ప్రాంతీయ పార్టీలు ఓటముల తరువాత పట్టు ఎందుకు కోల్పోతున్నాయి

భారత రాజకీయాలు, బీజేపీ, టీఎంసీ, నరేంద్రమోదీ, అరవింద్ కేజ్రీవాల్, శివసేన

ఫొటో సోర్స్, ANI

ప్రచురణ
చదివే సమయం: 8 నిమిషాలు

నరేంద్రమోదీ భారత్‌లో అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన నాయకుడిగా నిలిచారని జూన్‌10న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇది స్వయంప్రకటిత రివార్డ్ అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

అయితే ఒక విషయం సుస్పష్టం. 12 ఏళ్లుగా ప్రధాని మోదీ నాయకత్వం భారత రాజకీయాలను గణనీయంగా మార్చేసింది.

'కాంగ్రెస్ ముక్త భారత్' నినాదంతో మొదలైన ఈ రాజకీయ ప్రయాణం ఇప్పుడొక కొత్త ప్రశ్నను లేవనెత్తింది. భారత్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ప్రభావం క్షీణ దశలోకి అడుగుపెడుతోందా?

ఒకప్పుడు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల మీద ఆధార పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది.

మహారాష్ట్ర, బిహార్, పంజాబ్, యూపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వరకు అనేక రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు చీలికలు, తిరుగుబాట్లను ఎదుర్కొంటున్నాయి లేదా రాజకీయంగా తమ పట్టు కాపాడుకునేందుకు పోరాడుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాంతీయ పార్టీల్లో కొన్ని చోట్ల నాయకత్వ సంక్షోభం, కొన్ని చోట్ల సంస్థాగత బలహీనతలు ఉండగా ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడల్లా పార్టీపై నాయకత్వం పట్టు సడలుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు తమ సొంత విధానాలు, అంతర్గత సవాళ్ల వల్ల బలహీన పడ్డాయా లేక మారుతున్న జాతీయ రాజకీయాల వల్లనా, అధికారం కేంద్రీకృతం కావడం వల్ల వాటి పాత్ర పరిమితం అవుతోందా అన్నది పెద్ద ప్రశ్న.

ఇది మార్పు అయితే, ఇది భారత రాజకీయాలను ఏ దిశకు తీసుకు వెళుతుంది?

ఈ అంశంపై బీబీసీ 'లెన్స్' కార్యక్రమంలో ‘కలెక్టివ్ న్యూస్‌రూమ్’ జర్నలిజం డైరెక్టర్ ముఖేష్ శర్మ.. తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సాగరిక ఘోష్‌తో మాట్లాడారు.

ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న శివసేన (శిందే వర్గం) జాతీయ ముఖ్య సమన్వయకర్త డాక్టర్ అభిషేక్ వర్మ కూడా ఈ కార్యక్రమంలో తన అభిప్రాయాలను వెల్లడించారు.

సీనియర్ జర్నలిస్ట్, రచయిత నీలాంజన్ ముఖోపాధ్యాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భారత రాజకీయాలు, బీజేపీ, టీఎంసీ, నరేంద్రమోదీ, అరవింద్ కేజ్రీవాల్, శివసేన

ఫొటో సోర్స్, Samir Jana/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, మమత బెనర్జీ, అభిషేక్ బెనర్జీ

తృణమూల్ సంక్షోభం: బయట నుంచి ఒత్తిడా లేక అంతర్గత బలహీనతా?

తృణమూల్ కాంగ్రెస్‌లో ఇటీవలి సంక్షోభానికి కారణమేంటి? ఎన్నికైన ప్రతినిధులు ఒత్తిడి వల్లే పార్టీని వీడుతున్నారా లేక వారి సైద్ధాంతిక బంధం బలహీనంగా ఉందా? పార్టీ నాయకత్వ ఎంపికల్లో ఏమైనా తప్పులు జరిగాయా?

