పెద్ది: ఈ స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉంది, చెర్రీ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమానా?

పెద్ది సినిమా

ఫొటో సోర్స్, Mythri Movie Makers/FB

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

భారీ అంచ‌నాల‌తో పెద్ది సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. ఆర్ ఆర్ ఆర్ త‌రువాత రామ్‌చ‌ర‌ణ్‌కు హిట్ లేదు. దాదాపు రెండేళ్ళు అతనీ సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డాడు.

మ‌రి ఫ‌లితం ద‌క్కిందా?

క‌థ ఏమంటే.. మ‌న దేశానికి ఆటల్లో ప‌త‌కాలు రావ‌డం లేద‌ని క్రీడ‌ల మంత్రి ఆవేద‌న చెందితే, సెల‌క్ష‌న్ క‌మిటీ అధికారి (బొమ‌న్ ఇరానీ) టాలెంట్‌ని వెతుకుతూ విజ‌య‌న‌గ‌రం వ‌స్తాడు.

అక్క‌డి క్రీడాకారులంద‌రికీ పెద్ది ప్రేర‌ణ అని తెలుస్తుంది.

ఎవ‌రీ పెద్ది అని విచారిస్తే ఒక గిరిజ‌నుడు కొండ ప్రాంతంలోని త‌మ ఊరుకు కాలినడకన తీసుకువెళుతూ పెద్ది క‌థ చెబుతాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మైత్రి మూవీ మేకర్స్

ఫొటో సోర్స్, Mythri Movie Makers/FB

ఏ విధమైన దారి, సౌకర్యాలు లేని అస‌లు రికార్డుల్లో గుర్తింపే లేని కొండ కింద ఊరిలో చ‌దువురాని ఓ యువ‌కుడే పెద్ది (రామ్‌చ‌ర‌ణ్‌).

ఆ ఊరి వాళ్ళంతా కూలి పనికోసం విజయనగరం వెళుతుంటారు.

పెద్దిని కిరాయి ఆట‌గాడిగా వేలంలో పాడుకుని ఆడిస్తుంటారు. పెద్ది కొడితే సిక్స‌ర్‌, ఆడితే గెలుపు.

ఆ ఊళ్ళో మున్సిపల్ ఎన్నిక‌ల్లో పోటీచేసిన సుభ‌ద్ర‌రాజు (రావు ర‌మేష్‌) కుమార్తె అచ్చ‌య‌మ్మ (జాన్విక‌పూర్‌)ని మొద‌టి చూపులోనే పెద్ది ఇష్ట‌ప‌డ‌తాడు.

కొండ కింద ఊరుకు చెందిన సూరి (జ‌గ‌ప‌తిబాబు) ఎర్ర‌జెండా ప‌ట్టుకుని కొండ‌ల్లో వ‌చ్చే రైలుని ఆప‌డానికి ప్ర‌య‌త్నిస్తూ వుంటాడు.

త‌మ ఊళ్ళో రైలు ఆగితే, అక్క‌డ స్టేష‌న్ ఏర్ప‌డితే పిల్ల‌ల‌కు ఆరోగ్యంతోపాటు చ‌దువు దొరుకుతుందని ఆయ‌న ఆశ‌. అధికారులను, ఎమ్మెల్యేని క‌లిసి అర్జీలు ఇస్తూ వుంటాడు. కానీ ఎవ‌రూ ప‌ట్టించుకోరు.

కిరాయికి క్రికెట్ ఆడుతున్న పెద్దిని ఆట‌లో తొక్కేయాల‌ని ఊళ్లోని ఇరువ‌ర్గాలు ఏక‌మ‌వుతాయి. దీన్ని అత‌ను ఎలా ఎదుర్కొన్నాడు?

కుస్తీ పోటీల‌కి శిక్ష‌ణ ఇచ్చే గౌరునాయుడు (శివ‌రాజ్‌కుమార్‌) ఎవ‌రు? పెద్ది వ‌స్తాదుగా ఎందుకు మారాడు? త‌న గ్రామం కోసం, గుర్తింపు కోసం, ఆత్మ‌గౌర‌వం కోసం పెద్ది ఎంత దూరం వెళ్ళాడు? ల‌క్ష్యాన్ని ఎలా సాధించాడు ఇది మిగ‌తా క‌థ‌.

