ఐపీఎల్- 2026 విజేత ఆర్సీబీ, వరుసగా రెండోసారి టైటిల్

ఐపీఎల్ 2026, క్రికెట్, ఆర్సీబీ, అహ్మదాబాద్ స్టేడియం

ఫొటో సోర్స్, ANI/X

ఫొటో క్యాప్షన్, ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ 75 పరుగులు చేశాడు.
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ సాధించింది.

విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి లాంగ్ ఆన్ మీదుగా దూసుకెళ్లిన బంతి బౌండరీ లైన్ దాటడమే ఆలస్యం... ఆర్సీబీ ఆటగాళ్లు మైదానంలోకి పరుగు తీశారు. స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు కేరింతలు కొట్టారు. 17 ఏళ్ల నిరీక్షణకు గత ఏడాది తెరదించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ ఏడాది మే 31న మరో చరిత్ర సృష్టించింది. గుజరాత్ టైటాన్స్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించి, వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

ఈ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ 75 పరుగులతో అజేయంగా నిలిచి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్, అహ్మదాబాద్, ఐపీఎల్ 2026

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ 10 పరుగులు చేసి ఔటయ్యాడు.

బ్యాటింగ్‌లో తడబడిన గుజరాత్ టైటాన్స్

అంతకుముందు, టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది. 10 పరుగులు చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌.. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే భువనేశ్వర్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్(12 పరుగులు) కూడా ఔటయ్యాడు.

దీంతో, నిషాంత్ సింధు, జోస్ బట్లర్ జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. అయితే, నిలకడగా ఆడుతున్న నిషాంత్ సింధు (20 పరుగులు) కూడా ఔటవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. మరికాసేపటికే బట్లర్ (19 పరుగులు) కూడా పెవిలియన్ చేరాడు.

ఇక మరో ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 50 పరుగులు) ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరు బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు.

అయితే, రాహుల్ తేవాటియా(7 పరుగులు), హోల్డర్ (7 పరుగులు) కూడా వెంటవెంటనే ఔటవడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 155 పరుగులు చేయగలిగింది.

ఐపీఎల్ 2026, క్రికెట్, ఆర్సీబీ, అహ్మదాబాద్ స్టేడియం

ఫొటో సోర్స్, ANI

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రషీద్ కలవరపెట్టినా..

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32), విరాట్ కోహ్లీలు శుభారంభాన్ని ఇచ్చారు.

ఈ జోడీ రబాడ, సిరాజ్‌ల బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొంది.

వెంకటేశ్, పడిక్కల్ వెంటవెంటనే ఔటైనా... పవర్‌ప్లేలో పదికి పైగా రన్‌రేట్‌తో పరుగులు రావడంతో ఆర్సీబీ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు.

కానీ, 9వ ఓవర్లో స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌కు రావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

ఆ ఓవర్లో కెప్టెన్ రజత్ పాటిదార్(15 పరుగులు), కృనాల్ పాండ్యా(1 పరుగు)లను ఔట్ చేసి ఆర్సీబీ శిబిరంలో టెన్షన్ పుట్టించాడు. దీంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. ఆ సమయంలో మరో వికెట్ పడితే ఆర్సీబీ ఒత్తిడిలోకి వెళ్లేది.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, ANI

విరాట్ కోహ్లీ 'షో'

ఓ వైపు వికెట్లు పడుతున్నా ఆర్సీబీ ప్రశాంతంగా విజయం వైపు సాగిందంటే కారణం విరాట్ కోహ్లీ. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ, సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు కోహ్లీ. కేవలం 25 బంతుల్లోనే తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు.

చివర్లో టిమ్ డేవిడ్ (24 పరుగులు) ఔటైనా, జితేష్ శర్మ (11 నాటౌట్) సాయంతో మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చాడు కోహ్లీ. దీంతో, 18వ ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది ఆర్సీబీ.

విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్‌లు తలో వికెట్ తీశారు.

వైభవ్ సూర్యవంశీ, ఐదు అవార్డులు

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images)

ఫొటో క్యాప్షన్, వైభవ్ సూర్యవంశీ (ఫైల్ ఫోటో)

వైభవ్ సూర్యవంశీకి ఐదు అవార్డులు

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి ఐదు అవార్డులు దక్కాయి.

ఈ ఏడాది లీగ్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచినందుకు గాను మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్, ఆరెంజ్ క్యాప్ విజేత, సూపర్ సిక్సెస్ ఆఫ్ ద సీజన్ పురస్కారాలను సొంతం చేసుకున్నాడు.

బిహార్‌కు చెందిన ఈ 15 ఏళ్ల బ్యాటర్, టోర్నీలో చక్కని ఆటతీరును ప్రదర్శించాడు.

237.30 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించి, ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

అంతేకాదు, సూర్యవంశీ ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 72 సిక్సర్లూ కొట్టారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)