You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన 11వేలమందికిపైగా నావికులు, వీరి సురక్షిత తరలింపు ఎందుకు నిలిచిపోయింది?
- రచయిత, విక్కీ వాంగ్, ఎమ్మా పెన్గెల్లీ
- హోదా, బీబీసీ వెరిఫై
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన 11వేల మందికి పైగా నావికులను తరలించే ప్రణాళికను ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సముద్రయాన సంస్థ (ఐఎంఓ)తాత్కాలికంగా నిలిపివేసింది.
హార్ముజ్ గుండా వెళుతున్న సరకు రవాణా నౌకపై దాడి జరగడంతో ఐఎంఓ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే కొన్ని నౌకలను ఖాళీ చేయించినప్పటికీ భద్రత విషయంలో ఇచ్చిన హామీలు కొనసాగుతాయని నిర్ధరించుకోవాలని కోరుకుంటున్నట్లు ఐఎంఓ అధిపతి ఆర్సెనియో డొమింగెజ్ చెప్పారు.
ఒమన్‌లోని దహిత్ పోర్టుకు ఆగ్నేయంగా 7.5 నాటికల్ మైళ్ల దూరంలో ఒక నౌకపై గుర్తు తెలియని పేలుడు పదార్ధంతో దాడి జరిగిందని బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ యూకేఎంటీవో తెలిపింది.
ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే నౌక కొద్దిగా దెబ్బతిందని, దాడి తర్వాత సురక్షితంగా హార్ముజ్ దాటిందని నౌక యజమాని చెప్పారు.
ఇరాన్ బలగాలు ఆ నౌకపై దాడి చేశాయని అమెరికన్ అధికారులు చెప్పినట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది.
ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన మార్గంలో హార్ముజ్‌ను దాటే ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని, అవి ప్రమాదకరమైనవని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ హెచ్చరించింది. హార్ముజ్ గుండా ప్రయాణించే నౌకలు ఇరాన్‌తో సమన్వయం చేసుకోవాలని ఐఆర్జీసీ తెలిపింది.
ఐఆర్జీసీ హెచ్చరించిన తర్వాత హార్ముజ్ జలసంధిలో నౌకపై దాడి జరిగింది.
'ఎవర్ లవ్లీ' అనే నౌక సింగపూర్ జెండాతో హార్ముజ్ గుండా యూకేఎంటీఓ సూచించిన మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు దానిపై దాడి జరిగిందని, ఆ నౌక యజమాన్య సంస్థ ఎవర్గ్రీన్ ప్రకటించింది.
"నౌక, నౌకలో సిబ్బంది, సరుకు అంతా సురక్షితంగా ఉన్నాయి" అని పేర్కొంది.
భద్రతపై ఐక్యరాజ్య సమితి ఆందోళన
గురువారం ఉదయం ఆ నౌక ఐఎంవో గుర్తించిన దక్షిణ మార్గంలో ప్రయాణించిందని బీబీసీ వెరిఫై పరిశీలించిన మెరైన్‌ట్రాఫిక్ అనే షిప్-ట్రాకింగ్ వెబ్సైట్ డేటా వెల్లడిస్తోంది.
అయితే ఆ నౌక "ఐఎంఓ నిర్దేశించినట్లు ప్రయాణించలేదు" అని ఐఎంవో చీఫ్ డొమింగెజ్ గురువారం చెప్పారు. ఇంతకు మించి ఆయన ఇతర వివరాలేం వెల్లడించలేదు.
నావికుల తరలింపు ప్రణాళికను నిలిపివేస్తున్నట్లు చెప్పిన ఆయన "నావికుల భద్రతే అత్యంత ప్రాధాన్యత అని నేను పదే పదే చెబుతున్నాను. అందువల్ల నౌకల ప్రయాణ భద్రత విషయంలో సమన్వయంతో కూడిన విధానంపై మరింత స్పష్టత వచ్చే వరకు తరలింపు ప్రణాళికను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం" అని చెప్పారు.
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఫిబ్రవరి నుంచి వందల నౌకలు, వేల మంది నావికులు గల్ఫ్‌లో చిక్కుకుపోయారు. హార్ముజ్‌ను తిరిగి తెరిచిన తర్వాత మంగళవారం ఐక్యరాజ్య సమితి నావికుల తరలింపు గురించి ప్రకటించింది.
"ఈ భారీ ఆపరేషన్ కు ఇరాన్, ఒమన్, అమెరికా, ఈ ప్రాంతంలోని ఇతర తీరప్రాంత దేశాలు, సముద్ర పరిశ్రమల సహకారం ఉంది" అని డొమింగెజ్ తెలిపారు.
హార్ముజ్ జలసంధి నిర్వహణ కోసం ఇరాన్ ఏర్పాటు చేసిన సంస్థ, నిర్దేశిత మార్గాల వెలుపల ప్రయాణించే నౌకల సురక్షిత ప్రయాణానికి తాము గ్యారంటీ ఇవ్వలేమని ప్రకటించిన తర్వాత ఎవర్ లవ్లీపై దాడి జరిగింది.
"అనధికారిక మార్గాలను ఉపయోగించడం వల్ల తలెత్తే పరిణామాలకు నౌక యజమాని, ఆపరేటర్, మాస్టర్ బాధ్యత వహించాలి" అని పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టింది.
చాలా నౌకలు హార్ముజ్ జలసంధికి దక్షిణాన ఒమన్ తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగిస్తున్నాయని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.
తగ్గుతున్న ముడి చమురు ధరలు
గత వారం అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా శత్రుత్వాన్ని ముగించడానికి అంగీకరించాయి.
ఈ ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు ఎటువంటి రుసుము లేకుండా వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ కృషి చేయాలి.
అయితే హార్ముజ్ జలసంధిని దాటడానికి టోల్‌కు బదులు సముద్ర సేవ రుసుమును వసూలు చేయాలని తాము భావిస్తున్నట్లు తెహ్రాన్ పదే పదే చెబుతోంది.
అమెరికా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. "అంతర్జాతీయ జలమార్గం" అని తాము పేర్కొన్న హార్ముజ్ జలసంధిపై ఏ దేశం కూడా సుంకాలు విధించడానికి వీల్లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హెచ్చరించారు.
తెహ్రాన్‌తో ఒప్పందంపై చర్చల కోసం గల్ఫ్‌లో పర్యటిస్తున్న రుబియో ప్రస్తుతం బహ్రెయిన్‌లో ఉన్నారు.
ఫిబ్రవరి నెలాఖరులో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తర్వాత చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన జలమార్గమైన జలసంధిని ఇరాన్ మూసివేసింది.
దీంతో ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు విపరీతంగా పెరగడంతో పాటు రసాయన ఎరువుల వంటి ఇతర కీలక వస్తువుల రవాణాకు ఆటంకం ఏర్పడింది.
తెహ్రాన్ అణు కార్యక్రమంపై చర్చలు, యుద్ధం ముగింపు, ఇతర చర్యల కోసం 60 రోజుల కాలపరిమితిని నిర్దేశిస్తూ జూన్ 17న అమెరికా, ఇరాన్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. అప్పటి నుంచి ముడి చమురు ధర వేగంగా తగ్గుతోంది.
గురువారం ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఇరాన్ యుద్ధం ముందున్న స్థాయికి చేరాయి.
ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 72 డాలర్ల దిగువకు పడిపోయి 71.57 డాలర్ల వద్దకు చేరుకుంది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకుని 71.97 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)