 మంది ఖైదీలను ఉంచారు. ఈ జైలులో నిందితులు, నేరస్థులు ఇద్దరూ ఉన్నట్లు జైళ్ల శాఖ తెలిపింది.

నిన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత, మహిళా ఖైదీలు జైలు పైకప్పు ఎక్కి నిరసన కూడా చేపట్టారు.

ఈ సమయంలో అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని పేర్కొంటూ, ఖైదీల బంధువులు జైలు ఆవరణలో ఆందోళన చేశారు.

అయితే, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు జైళ్ల శాఖ ప్రకటించింది.

శ్రీలంక జైలులో ఘర్షణ, నీగోంబో

నేడు మళ్లీ ఘర్షణ

తొలుత అదుపులోకి వచ్చిన ఘర్షణ సోమవారం మళ్లీ తీవ్రరూపం దాల్చింది.

ఈసారి జైలులోని ఖైదీలకు, అధికారులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో, పరిస్థితిని అదుపు చేయడానికి అదనంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బందిని రప్పించారు.

ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల శబ్దాలు జైలు బయటకు కూడా వినిపించినట్లు అక్కడి పాత్రికేయులు తెలిపారు.

అంతేకాకుండా, జైలు లోపల గాయపడిన, స్పృహతప్పిన స్థితిలో ఉన్న ఖైదీలను, అధికారులను భద్రతా విభాగాల వారు ఆసుపత్రులకు తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)