పేలని అమెరికా, ఇజ్రాయెల్ బాంబులు ఇరాన్‌కు వరంగా మారాయా?

ఫొటో సోర్స్, US NAVY/AFP via Getty Images
- రచయిత, బీబీసీ మానిటరింగ్
- చదివే సమయం: 4 నిమిషాలు
పేలని అమెరికా, ఇజ్రాయెల్ బాంబులు, ఆయుధాలను రివర్స్ ఇంజనీరింగ్ చేయడం గురించి ఇరాన్‌లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఘర్షణల సమయంలో దొరికిన ఈ ఆయుధాలను ఒక గొప్ప అవకాశంగా ఇరాన్ మీడియా, విశ్లేషకులు భావిస్తున్నారు. వీటితో దేశ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని వారు చెబుతున్నారు.
హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లో 15కు పైగా బరువైన అమెరికా క్షిపణులను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ విజయవంతంగా నిర్వీర్యం చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ ఇంగ్లిష్ టీవీ చానల్ 'ప్రెస్ టీవీ' ఏప్రిల్ 26న రిపోర్ట్ చేసింది.
ఈ ఆయుధాల సాంకేతికతను అర్థం చేసుకుని, తిరిగి తయారు చేయడానికి (రివర్స్ ఇంజనీరింగ్) వీటిని టెక్నాలజీ, రీసెర్చ్ విభాగాలకు అప్పగించినట్లు తెలిపింది. వీటిలో అమెరికాకు చెందిన జీబీయూ-57 బంకర్-బస్టర్ బాంబులతో పాటు జంజన్ ప్రాంతంలో దొరికిన వేలాది చిన్న బాంబులు (బాంబ్లెట్స్) కూడా ఉన్నాయని కథనంలో పేర్కొంది.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 40 రోజుల పాటు యుద్ధం జరిగిన తర్వాత ఏప్రిల్ 8న రెండు వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు.
అయితే, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ దీనిని మరికొంత కాలం పొడిగించారు.


ఫొటో సోర్స్, Getty Images
'అడగని బహుమతి'
ఇరాన్ 'స్టూడెంట్ న్యూస్ నెట్‌వర్క్'(ఎస్ఎన్ఎన్) మే 1న ఈ ఆయుధాలను "అడగని బహుమతి"గా అభివర్ణించింది.
యుద్ధభూమి ఇప్పుడు దేశ రక్షణ రంగ పరిశ్రమకు ఒక "పరిశోధనశాల"గా మారిందని అది పేర్కొంది.
అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోగించిన బాంబులు, ఆయుధాలను ఒక వ్యూహాత్మక అవకాశంగా మార్చుకోవచ్చని ఎస్ఎన్ఎన్ తెలిపింది.
ఇరాన్ భూభాగంలో ఉండిపోయిన ఈ ఆయుధాలను మెరుగైన సాంకేతికతగా అభివృద్ధి చేయడానికి ఉపయోగించవచ్చని ఆ నెట్‌వర్క్ పేర్కొంది. ఈ ఆధునిక ఆయుధాల్లోని 'రహస్య సాంకేతికతను' ఇరాన్ అర్థం చేసుకుంటుందనేదే పాశ్చాత్య దేశాల అసలు భయమని వివరించింది.
అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఇరాన్ చాలా కాలంగా రివర్స్ ఇంజనీరింగ్‌పైనే ఆధారపడుతోందని ఎస్ఎన్ఎన్ తెలిపింది. ఉదాహరణకు, ఇరాన్ గతంలో అమెరికా హాక్ క్షిపణుల్లో మార్పులు చేసింది. 2011లో అమెరికా ఆర్‌క్యూ-170 డ్రోన్ క్షిపణులను స్వాధీనం చేసుకోవడం కూడా ఇలాంటిదే.
ఆ సంఘటన తర్వాతే ఇరాన్ కేవలం 'నకలు చేయడం' నుంచి 'ఆవిష్కరణల' వైపు అడుగులు వేసిందని ఎస్ఎన్ఎన్ పేర్కొంది.
ఈ సాంకేతికతను చైనా, రష్యా వంటి అమెరికా ప్రత్యర్థి దేశాలతో పంచుకోవచ్చని 'కేహాన్' పత్రిక ఎడిటర్ హొస్సేన్ షరియతమ్దారీ సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
'మనకు శుభవార్త.. అమెరికాకు చెడు వార్త'
యుద్ధం సమయంలో టోమహాక్, ఏజీఎం-158 వంటి అత్యాధునిక క్షిపణులు, ఎంక్యూ-9 డ్రోన్లు పెద్ద సంఖ్యలో విఫలమయ్యాయని హొస్సేన్ అన్నారు. ప్రభుత్వ మీడియా ప్రతినిధులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
"ఈ క్షిపణులను రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాం. భవిష్యత్తులో వీటిని శత్రువుల మీదనే ప్రయోగిస్తాం" అని ఒక టీవీ యాంకర్ అన్నారు.
ప్రభుత్వ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఇది 'మనకు శుభవార్త, అమెరికాకు చెడు వార్త'గా అభివర్ణించారు. త్వరలోనే వీటిని 'భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తామని' మరికొందరు నెటిజన్లు రాశారు.
ఇది 'కేవలం ఒక వార్త మాత్రమే కాదు, సరికొత్త జ్ఞాన పోరాటానికి ఆరంభం' అని తెహ్రాన్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఎహసాన్ ఖరామిద్ అభిప్రాయపడ్డారు.
ఈ ఆయుధాల ద్వారా అమెరికా సాంకేతికతలో ఉన్న 'రహస్య కోణాలు' బయటపడతాయని పాశ్చాత్య మీడియా కథనాలను ఉటంకిస్తూ ఖరామిద్ చెప్పారు.
దీనివల్ల అమెరికా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడానికి వేల కోట్ల డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందని, భవిష్యత్తులో సైనిక చర్యల విషయంలో ఆ దేశం మరింత జాగ్రత్తగా ఉంటుందని మిడిల్ ఈస్ట్ వ్యవహారాల విశ్లేషకులు ఎహసాన్ తకద్దోసి చెప్పారు.
"ఇది తాళం చెవి లేకపోయినా, ఆ తాళం పనిచేసే తీరును అర్థం చేసుకోవడం వంటిది. అసలు ప్రయోజనం ఆ ఆయుధాలను నేరుగా వాడటంలో లేదు, వాటి సాంకేతికతను అర్థం చేసుకుని తిరిగి తయారు చేయడంలో ఉంది" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