టీఎంసీలో ప్రస్తుత సంక్షోభానికి బీజేపీ ఎత్తుగడలే కారణమని టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ ఆరోపించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలు, డబ్బు లాంటివి ఉపయోగించి బీజేపీ తమ పార్టీ(టీఎంసీ) నాయకులపై ఒత్తిడి తెచ్చి వారు పార్టీ ఫిరాయించేలా బలవంతం చేస్తోందని ఆమె అన్నారు.

పార్టీ తన ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎంపిక చేయడంలో ఎలాంటి తప్పు చేయలేదని ఆమె నమ్ముతున్నారు.

"పార్టీని వీడిన ఎంపీల్లో మూణ్నాలుగు సార్లు ఎంపీలుగా ఎన్నికైనవాళ్లు ఉన్నారు. వారికి పార్టీ నాయకత్వంతో అనుబంధం ఉంది. గతంలో లాగా ఈసారి కూడా పార్టీ గెలిచి ఉంటే వాళ్లు పార్టీని వదిలిపోయేవాళ్లా? అలా జరిగేది కాదు. పార్టీ ఓడిపోయేసరికి వాళ్లు వెళ్లారు. వాళ్లు పార్టీకి ద్రోహం చేసినట్లే. ఇది వారి నైతిక బలహీనతకు నిదర్శనం" అని సాగరిక ఘోష్ చెప్పారు.

తమ పార్టీలో నాయకత్వ, సంస్థాగత లోపాలు ఉన్నాయని ఆమె అంగీకరించారు.

"పార్టీలో ఆత్మపరిశీలన, సంస్కరణల అవసరం ఉంది. ఈ విషయం పార్టీ నాయకత్వానికి తెలుసు.ఈ అంశంపై రెండు అంతర్గత సమావేశాల్లో చర్చించాం" అని ఆమె అన్నారు.

ఈ సమావేశాల్లో తన అభిప్రాయం వ్యక్తం చేశానని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆమె ఆశాభావంతో ఉన్నారు.

భారత రాజకీయాలు, బీజేపీ, టీఎంసీ, నరేంద్రమోదీ, అరవింద్ కేజ్రీవాల్, శివసేన

కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న సాగరిక ఘోష్ ఆరోపణలను శివసేన(శిందే వర్గం) జాతీయ సమన్వయకర్త డాక్టర్ అభిషేక్ వర్మ వ్యతిరేకించారు.

"మిమ్మల్ని మా వైపు రప్పించడానికి కేంద్ర సంస్థలు ఎలాంటి దర్యాప్తునైనా చేపడతాయని భావించకూడదు. అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. అలా జరిగినా మనకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది" అని ఆయన అన్నారు.

దీనికి ఒక ఉదాహరణగా "అరవింద్ కేజ్రీవాల్‌పై లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసుని కోర్టు కొట్టివేసింది" అని చెప్పారు.

అక్రమ మధ్య విధానం కేసులో కేజ్రీవాల్, ఇతరులపై దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది.

పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే టీఎంసీలో చీలిక కష్టమని ఇప్పటికీ భావిస్తున్నట్లు సీనియర్ జర్నలిస్ట్ నీలాంజన్ ముఖోపాధ్యాయ్ చెప్పారు.

"లోక్‌సభలో మూడింట రెండొంతుల మంది ఎంపీలు సమావేశమై ఉంటే ఈ చీలిక జరిగి ఉండేది. రాజ్యసభలో కూడా మూడింట రెండొంతుల మంది ఎంపీలు సమావేశం కాలేకపోయారు. అందుకే ముగ్గురు ఎంపీలు ఒక్కొక్కరుగా రాజీనామా చేశారు" అని ఆయన అన్నారు

ప్రాంతీయ పార్టీలకు వాటి సొంత బలాలు, బలహీనతలు ఉంటాయని, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితేంటో మరో పది రోజుల్లో తేలిపోతుందని ఆయన చెప్పారు.

