'స్ట్రా' నాకిన ఇన్‌స్టా వీడియో వైరల్: ఫ్రెంచ్ విద్యార్థికి జరిమానా విధించిన కోర్టు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయెల్ గుయింటో
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 2 నిమిషాలు
ఓ ఫ్రెంచ్ విద్యార్థికి సింగపూర్ కోర్టు 600 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.45 వేలు) జరిమానా విధించింది. ఆరెంజ్ జ్యూస్ వెండింగ్ మెషీన్లో ఉన్న స్ట్రాను నాకి మళ్లీ దాన్ని అక్కడే పెట్టారు.
19 ఏళ్ల డిడియర్ గ్యాస్పార్డ్ ఒవెన్ మాక్సిమిలియన్ పబ్లిక్ న్యూసెన్స్ కేసులో తన తప్పును అంగీకరించారు.
సింగపూర్‌లో చదువుకుంటున్న మాక్సిమిలియన్ స్ట్రాను నాకుతున్న వీడియోను స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ''నగరం సురక్షితం కాదు'' అని దానికి క్యాప్షన్ ఇచ్చారు.
ఆ వీడియోపై ఆన్లైన్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కమ్యూనిటీ పేజ్‌లో రీపోస్ట్ చేశారు. స్థానిక వార్తాసంస్థలు ఆ విషయాన్ని ప్రచురించాయి.
మాక్సిమిలియన్ చేసిన ఈ స్టంట్ తర్వాత డిస్పెన్సర్లో ఉన్న మొత్తం 500 స్ట్రాల స్థానంలో కొత్త స్ట్రాలు పెట్టామని వెండింగ్ మెషీన్ సంస్థ ఐజూజ్ తెలిపింది.


ఫొటో సోర్స్, Getty Images
పబ్లిక్ న్యూసెన్స్ కేసులకు సింగపూర్‌లో 2 వేల సింగపూర్ డాలర్ల జరిమానా, మూడు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
ప్రాసిక్యూషన్, డిఫెన్స్ రెండూ మాక్సిమిలియన్కు జరిమానా విధించాలని కోరాయి.
"తాను చేసిన పనికి మాక్సిమిలియన్ నిజంగా పశ్చాత్తాపపడుతున్నారు, సరదాగా చేసిన పని చివరికి తీవ్రమైన పరిణామాలకు దారితీసిందని ఆయన గ్రహించారు" అని డిఫెన్స్ లాయర్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ 'ది స్ట్రైట్స్ టైమ్స్' పేర్కొంది.
రెండు సింగపూర్ డాలర్లకు ఓ కప్పు తాజా ఆరెంజ్ జ్యూస్ లభించే ఐజూజ్ వెండింగ్ మెషీన్లు సింగపూర్‌లోని షాపింగ్ డిస్ట్రిక్స్ట్, రైల్వే స్టేషన్లు, హౌసింగ్ బ్లాక్స్‌లో కనిపిస్తుంటాయి.
మార్చి 12న మాక్సిమిలియన్ గోల్డ్హిల్ సెంటర్లోని ఐజూజ్ మెషీన్ నుంచి స్ట్రా తీసుకుని నాకారు. ఇది సింగపూర్‌లో బాగా సంపన్నప్రాంతాల్లో ఒకటి. బాక్సింగ్ వర్కౌట్ తర్వాత మాక్సిమిలియన్ అక్కడకు వచ్చారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























