ఇరాన్ యుద్ధం సమయంలో నెతన్యాహు సీక్రెట్‌గా యూఏఈ వెళ్లారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అయోన్ వెల్స్
- హోదా, జెరూసలెం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఇరాన్‌తో యుద్ధం జరిగే సమయంలో తాను రహస్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈను) పర్యటించి, అక్కడ అధ్యక్షుడిని కలిశానని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు.
ఇజ్రాయెల్ ప్రధాని, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్‌ల మధ్య జరిగిన ఈ సమావేశం ఒక 'చారిత్రాత్మక పురోగతి'కి దారితీసిందని నెతన్యాహు కార్యాలయం పేర్కొంది.
ఈ ప్రకటన విడుదలైన వెంటనే స్పందించిన యూఏఈ విదేశాంగ శాఖ.. ఈ పర్యటనకు సంబంధించిన వాదనలు '' పూర్తిగా నిరాధారమైనవి'' అని పేర్కొంది. రెండు దేశాల మధ్య సంబంధాలు ''అనధికారిక ఏర్పాట్ల''పై ఆధారపడి లేవని తెలిపింది.
ఈ సంక్షోభ సమయంలో ఎమిరేట్స్‌లో పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంపై యూఏఈను తెహ్రాన్ పదేపదే విమర్శిస్తోంది.
ఇరాన్ భద్రతా సంస్థలు చాలా కాలం క్రితమే దేశ నాయకులకు ఏ విషయం అయితే చెప్పాయో, నెతన్యాహు ఇప్పుడు దాన్నే 'బహిరంగంగా వెల్లడించారు' అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అన్నారు.

ఇజ్రాయెల్‌తో కుమ్మకవ్వడం క్షమించరానిదని, అలా చేసే వారు ''జవాబుదారీ''గా ఉండాలని అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు.
అయితే, నెతన్యాహు కానీ, మరే ఇతర ఇజ్రాయెల్ సైనికాధికారులు కానీ తమ దేశంలో పర్యటించినట్లు వస్తోన్న రిపోర్టులను యూఏఈ విదేశాంగ శాఖ తన ప్రకటనలో కొట్టివేసింది.
''ఇజ్రాయెల్‌తో మా సంబంధాలు బహిరంగమైనవి. అధికారికంగా ప్రకటించిన అబ్రహం ఒప్పందాలకు చెందిన ఫ్రేమ్‌వర్క్‌లోనే ఈ సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ సంబంధాలు ఎలాంటి పారదర్శక లేని, అనధికారిక ఏర్పాటుపై ఆధారపడి లేవు'' అని యూఏఈ పునరుద్ఘాటించింది.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో అనేక అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను సాధారణీకరించే చర్యగా అబ్రహం ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
నెతన్యాహు, యూఏఈ అధ్యక్షుడు మధ్య సమావేశం ఒమన్‌తో ఉన్న సరిహద్దుకు సమీపంలోని ఒయాసిస్ నగరం అల్-ఐన్‌లో జరిగిందని, ఇది చాలా గంటల పాటు కొనసాగిందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది.
ఇరాన్ దాడులను ఎదుర్కొనేలా యూఏఈకు సాయం చేసేందుకు ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ సిస్టమ్ నుంచి యాంటీ-మిసైల్ బ్యాటరీలను పంపిందని ఇజ్రాయెల్‌లోని అమెరికా అంబాసిడర్ మైక్ హక్‌బీ మంగళవారం తెలిపారు.
ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్‌కు చెందిన అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థ. గగనతల క్షిపణులను, రాకెట్‌లను, డ్రోన్లు అడ్డుకుని, ధ్వంసం చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు.
అబ్రహం ఒప్పందాల ఆధారంగా యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య ''అసాధారణమైన సంబంధాల'' ఫలితమే ఈ ఐరన్ డోమ్ మోహరింపు అని హక్‌బీ అన్నారు.
ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం ఆ సంబంధాలను మరింత దృఢంగా మార్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడిగా సైన్యాన్ని కూడా అభివృద్ధి చేశాయి.

ఫొటో సోర్స్, Reuters
యుద్ధం సమయంలో.. యూఏఈపై ఇరాన్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ నుంచి ప్రయోగించిన రెండు డ్రోన్లను వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని మే 10న యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఫిబ్రవరి చివరిలో ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌లు యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి మొత్తంగా 551 బాలిస్టిక్ మిసైళ్లను, 29 క్రూయిజ్ మిసైళ్లను, 2,265 డ్రోన్లను ఎదుర్కొన్నట్లు పేర్కొంది.
యూఏఈ కూడా ఇరాన్‌పై దాడులు జరిపిందని సోమవారం వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. అయితే, ఇప్పటి వరకు దీన్ని అంగీకరించలేదని పేర్కొంది. ఇందులో ఏప్రిల్ ప్రారంభంలో ఇరాన్‌లోని లావన్ ద్వీపంలో ఉన్న ఒక రిఫైనరీపై జరిగిన దాడి కూడా ఉందని తెలిపింది.
దౌత్యానికి యూఏఈ కట్టుబడి ఉందని, కానీ, తనకు తాను రక్షించుకునే హక్కు కూడా ఉందని యూఏఈ అధ్యక్షుని సలహాదారు అన్వర్ గర్గాష్ చెప్పారు.
యూఏఈ యుద్ధాన్ని కోరుకోలేదని దాన్ని నివారించడానికి కృషి చేసిందని గర్గాష్ తన పోస్టులో రాశారు. '' గల్ఫ్‌లో అరబ్-ఇరాన్ సంబంధాలు ఘర్షణలు, వివాదాలపై ఏర్పడవు'' అని చెప్పారు.
ఇరాన్, అమెరికా మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందం దాదాపు నెల రోజులుగా అమల్లో ఉంది.
అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ ఇంకా హార్ముజ్ జలసంధిని మూసివేసే ఉంచింది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. సాధారణంగా ప్రపంచానికి అవసరమయ్యే చమురు, లిక్విడిఫైడ్ నేచురల్ గ్యాస్‌ల్లో 20 శాతం ఈ జలసంధి గుండానే సరఫరా అవుతాయి. తమ షరతులకు అంగీకరించేలా తెహ్రాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధాన్ని అమెరికా కొనసాగిస్తోంది.
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, యుద్ధాన్ని ముగించేందుకు కావాల్సిన తమ డిమాండ్లను వెల్లడిస్తూ.. అమెరికాకు కౌంటర్ ఆఫర్ పంపింది. ట్రంప్ ఈ ప్రతిపాదనలను తిరస్కరించారు. పూర్తిగా ఇవి ఆమోదయోగ్యం కానివని పేర్కొన్నారు. ఇవి ఒక చిత్తు కాగితంగా వర్ణించారు. కాల్పుల విరమణ తీవ్రంగా విఫలమయ్యే దశలో ఉందని అన్నారు.
ఇరాన్ సాయుధ దళాలు ఏ దురాక్రమణకైనా స్పందించి, బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