భారత రాజకీయాలు, బీజేపీ, టీఎంసీ, నరేంద్రమోదీ, అరవింద్ కేజ్రీవాల్, శివసేన

ఫొటో సోర్స్, Satish Bate/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాథ్ శిందే

ఎన్డీయేతో అనుబంధంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు స్వతంత్ర గుర్తింపు

ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీ విస్తరణను తట్టుకుని తమ రాజకీయ గుర్తింపును నిలుపుకోగలవా? ఇలాంటి రాజకీయాలను ఉపయోగించి బీజేపీ మహారాష్ట్రలో శివసేనను(శిందే వర్గం) ఆక్రమించుకోదా?

దీనిపై సీనియర్ జర్నలిస్ట్ నీలాంజన్ ముఖోపాధ్యాయ్ స్పందించారు.

"బీజేపీ దాని మిత్రపక్షాలకు ఉమ్మడి రాజకీయ పునాది ఉన్న చోట భాగస్వామిని లేకుండా చేస్తుంది. ఆ భాగస్వామి పునాదిని తనలో కలిపేసుకుంటుంది" అని ఆయన అన్నారు.

"మహారాష్ట్రలో బీజేపీ క్రమంగా శివసేనను నాశనం చేసింది. ఇప్పుడు ఏక్‌నాథ్ శిందే శివసేన నామమాత్రంగానే మిగిలింది" అని మహారాష్ట్రను ఉదాహరణగా చెప్పారు.

అయితే ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న శివసేన( శిందే వర్గం) బీజేపీని ముప్పుగా పరిగణించడం లేదు.

ఆ పార్టీ జాతీయ సమన్వయ కర్త డాక్టర్ అభిషేక్ వర్మ బీజేపీ, తమ పార్టీ భావజాలం ఒకటే కాబట్టి, తాము పోటీ దారులం కాదని, పరస్పర భాగస్వాములుగా భావిస్తామని చెబుతున్నారు.

అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్డీయే కూటమిలో మహారాష్ట్రలో శివసేన 'పెద్దన్న' పాత్రలో ఉండేది.

ఈ మారిన సంబంధాన్ని "ఎన్నికల సమీకరణ"గా అభిషేక్ శర్మ చెబుతున్నారు.

"కొన్నిసార్లు మా సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇంకొన్ని సార్లు బీజేపీ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చు. ఇదే ఎన్నికల యంత్రాంగం. ఇందులో అందరూ కలిసి కూర్చున్న తర్వాతే సీట్లు, పదవులు నిర్ణయిస్తారు" అని ఆయన అన్నారు.

ప్రాంతీయ పార్టీల ఉనికిని విస్తృతం చేసే విషయానికొస్తే, తాము దాని గురించి ఆలోచిస్తున్నామని, అందులో భాగంగా యూపీలోని నిషాద్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. .

ఎన్నికల సమయంలో ప్రాంతీయ పార్టీలలో ఏర్పడిన చీలిక దానికి సంబంధించిన సైద్ధాంతిక ప్రశ్నల గురించి వర్మ వివరణ ఇచ్చారు.

"ఎన్డీయే నిబంధనలకు కట్టుబడి నాయకులు లేదా గ్రూపులు కూటమిలోకి వస్తామంటే అభ్యంతరం ఎందుకు? ఇతరులు ఎలా ఉండాలో మేం చెప్పలేం. అలాగని మా సిద్ధాంతాన్ని మార్చుకోం" అని అన్నారు.

2022లో శివసేనలో చీలిక తర్వాత శిందే వర్గం బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది.

భారత రాజకీయాలు, బీజేపీ, టీఎంసీ, నరేంద్రమోదీ, అరవింద్ కేజ్రీవాల్, శివసేన

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, మోదీ, నితీశ్

క్షీణిస్తున్న ప్రాంతీయ పార్టీల బలం

2014లో బీజేపీ 'కాంగ్రెస్ ముక్త్ భారత్' నినాదం 2026 నాటికి "ప్రాంతీయ పార్టీ ముక్త్ భారత్" దిశగా ప్రభావవంతంగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం కాలాన్ని మీరు ఎలా చూస్తున్నారు?

"బీజేపీ తన మిత్రపక్షాలను బలపడే రాజకీయాలు చేయదు" అని 1980ల నుంచి హిందూత్వ పార్టీల ఎదుగుదలను గమనిస్తున్న నీలాంజన్ ముఖోపాధ్యాయ్ చెప్పారు.

