రావు బహదూర్ రివ్యూ: మరణశయ్యపై రామప్ప.. ఆ చివరి కోరిక వెనుక దాగిన రహస్యమేమిటి?

రావు బహదూర్ సినిమా రివ్యూ, సత్యదేవ్, వెంకటేష్ మహా

ఫొటో సోర్స్, Facebool/Venkatesh Maha

ఫొటో క్యాప్షన్, వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన 'రావు బహదూర్' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

కొత్త కథలు ఉండవు. రచయితే కొత్త కథలను పుట్టించాలి. ఆ కథలను ఇంకా కొత్తగా తెరపై చూపించగలగాలి. దర్శకుడు వెంకటేష్ మహా తన తొలి చిత్రం కేరాఫ్ కంచరపాలెంతో ఒక సాధారణ మనిషి జీవితంలోని సంఘటనలను సరికొత్త చమక్కుతో, హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించారు.

తొలి సినిమాతోనే ఒరిజినల్ ఫిల్మ్‌మేకర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు 'రావు బహదూర్‌'తో మరో వైవిధ్యమైన ప్రయత్నం చేశారు.

నిర్మాతలు ముక్తకంఠంతో ఇదొక కొత్త అనుభూతిని అందించే చిత్రమని ప్రచారం చేయడంతో 'రావు బహదూర్‌'పై ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది.

మరి నిజంగానే 'రావు బహదూర్' మునుపెన్నడూ చూడని తెలుగు సినిమానా? ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి?

వెండితెరపై దర్శకుడు వెంకటేష్ మహా ఆవిష్కరించిన ఈ సైకలాజికల్ డ్రామా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రావు బహదూర్ సినిమా రివ్యూ, సత్యదేవ్, వెంకటేష్ మహా

ఫొటో సోర్స్, facebook/GMBents

కథేమిటి?

1960 నుంచి 1990 మధ్యకాలంలో భువనాలయం అనే రాజభవనంలో జరిగే కథ ఇది. ఆ భువనాలయానికి అధిపతి రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) జీవితం చరమాంకంలో ఉంటుంది. ఆయనకు లివర్ క్యాన్సర్ అని వైద్యులు తేల్చేస్తారు. మరికొద్ది రోజులే జీవితం అని చేతులెత్తేస్తారు.

అయితే రావు బహదూర్‌కు ఒక చివరి కోరిక ఉంటుంది. అది సాధారణ కోరిక కాదు, ఓ అనుమానంతో కూడిన కోరిక. మరి ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి రావు బహదూర్ ఏం చేశాడు? తనను అంతలా వేధించిన ఆ అనుమానం ఏమిటి? అన్నదే కథ..

దర్శకుడు వెంకటేష్ మహా ఈ కథను సైకలాజికల్ డ్రామా, మ్యాజికల్ రియలిజం, డార్క్ హ్యూమర్ వంటి విభిన్న జానర్స్‌లో తెరకెక్కించాడు.. అదే సమయంలో లింగ, రంగు వివక్ష, రాచరికపు పోకడలు, వంశం, రక్తం, మానవ నైజం వంటి అనేక అంశాలను స్పృశించాడు.

ఇందులో ప్రతి విజువల్‌కు, ప్రతి డైలాగ్‌కూ, ప్రతి ఎక్స్‌ప్రెషన్‌కూ ఒక అంతర్లీన అర్థం ఉంటుంది. సినిమా పూర్తయిన తర్వాత ఒక్కో సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ వెళ్తే అందులోని మెటాఫర్స్, సబ్‌టెక్స్ట్ ఒక్కొక్కటిగా ప్రేక్షకుడికి అర్థమవుతాయి.

రావు బహదూర్ సినిమా రివ్యూ, సత్యదేవ్, వెంకటేష్ మహా

ఫొటో సోర్స్, Facebool/Venkatesh Maha

సినిమాలో నాటకం

ఇది రెగ్యులర్ సినిమా కాదు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అనే విభజన కంటే ఒక నిరంతర నాటకంలా సాగుతుంది. రామప్ప పాత్ర ఫిలాసఫీ ద్వారా మానవ సమాజంలో ఆదిమానవుల కాలం నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న అనేక సామాజిక రుగ్మతలను దర్శకుడు ఎత్తిచూపే ప్రయత్నం చేశాడు.

క్లైమాక్స్‌లో ఆచారి, రేణుక పాత్రలు రామప్ప చెవిలో చెప్పే చివరి మాటలు ఈ కథను మరో స్థాయికి తీసుకెళ్తాయి.

దర్శకుడు వెంకటేష్ మహా తన తొలి చిత్రం కేరాఫ్ కంచరపాలెంలో మాదిరిగానే ఇక్కడ కూడా ఒక ట్విస్ట్‌ను ఉంచుకున్నాడు.

