ప్రాంతీయ పార్టీల చీలికలు: ఇక బీజేపీ టీడీపీపై ఆధారపడాల్సిన పనిలేదా?

చంద్రబాబు, మోదీ

ఫొటో సోర్స్, X/AndhraPradeshCM

ఫొటో క్యాప్షన్, టీఎంసీ చీలిక వర్గం ఎన్‌సీపీగా అవతరించక మునుపు ఎన్‌డీఏలో బీజేపీ తరువాత సంఖ్యాపరంగా అతిపెద్ద భాగస్వామి టీడీపీ
    • రచయిత, రజనీష్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో 'అబ్ కీ బార్, 400 పార్' (ఈసారి 400 దాటాలి) అనే నినాదాన్ని ఇచ్చినప్పటికీ, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి వీలైన స్థానాలు కూడా గెలుచుకోలేకపోయింది. కేవలం 240 స్థానాలకే పరిమితమైంది.

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 272 స్థానాలు అవసరం. అంటే బీజేపీకి సాధారణ మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ వచ్చాయి. దీంతో, మోదీ ప్రభుత్వం ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతుతో నడుస్తోంది.

లోక్‌సభలో స్థానాల బలిమిని చూస్తే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 16 స్థానాలతో ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా నిలిచింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ 12 మంది ఎంపీలతో రెండో అతిపెద్ద పార్టీగా ఉంది.

కానీ, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది అసమ్మతి ఎంపీలు ఇటీవల నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిపోయి, ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఇప్పుడు లోక్‌సభలో ఎన్డీయేకు అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా ఎన్‌సీపీ అవతరించినట్టయింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బీజేపీ పార్లమెంట్ స్థానాలు, మూడింట రెండొంతుల మెజారిటీ, డీలిమిటేషన్

ఫొటో సోర్స్, Getty Images

మారుతున్న సమీకరణాలు

ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు స్థానాల్లో విజయం దక్కింది, కానీ తాజాగా శివసేన(ఉద్ధవ్)కు చెందిన ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలోకి వచ్చారు. దీంతో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బలం 13కు పెరగడంతో లోక్‌సభలో జేడీయూ కంటే శివసేన పెద్ద పార్టీగా అవతరించింది. ఏక్‌నాథ్ షిండే శివసేన మొదటి నుంచి ఎన్డీయేతోనే ఉంది.

చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్)కి కూడా ఐదుగురు లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. ఇవి కాకుండా మరికొన్ని చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 293 స్థానాల్లో విజయం సాధించగా, ఇప్పుడు ఆ సంఖ్య 319కి పెరిగింది.

కీలక రాజ్యాంగ సవరణలను ఆమోదించడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌కు బీజేపీ ఇప్పుడు చేరువవుతోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీలు కూడా చీలిపోయి, నేరుగా బీజేపీలో చేరారు. మరోవైపు లోక్‌సభలో 22 మంది ఎంపీలు ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఇండియా కూటమికి దూరంగా జరిగింది. డీఎంకే కూడా అంశాల వారీగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవచ్చని సీనియర్ జర్నలిస్ట్ నీరజా చౌదరి చెబుతున్నారు.

బీజేపీ పార్లమెంట్ స్థానాలు, మూడింట రెండొంతుల మెజారిటీ, డీలిమిటేషన్

ఫొటో సోర్స్, Getty Images

లోక్‌సభ లెక్కలు

ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం 540 మంది ఎంపీలు ఉన్నారు. మూడింట రెండు వంతుల (2/3) మెజారిటీ అంటే 360 మంది ఎంపీలు ఉండాలి. బీజేపీ ఇంకా దీనికి దూరంగానే ఉంది.

లోక్‌సభ మొత్తం స్థానాల సంఖ్య 543లో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించాలంటే 362 సీట్లు కావాలి. ప్రస్తుతానికి అసోంలోని నాగావ్, పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హాట్, మేఘాలయలోని షిల్లాంగ్.. లోక్‌సభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటి ఉప ఎన్నికల్లో తామే గెలుస్తామని ఎన్డీయే ధీమాతో ఉంది.

ఒకవేళ ఈ మూడు స్థానాలూ గెలిస్తే.. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై ప్రభుత్వానికి 323 ఓట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అయినా, మూడింట రెండొంతుల మెజారిటీ మార్కు కంటే అది ఇంకా కనీసం 20 స్థానాలు తక్కువగానే ఉంటుంది.

డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీల మద్దతు లభించకపోయినా, కనీసం వారు ఓటింగ్‌కు దూరంగా ఉండేలా (వాకౌట్ చేసేలా) ఒప్పించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

బీజేపీ పార్లమెంట్ స్థానాలు, మూడింట రెండొంతుల మెజారిటీ, డీలిమిటేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

రాజ్యసభలో కొత్త సమీకరణాలు

రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య 245గా ఉంది. ఇటీవలి నెలల్లో ఎన్డీయే.. రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ మార్కు(164 స్థానాలు)కు చేరువైంది.

బీజూ జనతా దళ్ (బీజేడీ)ను దేబాశిష్ సాంతరాయ్ వీడిన తర్వాత, బీజేపీ తరఫున జూన్ 12న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం 115కు పెరిగింది.

ఇది కాకుండా, ఎగువ సభలో ఎన్డీయేకు ఇప్పుడు కనీసం 149 మంది ఎంపీల మద్దతు ఉంది. జూన్ 28తో ముగిసే 27 స్థానాల రాజ్యసభ ఎన్నికల తరువాత ఎన్డీయే సంఖ్య మరో మూడు స్థానాలు పెరిగే అవకాశం ఉంది.

ఆ తర్వాత, టీఎంసీకి చెందిన ముగ్గురు ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్, ప్రకాష్ చిక్ బడాయిక్ రాజీనామాల వల్ల ఖాళీ అయిన స్థానాలకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఆ మూడు సీట్లను కూడా ఎన్డీయే తన ఖాతాలో వేసుకోవచ్చు.

టీఎంసీకి ఇప్పుడు రాజ్యసభలో కేవలం 10 మంది ఎంపీలు మాత్రమే మిగిలారు.

ఇవే కాకుండా ఎన్డీయేతో కానీ, ఇండియా కూటమితో కానీ లేని కొన్ని చిన్న పార్టీలు కూడా ఉన్నాయి.

వీటిలో వైఎస్సార్ కాంగ్రెస్ (ఏడుగురు ఎంపీలు), బీజూ జనతా దళ్ ( ఆరుగు ఎంపీలు), ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ (చెరో ముగ్గురు ఎంపీలు) తో పాటు బీఎస్పీకి (ఒక ఎంపీ) సీటు ఉన్నాయి.

డీలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్ సమయంలో డీఎంకేకు చెందిన ఎనిమిది మంది ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండే (వాకౌట్ చేసే) అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల కంటే ముందే డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోందని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకురాలు నీరజా చౌదరి చెప్పారు.

''డీలిమిటేషన్ వల్ల నేరుగా తమకే లాభం జరుగుతుందని బీజేపీకి తెలుసు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసిన క్రెడిట్ కూడా వారు దక్కించుకుంటారు. ప్రాంతీయ పార్టీలలో చీలికలు ఇలాగే కొనసాగితే, మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ బయట ఏం జరుగుతోందనేది ఆలోచించకపోవచ్చు, ఆయనకు కేంద్రం నుంచి నిధులు వస్తే చాలు. కేంద్రంలో ప్రభుత్వం నడపడానికి బీజేపీ ఇప్పుడు టీడీపీపై బీజేపీ మునుపటిలా ఆధారపడటం లేదు'' అని అన్నారు.

ప్రాంతీయ పార్టీలు బలహీనపడటం వల్ల కాంగ్రెస్‌కు లాభం చేకూరవచ్చని, కానీ ఆ పార్టీకి ఉన్న సంస్థాగత బలహీనత దానికి అడ్డంకిగా మారుతుందని నీరజా చౌదరి పేర్కొన్నారు.

చీలిపోతున్న ప్రాంతీయ పార్టీల ఎంపీలను బీజేపీ నేరుగా తనలో ఎందుకు విలీనం చేసుకోవడం లేదు? అనే ప్రశ్నకు నీరజా చౌదరి స్పందిస్తూ, "బీజేపీ ప్రతిపక్ష స్థానాన్ని పూర్తిగా కాంగ్రెస్‌కు వదిలేయాలని అనుకోవడం లేదు. బీజేపీ అధికారంలోనూ, ప్రతిపక్షంలోనూ తానే ఉండాలని భావిస్తోంది" అన్నారు.