బిహార్‌లో ఎన్డీఏ మిత్రపక్షమైన జేడీయూ పరిస్థితే దీనికి ఉదాహరణ అనేది ఆయన అభిప్రాయం.

"బిహార్‌లో నితీశ్ కుమార్ అండతో ఎన్నికల్లో గెలిచిన కొద్దికాలానికే జేడీయూను పక్కనపెట్టి బీజేపీ తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టింది. రాబోయే రోజుల్లో జేడీయూ నాయకులు బీజేపీలో చేరతారు లేదా అది చాలా చిన్న రాజకీయ పార్టీగా మారిపోతుంది" అని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ వివరించారు.

అంతేకాకుండా టీఎంసీ, డీఎంకేకు సంబంధించిన ఇటీవలి పరిణామాలు కేంద్రంలో బీజేపీని బలోపేతం చేస్తున్నాయని చర్చలో పాల్గొన్న ప్రముఖులు భావిస్తున్నారు.

"తమిళనాడులో డీఎంకే ఇండీ కూటమి నుంచి విడిపోయింది. అది బీజేపీలో కలుస్తుందో లేదో చూడాలి. ఒకవేళ అలా జరిగితే లోక్‌సభ, రాజ్యసభలలో దాని స్థానం మరింత బలపడుతుంది. దాని పనితీరులో మరిన్ని మార్పులు కనిపిస్తాయి" అని నీలాంజన్ అన్నారు.

"ప్రాంతీయ పార్టీలు వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నాయి. బీజేపీ అందుకు భిన్నం కాదు. అక్కడ మోదీయే ప్రధాన పాత్రధారి. ఇతర పార్టీలలో బంధుప్రీతి ఉందని, తాము వ్యక్తుల ఆధారంగా రాజకీయాలు చేయమని, సిద్ధాంత పరమైన రాజకీయుల చేస్తామని చెప్పడం తప్పు" అని నీలాంజన్ వివరించారు.

వాజ్‌పేయి హయాంలో బీజేపీ సంస్థాగతంగా ఉండేది. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇచ్చేవారని, మోదీ హయాంలో పరిస్థితి అలా లేదని ఆయన అన్నారు.

నీలాంజన్ ముఖోపాధ్యాయ్ 2013లో నరేంద్ర మోదీ జీవిత చరిత్ర రాశారు.

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో బీజేపీ సంబంధాల విషయంలో ప్రధాని మోదీ వ్యూహాన్ని ఒక ఉదాహరణతో ఆయన వివరించారు.

"పుస్తకం రాసేందుకు చేసిన ఇంటర్వ్యూలో భాగంగా ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీల సంఖ్య ఎందుకు తగ్గుతోందని నేను ఆయనను (మోదీని) అడిగాను. అప్పుడాయన మాతో ఉండటం వల్ల తమకు ఏదైనా ప్రయోజనం చేకూరుతుందని భావించినప్పుడే మిత్రపక్షాలు కలుస్తాయని చాలా స్పష్టంగా చెప్పారు"

"నరేంద్ర మోదీ.. కూటమిని కేవలం ఒక లావాదేవీగా పరిగణిస్తున్నారు" అని ముఖోపాధ్యాయ్ అంటున్నారు.

2014లో బీజేపీ ఊహించిన దానికంటే పెద్ద మెజారిటీతో గెలిచిందని ఆయన చెప్పారు. 2014 నుండి 2019 మధ్య బీజేపీ తమ సంకీర్ణ భాగస్వాములకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. 2019 నుండి 2024 మధ్య కూడా ఇదే ధోరణి కనిపించింది.

"2024లో మెజారిటీ రానప్పుడు బీజేపీ మిత్ర పక్షాలతో మరింతగా సంప్రదింపులు జరుపుతారని ప్రజలు భావించారు. కానీ అలా జరగలేదు. దీనికి ఒక కారణం 'ఆపరేషన్ సింధూర్'. దాని ద్వారా వారు మళ్లీ శక్తిమంతంగా తిరిగి వచ్చారు. బీజేపీ ఎంపీల సంఖ్య తక్కువైనా, ఎన్డీయే ప్రభుత్వం 2014లో మాదిరిగానే పని చేస్తోంది" అని ముఖోపాధ్యాయ్ వివరించారు.