అయితే అక్కడ అది విజువల్‌గా బలంగా పనిచేస్తే, ఇక్కడ పూర్తిగా డైలాగ్‌ల మీద ఆధారపడింది. ఆ చివరి మాటలను సరిగ్గా వింటే దర్శకుడు చెప్పదలచుకున్న అసలు ఉద్దేశం మరింత స్పష్టమవుతుంది.

రావు బహదూర్ సినిమా రివ్యూ, సత్యదేవ్, వెంకటేష్ మహా

ఫొటో సోర్స్, Facebool/Venkatesh Maha

ఆకట్టుకున్న సత్యదేవ్

రామప్ప పాత్ర ఈ సినిమాకు ప్రాణం. ఆ పాత్రలో సత్యదేవ్ జీవించేశాడు. సినిమాలో ఆయన నాలుగైదు గెటప్స్‌లో కనిపిస్తాడు. ఒక్క గెటప్‌లో కూడా ప్రేక్షకుడికి సత్యదేవ్ కనిపించడు. కేవలం రామప్ప మాత్రమే కనిపిస్తాడు. ఆ పాత్ర సైకీ, మేనరిజమ్స్‌ను ఆయన చాలా బాగా ఆవిష్కరించాడు. నటుడిగా ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర ఇది. ముఖ్యంగా కౌరవులతో సంభాషణలు, సంజయ్ గాంధీతో మాట్లాడే సన్నివేశాలు, తన భ్రమలు పాత్రను వినోదాత్మకంగా కూడా నిలబెడతాయి.

రేణుక పాత్రలో దీపా థామస్ ఎంతో హుందాగా నటించారు. మొదట్లో చలాకీగా కనిపించే ఆ పాత్ర, పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోతుంది. రాచరికపు కట్టుబాట్లకు బంధీ అయిన మహిళగా ఆమె చూపించిన నటన హత్తుకుంటుంది. తక్కువ మాటల్లోనే, కళ్లతో ఎన్నో భావాలను పలికించారు.

ఆచారి పాత్రలో వికాస్ ఈ సినిమాకు మరో ఆకర్షణ. ఆయన నటన చాలా సహజంగా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో ఆ పాత్రపై కలిగే అనుమానాలు కథలోని డ్రామాను మరింత రక్తికట్టిస్తాయి. కుసుమ పాత్రలో నటించిన పిల్లాడి నటన హృదయాన్ని తాకుతుంది. ఆ పాత్ర చుట్టూ నడిచే సన్నివేశాలు కదిలిస్తాయి. ముఖ్యంగా రంగు ఆధారంగా జరిగే వివక్షను దర్శకుడు చూపించిన తీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే పనిమనిషి అచ్చమ్మ పాత్రలో నటించిన నటి కూడా ఎంతో సహజంగా ఒదిగిపోయింది. వెంకటేష్ మహా రాచరికాన్ని నూరిపోసే ఒక పాత్రలో ఆకట్టుకుంటాడు.

రావు బహదూర్ సినిమా రివ్యూ, సత్యదేవ్, వెంకటేష్ మహా

ఫొటో సోర్స్, Facebool/Venkatesh Maha

భిన్నమైన సంగీతం

సంగీత దర్శకుడు స్మరణ్ సాయి అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఒక ఒపేరా చూస్తున్న అనుభూతిని కలిగించే సంగీతం వినిపిస్తుంది.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉండే ఈ సంగీతం.. కొత్త అనుభూతిని అందిస్తుంది. ఇలాంటి సంగీతానికి ప్రేక్షకులు అలవాటు పడితే తెలుగు సినిమాకు మరిన్ని కొత్త సంగీత రూపాలు పరిచయం అయ్యే అవకాశం ఉంది.

కెమెరా వర్క్, ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఎంతో ప్రామాణికంగా, రాచరికపు వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. దర్శకుడు వెంకటేష్ మహా రాసుకున్న భావాలను లోతుగా అర్థం చేసుకుంటే ఈ సినిమాలో అనేక పార్శ్వాలు, అర్థాలు కనిపిస్తాయి.

'బాక్సాఫీస్ ఫలితమే తేల్చాలి'

తెలుగులో సైకలాజికల్ డ్రామాలు వచ్చినా, మ్యాజికల్ రియలిజాన్ని ఇంత బలంగా ఉపయోగించిన సినిమాల్లో ఇది ప్రముఖంగా ఉంటుంది.

కొత్త తరహా సినిమాలు కావాలని కోరుకునే ప్రేక్షకులకు రావు బహదూర్ తప్పకుండా నచ్చుతుంది.

ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం ఆధారంగా తెలుగు ప్రేక్షకులు నిజంగా ఎంత కొత్తదనాన్ని కోరుకుంటున్నారో కూడా అర్థమవుతుంది.

(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)