ఒడిశా:'దీనిని ప్రశ్న పత్రం లీక్ అనలేం', వాట్సాప్‌లో 'క్వశ్చన్ పేపర్' ఆరోపణలపై అధికారులు ఏమన్నారంటే..

మెడికల్ కాలేజ్, ప్రశ్నాపత్రం లీకేజ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

ఒడిశాలో మెడికల్ పీజీ ప్రశ్న పత్రం సోషల్ మీడియాలో షేర్ అయినట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐతెలిపింది.

నీట్ పేపర్‌ లీక్‌పై దేశవ్యాప్తంగా యువత ఆందోళనకు దిగడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026' పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడం వంటి పరిణామాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ వ్యవహారం చర్చనీయంగా మారింది.

‘‘ఆల్ ఒడిశా మెడికల్ పీజీ ఎగ్జామినేషన్ ప్రశ్న పత్రం ఫోటోలు ఈ నెల 27న సోషల్ మీడియాలో ఫార్వార్డ్ అయ్యాయని అధికారులు చెప్పారు. 2023 - 26 బ్యాచ్ పీజీ విద్యార్థుల థియరీ ఎగ్జామ్ జరుగుతుండగానే ఇది జరిగిందని తెలిపారు'' అని పీటీఐ రిపోర్ట్ చేసింది.

అయితే, దీనిని ప్రశ్న పత్రం లీక్‌ అనలేమని బెర్హంపూర్‌లోని ఎంకేసేజీ మెడికల్ కాలేజ్ డీన్ హరేకృష్ణ దలాయ్ పేర్కొన్నారు. ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ, పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్న పత్రం బయటకు వచ్చి విద్యార్థులకు చేరితే మాత్రమే పేపర్‌ లీక్‌ అనగలమని ఆయన అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్న పత్రం ఫోటోలు..

ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఓయూహెచ్ఎస్) నిర్వహించిన మెడికల్ పీజీ పరీక్ష ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయినట్లు ఇండియన్స్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించింది.

ఎంఎస్/ఎండీ జనరల్ సర్జరీ కోర్స్ 2023-26 బ్యాచ్ పీజీ విద్యార్థుల రెండో ప్రశ్న పత్రం ఫోటోలు కొందరు పీజీ విద్యార్థులు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ అయినట్లు ఆరోపణలున్నాయి.

"పరీక్ష ప్రారంభమైన కొద్దినిమిషాల్లోనే ప్రశ్న పత్రం ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైనట్లు చెబుతున్నారు.

పరీక్ష జరుగుతుండగానే ప్రశ్న పత్రం ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఓయూహెచ్ఎస్) అంతర్గత విచారణకు ఆదేశించింది" అని పీటీఐ రిపోర్ట్ చేసింది.

పరీక్ష జరుగుతున్న సమయంలోనే కొన్ని ఫోన్ నంబర్ల నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా సర్క్యులేట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయని అధికారులు పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది.

పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాన్ని రహస్యంగా తీసుకెళ్లి, ప్రశ్న పత్రం ఫోటోలు తీసి వాట్సాప్‌లో పంపినట్టు అధికారులు అనుమానిస్తున్నట్లు హిందుస్థాన్ టైమ్స్ రాసింది.

మెడికల్ కాలేజ్, ప్రశ్నాపత్రం లీకేజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఓయూహెచ్ఎస్ వైస్ చాన్సలర్ మనస రంజన్ సాహూ ఘటన జరిగినట్టుగా భావిస్తున్న జులై 27 సాయంత్రం మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో వర్చువల్‌గా సమావేశమయ్యారు.

మిగిలిన పరీక్షలకు కఠిన భద్రతా చర్యలు చేపట్టాలని సాహూ ఆదేశించినట్టు ఎంకేసేజీ మెడికల్ కాలేజ్ డీన్ హరేకృష్ణ దలాయ్ తెలిపారు.

ఆయన ఏఎన్‌ఐతో మాట్లాడుతూ, ''దీన్నిప్రశ్న పత్రం లీక్ అని అనలేం. పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్న పత్రం బయటకు వచ్చి విద్యార్థులకు చేరితే దాన్ని లీక్ అనుకోవాలి. కానీ, ఈ ఘటనలో పరీక్ష జరుగుతుండగా ప్రశ్న పత్రం షేర్ అయింది'' అని ఆయన అన్నారు.

మొబైల్ ఫోన్లపై నిషేధం, తనిఖీలు ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్ పరికరం లోపలకి ఎలా వెళ్లిందనేది అధికారులకు అర్ధం కావడం లేదు.

ఎవరో ఎలక్ట్రానిక్ పరికరాన్ని లోపలికి తీసుకెళ్లి ఫోటోలు తీసి పంపినట్టు అనిపిస్తోందని దలాయ్ చెప్పారు. ఎలాంటి పరికరం ఉపయోగించారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ఒడిశా మెడికల్ పీజీ థియరీ పరీక్షలు ఈ నెల 21న మొదలయ్యాయి.

ఇప్పటికి రెండు పరీక్షలు జరిగాయి.

మరో రెండు పరీక్షలు ఆగస్టు ఒకటి, ఆగస్టు 5న జరగనున్నాయి.

"ఎంకేసీజీ కాలేజీ నుంచే ఆ పశ్ర పత్రం బయటికి వచ్చినట్లు ఒక మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థి అంగీకరించినట్లు సమాచారం అందింది. దీనిపై సమావేశంలో చర్చించాం. ప్రస్తుతం తగిన నివారణ చర్యలు చేపడుతున్నాం. రాబోయే రెండు పరీక్షల విషయంలోనూ కఠిన చర్యలు చేపడతాం" అని దలాయ్ తెలిపారు.

ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పరీక్షల నిర్వహణలో భద్రతాచర్యలను పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తామని ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ హరేకృష్ణ దలాయ్ చెప్పారు.

బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ నుంచి ఎవరో దానిని పంపినట్టు గుర్తించారని, భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్‌లో దీన్ని గుర్తించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో పేర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)