ఎన్డీయే భాగస్వాములపై మోదీ అభిప్రాయం

నీలాంజన్ ముఖోపాధ్యాయ్ 2013లో నరేంద్ర మోదీ జీవిత చరిత్ర రాశారు.

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో బీజేపీ సంబంధాల విషయంలో ప్రధాని మోదీ వ్యూహాన్ని ఒక ఉదాహరణతో ఆయన వివరించారు.

"పుస్తకం రాసేందుకు చేసిన ఇంటర్వ్యూలో భాగంగా ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీల సంఖ్య ఎందుకు తగ్గుతోందని నేను ఆయనను (మోదీని) అడిగాను. అప్పుడా యన మాతో ఉండటం వల్ల తమకు ఏదైనా ప్రయోజనం చేకూరుతుందని భావించినప్పుడే మిత్రపక్షాలు కలుస్తాయని చాలా స్పష్టంగా చెప్పారు"

"నరేంద్ర మోదీ కూటమిని కేవలం ఒక లావాదేవీగా పరిగణిస్తున్నారు" అని ముఖోపాధ్యాయ్ అంటున్నారు.

2014లో బీజేపీ ఊహించిన దానికంటే పెద్ద మెజారిటీతో గెలిచిందని ఆయన చెప్పారు. 2014 నుండి 2019 మధ్య బీజేపీ తమ సంకీర్ణ భాగస్వాములకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. 2019 నుండి 2024 మధ్య కూడా ఇదే ధోరణి కనిపించింది.

"2024లో మెజారిటీ రానప్పుడు బీజేపీ మిత్ర పక్షాలతో మరింతగా సంప్రదింపులు జరుపుతారని ప్రజలు భావించారు. కానీ అలా జరగలేదు. దీనికి ఒక కారణం 'ఆపరేషన్ సింధూర్'. దాని ద్వారా వారు మళ్లీ శక్తివంతంగా తిరిగి వచ్చారు. బీజేపీ ఎంపీల సంఖ్య తక్కువైనా, ఎన్డీయే ప్రభుత్వం 2014లో మాదిరిగానే పని చేస్తోంది" అని ముఖోపాధ్యాయ్ వివరించారు.

భారత రాజకీయాలు, బీజేపీ, టీఎంసీ, నరేంద్రమోదీ, అరవింద్ కేజ్రీవాల్, శివసేన

ఫొటో సోర్స్, K Raj/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, మోదీ వారసుడు ఎవరు అనేది బీజేపీకి అతి పెద్ద సవాలుగా మారుతుందని నీలాంజన్ ముఖోపాధ్యాయ భావిస్తున్నారు.

మోదీ తర్వాత ఎవరు?

ఒకవేళ ప్రధాని మోదీ రేపు లేదా 2029లో రాజకీయాల్లో రిటైర్‌మెంట్ ప్రకటిస్తే బీజేపీకి కూడా ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొంటున్న నాయకత్వ సంక్షోభం ఎదురవుతుందా?

ఈ ప్రశ్నపై ముఖోపాధ్యాయ్ స్పందించారు.

ప్రస్తుతం ప్రధాని మోదీ తన వారసుడిగా ఎవరిని నియమించాలో చెప్పగలరని అనిపించడం లేదని ఆయన అన్నారు

"మోదీ పదవీకాలం తర్వాత బీజేపీ పూర్తి పరివర్తన చెందుతుంది. ఇది ముందు అనుకున్నట్లు జరక్కపోతే బీజేపీపై ఆర్‌ఎస్‌ఎస్ ఆధిపత్యం మళ్లీ మొదలవుతుంది. అటువంటి పరిస్థితి వస్తే బీజేపీలో నాయకత్వ సంక్షోభం ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి" అని నీలాంజన్ ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)