బీజేపీ పార్లమెంట్ స్థానాలు, మూడింట రెండొంతుల మెజారిటీ, డీలిమిటేషన్, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

కాంగ్రెస్ ఏమంటోంది?

రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేయడమే బీజేపీ అసలు, అంతిమ లక్ష్యమని, అందుకే లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధనకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బుధవారం ఆరోపించింది.

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేష్ వార్తాసంస్థ పీటీఐతో మాట్లాడుతూ, 'అధికార పార్టీ మొదట మహిళా రిజర్వేషన్ల పేరుతో డీలిమిటేషన్‌ను ముందుకు తీసుకెళ్లాలని చూస్తోందని, కానీ దాని అంతిమ ఉద్దేశం రిజర్వేషన్లను పూర్తిగా ముగించడమేనని' అన్నారు.

బీజేపీ దాటాలనుకుంటున్న మొదటి పెద్ద మైలురాయి డీలిమిటేషన్ అని, ఈ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల అధికారం మిగిలి ఉందని, దాని దీర్ఘకాలిక లక్ష్యం చాలా పెద్దదని ఆయన అన్నారు.

ఇంతకుముందు 2029 ఏప్రిల్ 17 న మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తూ లోక్‌సభ సీట్లను పెంచడానికి ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు దిగువ సభలో వీగిపోయింది. ఆ బిల్లుకు మద్దతుగా 298 మంది ఎంపీలు ఓటు వేయగా, 230 మంది వ్యతిరేకించారు. మొత్తం 528 మంది ఎంపీలు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. అప్పట్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఈ బిల్లు నెగ్గడానికి 352 ఓట్లు అవసరమయ్యాయి.

బీజేపీ పార్లమెంట్ స్థానాలు, మూడింట రెండొంతుల మెజారిటీ, డీలిమిటేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉద్ధవ్, మమతా బెనర్జీల నేతృత్వంలోని పార్టీలు వారి నియంత్రణ తప్పుతున్నట్లు కనిపిస్తున్నాయి.

డీలిమిటేషన్ బిల్లు ఎందుకు కీలకం?

డీలిమిటేషన్ బిల్లు బీజేపీకి చాలా కీలకమైనదిగా భావిస్తున్నారు.

డీలిమిటేషన్ జరిగితే, ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల లోక్‌సభ సీట్ల సంఖ్య దక్షిణాది, పశ్చిమ, చిన్న రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ పెరుగుతాయి. ఇప్పటికే, ఉత్తర భారతదేశంలో బీజేపీ చాలా బలమైన స్థితిలో ఉంది.

డీలిమిటేషన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం చేసిన మొదటి ప్రయత్నం రెండు నెలల కిందటే విఫలమైంది. ప్రభుత్వం దీనిని మహిళా రిజర్వేషన్ల లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన అంశంతో ముడిపెట్టింది.

కానీ, ప్రతిపక్షాలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఏకమయ్యాయి. దీనివల్ల ఎక్కువ జనాభా ఉండి, బీజేపీకి బలమైన మద్దతు లభిస్తున్న హిందీ మాట్లాడే రాష్ట్రాలకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని ప్రతిపక్షాలు వాదించాయి. జనాభా వృద్ధిని విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని పేర్కొన్నాయి.

1971 జనాభా లెక్కల ఆధారంగానే 1976 నుంచి లోక్‌సభ స్థానాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ ఈ పరిమితిని తొలగిస్తే పరిస్థితులు సంక్లిష్టంగా మారవచ్చు. ఒక వ్యక్తి, ఒక ఓటు అనే ప్రజాస్వామ్య సూత్రానికి అనుగుణంగా, ఉత్తరాది రాష్ట్రాలు తమ పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మరిన్ని సీట్లు కావాలని డిమాండ్ చేస్తాయి.

మరోవైపు జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ సహకారం అందిస్తూ, జనాభా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను సాధించిన దక్షిణాది, పశ్చిమ రాష్ట్రాల రాజకీయ ప్రభావం తగ్గిపోవచ్చు. చిన్న తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు మరింత వెనుకబడిపోయే ప్రమాదం ఉందని విమర్శకులు అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)