ఇంత‌కు మించి చెబితే స్పాయిల్ అవుతుంది.

రామ చరణ్

ఫొటో సోర్స్, Vriddhi Cinemas/you tube

ఏయే పాత్రలు ఎలా ఉన్నాయంటే..

మ‌న దేశంలో ఇప్ప‌టికీ రోడ్డు, క‌రెంట్‌, మంచినీళ్ళు లేని గిరిజ‌న గ్రామాలు వేల‌ల్లో ఉన్నాయి. ఉత్త‌రాంధ్ర‌లో గ‌ర్భిణులను డోలీల్లో మోసుకుపోయే ఫొటోలు పేప‌ర్ల‌లో చూస్తూ వుంటాం. అలాంటి గుర్తింపులేని ప‌ల్లె క‌థ పెద్ది.

త‌న ఊరుకు సౌక‌ర్యాలు, గుర్తింపు, గౌర‌వం క‌లిగించ‌డ‌మే పెద్ది ల‌క్ష్యం.

ఈ సినిమాలోని మెయిన్ పాయింట్‌, క‌థ‌లోని ఆత్మ అదే.

చెప్ప‌ద‌లుచుకున్న విష‌యంలో సీరియ‌స్‌నెస్‌, నిజాయితీ ఉన్న‌ప్ప‌టికీ క‌థ‌ని అల్లుకున్న విధానంలో లోపాలున్నాయి. దాంతో అక్క‌డ‌క్క‌డ డాక్యుమెంట‌రీ ల‌క్ష‌ణాలు వ‌చ్చాయి.

క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా త‌న‌ని తాను గుర్తు చేసుకుంటూ హీరో ఇంట్రో సాంగ్‌, హీరోయిన్ ల‌వ్ ట్రాక్‌, సెకండాఫ్‌లో వ‌చ్చే ఐటం సాంగ్ ఇవ‌న్నీ ఆర్గానిక్ ఫ్లోకి అడ్డం ప‌డ్డాయి.

శివ‌రాజ్‌కుమార్ వ‌చ్చిన త‌రువాతే క‌థ‌లో వేగం పెరిగింది. రామ్‌చ‌ర‌ణ్‌కు, అత‌నికి మ‌ధ్య వ‌చ్చే సీన్స్ బావున్నాయి. క‌థంతా సెకండాఫ్‌లోనే వుంది.

ఫ‌స్టాఫ్‌లో చాలా పాత్ర‌లు వున్నా ఎవ‌రికీ ఒక ఆర్క్ లేదు. ఎవ‌రూ రిజిస్ట‌ర్ కారు.

జ‌గ‌ప‌తిబాబు త‌ర‌హా క్యారెక్ట‌ర్‌ని చాలా సినిమాల్లో చూసేశాం. రావు ర‌మేష్‌లాంటి మంచి న‌టుడున్నా ఐదు నిమిషాల స్క్రీన్ ప్రెజెన్స్ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం.

ట్రైలర్‌లో జాన్విని చూసిన‌పుడు రంగ‌స్థ‌లంలో స‌మంత‌లా గ‌ట్టి క్యారెక్ట‌ర్ ప‌డింద‌ని ఆశిస్తాం.

తీరా చూస్తే ఫ‌స్టాఫ్‌లో కాసేపు క‌నిపించి, మ‌ళ్ళీ సెకండాఫ్‌లో ద‌ర్శ‌న‌మిస్తుంది. హీరోయిన్ లేక‌పోయినా ఈ సినిమాకేం న‌ష్టం లేదు. అభిమానుల‌కి న‌చ్చ‌దేమో అని మొహ‌మాట‌ ప‌డిన‌ట్టున్నారు.

