సైన్యంలోని మహిళలను ‘లైంగిక హింస ప్రచారం’లో పావుగా ఎలా వాడుతున్నారంటే...

ఫొటో సోర్స్, Keti Leshkasheli
- రచయిత, శాండ్రో గ్విన్డాజే, డయానా కురిష్కో, యారోస్లావా కిర్యుఖినా
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
యుక్రెయిన్ సాయుధ దళాలలో పనిచేసిన జార్జియన్ డాక్టర్ కేటీ లెష్కాషెలి దాదాపు మూడేళ్ల కిందట, ఓ రోజు యుద్ధం నుంచి తిరిగి వచ్చేసరికి ఆమె ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది.
ఆమె క్షేమంగా ఉందో లేదో తెలుసుకోవడానికి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఫోన్లు చేస్తున్నారు. ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారంటూ టెలిగ్రామ్‌లో వచ్చిన పోస్టులను వారు చూశారు.
"నాతో సహా కొందరు అమ్మాయిలను బంధించారంటూ ఒక వీడియో ప్రచారంలో ఉన్నట్లు నాకు తెలిసింది. మాకు ఎలాంటి 'శిక్ష' విధిస్తున్నారో చూపే ఒక టెలిగ్రామ్ చానెల్ లింక్ అందులో ఉంది" అని ఆమె బీబీసీతో చెప్పారు.
ఆ లింక్‌లో కనిపిస్తున్నది తన ఫోటోయేనని ఆమె గుర్తుపట్టారు. చాలా రోజుల కిందట తూర్పు యుక్రెయిన్‌లోని అవ్డీవ్కా నగరంలో పని చేసినప్పుడు మిలటరీ యూనిఫామ్‌లో ఉండగా ఆ ఫోటో ఆమె తీసుకున్నారు.
ఇప్పుడు ఆ నగరం రష్యా ఆక్రమణలో ఉంది.

‘‘వాళ్లు నా గురించి అన్నిరకాల భయంకరమైన విషయాలు రాశారు" అని ఆమె వివరించారు. ‘‘నాకు చాలా కోపంగా ఉంది. కానీ, నేనేమీ చేయలేను’’ అన్నారామె.
ఈ పోస్ట్ టెలిగ్రామ్‌లోని విస్తృతమైన తప్పుడు ప్రచారాల నెట్‌వర్క్‌లో భాగం. యుక్రేనియన్ మహిళలపై అత్యాచారాలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేస్తూ, తమ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని చెబుతూ యూజర్లను తమ అనుకూల చానెళ్ల వైపు ఆకర్షించేందుకు రష్యన్లు ఈ వ్యూహాన్ని ఉపయోగించారు.
ఈ ప్రచారంలో క్లిక్‌బైట్ (క్లిక్ చేసేలా ఆకర్షించడం)గా ఉపయోగించిన 20 మందికి పైగా మహిళల చిత్రాలను బీబీసీ గుర్తించింది. ఆ మహిళల్లో చాలామంది యుక్రేనియన్ సైన్యంలో పనిచేస్తున్నవారు లేదా గతంలో పనిచేసిన వారున్నారు. ఈ మహిళల్లో ఏడుగురితో బీబీసీ మాట్లాడింది.

ఫొటో సోర్స్, Keti Leshkasheli
క్లిక్‌బైట్ ఫార్ములా
2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుంచి యుక్రెయిన్ యుద్ధ ఖైదీలపై అత్యాచారం చేసి ఉరితీస్తున్న చిత్రాలను చూపిస్తామంటూ టెలిగ్రామ్ గ్రూపులు లేదా చానెళ్లలోని వేల పోస్ట్‌లు ప్రచారం చేసుకున్నాయి.
టెలిగ్రామ్ అనేది ఒక మెసేజింగ్ అప్లికేషన్. యూజర్లు కంటెంట్‌ను షేర్ చేసుకోవడానికి చర్చించడానికి పెద్ద చానెల్లో లేదా గ్రూపులలో యూజర్లు చేరుతుంటారు.
ఈ స్పేస్‌లలోని పోస్ట్‌లలో ఇతర చానెళ్లు, ప్రైవేట్ గ్రూపులు లేదా బయటి సైట్లను లింక్ చేసే ప్రకటనలు ఉంటాయి.
రష్యాలో దీనికున్న ప్రజాదరణ దృష్ట్యా ఇందులో పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు.
2025లో యుక్రేనియన్లకు ఇది ప్రధాన వార్తా మాధ్యమంగా ఉందని జాతీయ సర్వేలో తేలింది.
