మార్క్ జుకర్‌బర్గ్: మోదీ వీడియో డిలీట్, బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్ విషయంలో భారత్‌కు ‘సారీ’ చెప్పిన మెటా అధినేత

ఫొటో సోర్స్, Getty Images
బాలల లైంగిక వేధింపుల కంటెంట్ (CSAM), డీప్‌ఫేక్‌ల, తమ ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణలో దొర్లిన 'పొరపాట్ల'పై మార్క్ జుకర్‌బర్గ్, భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పినట్లు బీబీసీకి కొన్ని సోర్సుల ద్వారా తెలిసింది.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల నుంచి ప్రధాని మోదీ వీడియోను కొంతసేపు తొలగించినందుకు గానూ పార్లమెంటరీ ఐటీ కమిటీ క్షమాపణలు డిమాండ్ చేసిన సమయంలోనే మార్క్ జుకర్‌బర్గ్ నుంచి ఈ స్పందన వచ్చింది.
భారత్‌లో మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ డబ్బులు తీసుకుని బాలల లైంగిక వేధింపుల కంటెంట్‌ను (CSAM) వ్యాప్తి చేసే ప్రకటనలను రన్ చేస్తోందని గత నెలలో బీబీసీ ఐ చేసిన ఒక ఇన్వెస్టిగేషన్‌లో వెల్లడైంది.
ఈ ఇన్వెస్టిగేషన్ నివేదిక వెలువడిన తర్వాత, మెటా నుంచి వివరణ కోరాలని, కంపెనీ ప్రతినిధులను పిలిపించాలని అధికారులను ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు.
బీబీసీకి ఈ సమాచారం విశ్వసనీయ వర్గాల ద్వారా లభించింది.

బీబీసీకి అందిన సమాచారం ప్రకారం, నిర్దిష్టమైన కంటెంట్‌ను ప్రమోట్ చేయడానికి భారీగా డబ్బు చెల్లించారనే విషయాన్ని మార్క్ జుకర్‌బర్గ్ అంగీకరించారు.
ఈ విషయంపై విచారణ వ్యక్తం చేస్తూ ఆయన క్షమాపణలు కోరినట్లు సోర్సుల ద్వారా బీబీసీకి తెలిసింది.
చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను ప్రమోట్ చేశామని, నిర్దిష్ట వీక్షకులను లక్ష్యంగా చేసుకుని పెయిడ్ ప్రమోషన్లు నిర్వహించామని మెటా తమ తప్పును అంగీకరించింది.
హై-లెవల్ అధికారులతో మెటా బృందం భేటీ
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ వీడియో తొలగింపు వ్యవహారంలో మెటా గ్లోబల్ ఎఫైర్స్ చీఫ్ జోయెల్ కప్లాన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం బుధవారం న్యూదిల్లీలో ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్‌తో సమావేశమైంది.
ప్రధాని మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించినందుకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పార్లమెంటరీ ఐటీ కమిటీ డిమాండ్ చేసిన సమయంలోనే ఈ భేటీ జరిగింది.
దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో, ప్రధాని మోదీ వీడియో పొరపాటున ఎలా డిలీట్ అయిందో మెటా అధికారులు వివరణ ఇచ్చినట్లు వార్తా ఏజెన్సీ ఏఎన్‌ఐ పేర్కొంది.
ఇలాంటి తప్పులు మళ్లీ మళ్లీ జరిగితే, భారతదేశంలో మెటా కంపెనీకి లభించే చట్టపరమైన రక్షణలపై ప్రభావం పడుతుందని కూడా కమిటీ హెచ్చరించింది.

ఫొటో సోర్స్, Getty Images
మెటాపై ఆరోపణలు ఏంటి?
జంతర్ మంతర్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థుల నిరసనల సందర్భంగా జులై 23న విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి కొంతసేపు తొలగించారు. ఆ తర్వాత పునరుద్ధరించారు.
సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని మెటా స్పష్టం చేసినట్లు ఎన్డీటీవీ పేర్కొంది. అయితే, ఈ వివరణ 'సంతృప్తికరంగా లేదు' అని ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ప్లాట్‌ఫామ్ నుంచి ఆ కంటెంట్ 'పొరపాటున' డిలీట్ అయిందని, తర్వాత మళ్లీ ఆ వీడియోను ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తెచ్చామని కంపెనీ వెల్లడించింది.
బాలల లైంగిక వేధింపుల కంటెంట్‌ను వ్యాప్తిచేసే, మహిళలను కించపరిచే కంటెంట్ ఉండే ప్లాట్‌ఫామ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నేతృత్వంలోని పార్లమెంటరీ ఐటీ కమిటీ డిమాండ్ చేసింది.
మెటా ఒకవేళ తమ ఆదేశాలను పాటించకపోతే, భారత ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద వారికి లభించే 'సేఫ్ హార్బర్' రక్షణను రద్దు చేస్తామని కమిటీ చైర్మన్ నిషికాంత్ దుబే హెచ్చరించినట్లు ఆగస్టు 4న హిందూస్థాన్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
'సేఫ్ హార్బర్' నిబంధన ప్రకారం... ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో థర్డ్ పార్టీలు పోస్ట్ చేసే కంటెంట్‌కు ఆ కంపెనీలు చట్టపరంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉండదు (సదరు కంపెనీలు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నంత కాలం).
గూగుల్, మెటా, యూట్యూబ్ వంటి దిగ్గజ టెక్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అనంతరం నిషికాంత్ దుబే, విలేఖరులతో మాట్లాడారు.
ప్రధాని మోదీ వీడియో తొలగించడాన్ని "అత్యంత తీవ్రమైన అంశం" గా ఆయన అభివర్ణించారు.
మెటా కంటెంట్ నిర్వహణ విధానంలో లోపాలను ఇది ప్రతిబింబిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని మెటా గ్లోబల్ పాలసీ టీమ్‌కు చెందిన సీనియర్ అధికారులకు ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే సమన్లు జారీ చేసింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