తెలుగులో స్పోర్ట్స్ సినిమాలు తీయడమే చాలా త‌క్కువ‌. అందులో ఆడేవి కూడా త‌క్కువే. ఈమ‌ధ్య జెర్సీ త‌ప్ప ఇంకో పేరు గుర్తులేదు. స్పోర్ట్స్ డ్రామాలో ఏదో ఒక ఆట‌పైనే క‌థ కేంద్రీకృతమై ఉంటుంది. అయితే పెద్దిలో క్రికెట్‌, కుస్తీ పోటీ, ర‌న్నింగ్ రేస్ ఇన్ని క‌లిసి వుండ‌డం విశేషం.

జాహ్నవి

ఫొటో సోర్స్, Vriddhi Cinemas/you tube

రామ్ చరణ్ రెండేళ్ల కష్టం ఫలించిందా?

ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సింది రామ్‌చ‌ర‌ణ్ గురించి. రెండేళ్ళు అత‌ను ప‌డిన క‌ష్టం ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ క‌నిపిస్తుంది. క్రికెట్‌, కుస్తీ పోటీలు ఆయ‌న శిక్ష‌ణ తీసుకుని న‌టించిన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తుంది.

ఒక సినిమా కోసం ఇంత శ్ర‌ద్ధ తీసుకోవ‌డం గొప్ప విష‌యం. ఆయ‌న కెరీర్‌లో నిల‌బ‌డే సినిమాల్లో ఇది ఒక‌టి.

ఏఆర్ రెహ‌మాన్ పాట‌లు ఇప్పటికే హిట్‌. బ్యాగ్రౌండ్ స్కోర్‌లో కూడా ఆయ‌న ముద్ర క‌నిపిస్తుంది.

ఫొటోగ్ర‌ఫీ, ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ బావున్నాయి. నిర్మాత‌లు ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌లేదు.

ద‌ర్శ‌కుడు సానా బుచ్చిబాబు మేకింగ్‌లో తీసుకున్న శ్ర‌ద్ధ రైటింగ్‌లో స‌రిగా తీసుకోలేదు.

ఫ‌స్టాఫ్‌లో ఎమోష‌న‌ల్ డెప్త్ లేదు. క‌థ‌లో విల‌న్ లేక‌పోవ‌డం ఒక లోపం. ఉన్న రాంబుజ్జి (దివ్యేందు) తో కూడా సంఘ‌ర్ష‌ణ ఎలివేట్ కాలేదు. ఊరికి సంబంధించిన క‌ష్టాలు ఎస్టాబ్లిష్ చేసే స‌న్నివేశం లేదు.

మూడు గంట‌ల నిడివి చాలా ఎక్కువ‌. త‌గ్గించే అవ‌కాశం వుంది. సినిమాలో క‌మెడియ‌న్ స‌త్య కూడా ఉన్నాడంటే ఉన్నాడు.

సినిమాలో ఊహ‌కంద‌ని ట్విస్ట్ వుంది. అది కొంచెం అతిగా అనిపించినా క‌థ‌కు అవ‌స‌రం, కీల‌క మ‌లుపు. మ‌రి అభిమానుల‌కు న‌చ్చుతుందా లేదా అనేది కొంచెం అనుమాన‌మే.

సినిమా బాలేదు అన‌డానికి లేదు. అలాగ‌ని అద్భుతం అన‌లేం.

ప్ల‌స్ పాయింట్స్‌

1) రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న‌, శివ‌రాజ్‌కుమార్ ప్రెజెన్స్‌

2) ఏఆర్ రెహ‌మాన్ పాట‌లు, బీజీఎం

3) కెమెరా

4) క్రికెట్‌, కుస్తీ స‌న్నివేశాలు

మైన‌స్ పాయింట్స్‌

1) ఫ‌స్టాఫ్‌లో నెమ్మ‌దించిన క‌థనం

2) క‌థ‌లో ఆర్గానిక్ ఫ్లో మిస్ కావ‌డం

3) నిడివి ఎక్కువ‌

4) పాత్ర చిత్ర‌ణ‌, బ‌ల‌మైన సీన్స్ లోపించ‌డం

ఫైన‌ల్‌గా ఇది రామ్‌చ‌ర‌ణ్ వ‌న్ మాన్ షో. అలాంటి క్లైమాక్స్‌ని ఆయ‌న ఒప్పుకోవ‌డం కూడా ఓ విశేషమే.

(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)