ఈ టెలిగ్రామ్ పోస్ట్‌లలో పదేపదే ఉపయోగించిన పదబంధాలు నకిలీ పేర్లను విశ్లేషించిన తర్వాత 6500 కంటే ఎక్కువ లైంగిక దాడి ప్రకటనలు ఉన్నట్లు బీబీసీ కనుగొంది.
ఈ ప్రకటనల్లో 'అడల్ట్ కంటెంట్' నుంచి యుద్ధ అనుకూల సమాచారం, ఫైనాన్స్, మీమ్స్ వరకు వివిధ అంశాలు ఉన్నాయి.
వీటిని దాదాపు 1700 చిన్న చానెళ్లు ప్రచురించాయి.
మొత్తంగా ఈ పోస్ట్‌లకు 6.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇవన్నీ చాలా వరకు ఒకే ఫార్ములాను అనుసరించాయి.
వీటిని పోస్ట్ చేసిన వాళ్లు నిజమైన మహిళల ఫోటోలను ఉపయోగించారు. వాళ్లను కిడ్నాప్ చేశారని, రేప్ చేశారని తప్పుడు వార్తలు ప్రచారం చేశారు.
అందుకు సంబంధించి వీడియో ఆధారాలు ఇస్తామని చెబుతూ, వాటి లింక్‌లను పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
భయానక చిత్రాలు చూపిస్తామంటూ ఎర
యూజర్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగా ఇంకా దారుణమైన ఫోటోలను, వీడియోలను చూపిస్తామని హామీ ఇచ్చేవారు.
కొన్ని పోస్టుల్లో యుక్రేనియన్ మహిళా సైనికులు రష్యా సైనికులను హింసించారని లేదా "రష్యా పిల్లలను సజీవంగా దహనం చేయడానికి ప్రోత్సహించార"ని కూడా పేర్కొన్నాయి.
ఈ ఆరోపణలతో పాటు జాతి, లైంగిక దూషణలు కూడా జోడించారు.
అయితే యూజర్లు ఆ పోస్ట్‌లను యాక్సెస్ చేసినప్పుడు ఇస్తామని చెప్పిన కంటెంట్ అక్కడ లేదు.
ఆ పోస్టులకు సంబధించిన లింక్‌ను క్లిక్ చేయగానే అవి యుద్ధ అనుకూల కంటెంట్‌తో నిండిన ప్రైవేట్ టెలిగ్రామ్ చానెళ్లకు తీసుకెళ్లాయి.
ఈ పోస్ట్‌లు టెలిగ్రామ్‌కు మించి వ్యాపిస్తున్నాయి. టిక్‌టాక్, యూట్యూబ్‌లోని వీడియోలు రష్యన్ సోషల్ నెట్వర్క్ వీకేలోని పోస్ట్‌లు అదే కంటెంట్‌ను వాగ్దానం చేస్తూ ఆ ప్రైవేట్ టెలిగ్రామ్ చానెళ్లను ప్రచారం చేస్తున్నాయి.
ఈ ప్రచారం యూజర్ల దృష్టిని "ఆకర్షించడానికి డబ్బు సంపాదించడానికి" లైంగిక హింస వాగ్దానాన్ని "వినోదంగా విక్రయిస్తుంది" అని లింగ ఆధారిత తప్పుడు సమాచారాన్ని అధ్యయనం చేసే పరిశోధకురాలు వాలెంటినా షాపోవాలోవా పేర్కొన్నారు.
ఇవి నేరుగా ప్రభుత్వం తయారు చేయనప్పటికీ, యుక్రేనియన్లను అవమానించడం 'శత్రువుల్ని' లైంగికంగా హింసించడం కామన్ అని చెప్పడం ద్వారా ఇవి క్రెమ్లిన్ యుద్ధ లక్ష్యాలకు ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.
శాంపిల్స్‌ను గుర్తించడం, పోస్ట్‌ల మధ్య సంబంధాలను మ్యాపింగ్ చేయడం ద్వారా ఈ ప్రచారం నుంచి ప్రయోజనం పొందుతున్న చానెళ్ల నెట్‌వర్క్‌ను బీబీసీ గుర్తించింది.
ఆరు చానెళ్లు పది లక్షల కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్ల మైలురాయిని దాటాయి. వీటిలో అత్యంత తీవ్రమైన మూడు కేసులను బీబీసీ విశ్లేషించింది.
ఇవన్నీ 2022 ఫిబ్రవరిలో రష్యా దాడి ప్రారంభమయ్యాక ఒకదాని తర్వాత ఒకటి 72 గంటల వ్యవధిలో ఏర్పడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న నకిలీ అకౌంట్లు
ఈ మూడు చానెళ్లు రష్యా ప్రభుత్వ మీడియా నుంచి సమాచారాన్ని తీసుకుంటాయి. క్రెమ్లిన్ ఎడిటోరియల్ విధానానికి అనుకూలంగా పని చేస్తాయి.
రష్యన్ సైనికుల పురోగతిని "విముక్తి"గా అభివర్ణిస్తాయి. యూరోపియన్ యూనియన్, బ్రిటన్లను దురాక్రమణదారులుగా చిత్రీకరిస్తాయి.
యుక్రేనియన్ల మరణాలను సెలబ్రేట్ చేస్తాయి. వాటిలో రెండు చానెళ్లు యుక్రేనియన్లకు వ్యతిరేకంగా జాతి దూషణలను ఉపయోగిస్తున్నాయి.
యుద్ధ అనుకూల కంటెంట్ నుంచి ఈ చానెళ్లు ఎంత లాభం పొందుతున్నాయో తెలుసుకోవడానికి ప్రకటనదారులుగా నటిస్తూ బీబీసీ వాటిని సంప్రదించింది. ప్రియామోయ్ ఎఫిర్ నోవోస్టి అనే చానెల్ ప్రతి ప్రకటనకు కనీసం 5లక్షల రూబుల్స్ (రూ.5.50 లక్షలు) వసూలు చేస్తామని చెప్పింది.
దూషణలు హింసాత్మక కంటెంట్‌ను ప్రసారం చేసే మిగిలిన రెండు చానెళ్లు ఒక్కోదానికి దాదాపు 40వేల రూబుల్స్ వసూలు చేస్తామని తెలిపాయి.
బీబీసీ అడిగిన ఏ ప్రశ్నకూ ప్రియామోయ్ ఎఫిర్ సమాధానం ఇవ్వలేదు.
‘బీబీసీ ఒక రెచ్చగొట్టే చానెల్’ అంటూ ఒక ప్రకటనలో ఆ చానెల్ అభివర్ణించింది. అలాగే బీబీసీ సమాచారం వాస్తవాలకు విరుద్ధమని వాదించింది.
బీబీసీ గుర్తించిన ఇలాంటి 6,500 పైగా తప్పుదోవ పట్టించే పోస్ట్‌లలో దాదాపు 5,400 పోస్టులను తొలగించారు.
అయినప్పటికీ కొత్తవి వస్తూనే ఉన్నాయి. కొన్ని ఆటోమేషన్ సంకేతాలను చూపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Lesia Palahniuk
హింసాత్మక పోస్టింగులలో తమ చిత్రాలను ఉపయోగించడంపై మహిళలు దాఖలు చేసిన అధికారిక ఫిర్యాదులు చాలా వరకు వృథా అయ్యాయి. తాను టెలిగ్రామ్‌కు పదేపదే ఫిర్యాదులు చేశానని కేటీ పేర్కొన్నారు.
"ఏదైనా చేయడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు" అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
2022, 2023, 2024లలో చాలా చానెళ్లలో తన ఫోటోలను ఉపయోగించిన పోస్టులను చూశానని, చివరికి ఆమె వాటిని వెంటాడటం మానేశానని యుక్రెయిన్ కోసం పోరాడేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రష్యా పౌరురాలు ఒలెక్సాండ్రా చెప్పారు.
"నా ఫోటోలను ఉపయోగించడం, నా ముఖాన్ని నగ్న శరీరంపై డిజిటల్‌గా మార్చడం నేను చూశాను. అది ఏ స్థాయికి చేరిందంటే ఒకానొక దశలో నేను స్పందించడం మానేశా" అని ఆమె చెప్పారు.
దీనిపై స్పందన కోసం టెలిగ్రామ్‌ను బీబీసీ సంప్రదించింది. అయితే టెలిగ్రామ్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
రష్యా చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణతో రష్యన్ మీడియా నియంత్రణ సంస్థ దేశంలో టెలిగ్రామ్‌పై 2016 ఫిబ్రవరి నుంచి నియంత్రణ విధించింది.
అయినప్పటికీ రష్యన్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయడానికి వీపీఎన్‌లను ఉపయోగించడంతో ప్రభుత్వ నిర్ణయం పెద్దగా ప్రభావం చూపలేదు.
ఇలాంటివి మహిళలపై భరించలేని అవమానాన్ని మోపుతున్నాయని అశ్లీల పదజాలంతో కూడిన ప్రచురణలలో తన ఫోటో ఉపయోగించడంపై స్పందిస్తూ చెర్నివ్స్టీకి చెందిన ప్రాంతీయ కౌన్సిలర్ లెసియా పలాహ్నియుక్ అన్నారు.
"ఒక మహిళకు ఆ ఫోటోలను చూడటం చాలా కష్టం" అని ఆమె చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























