You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్
- రచయిత, జార్జ్ రైట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్టు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ మిలటరీ ప్రకటనను అమెరికా సైన్యం ఖండించింది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన ప్రాణాంతక దాడులు యుద్ధం ముగింపు కోసం అమెరికాతో తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ చెప్పింది.
ప్రపంచంలో 20శాతం చమురు, ఎల్ఎన్‌జీ గ్యాస్ రవాణా జరిగే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలనే అంశం కూడా అమెరికా-ఇరాన్ ఒప్పందంలో ఉంది.
హార్ముజ్ మళ్లీ మూసివేశామన్న ఇరాన్ తాజా ప్రకటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ స్పందించింది.
హార్ముజ్‌లో నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని, అమెరికా బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని, ఇది ఇలాగే కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి టిమ్ హాకిన్స్ మీడియాతో చెప్పారు. హార్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు నియంత్రణ లేదన్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య నేడు రెండో విడత చర్చలు
మరోవైపు అమెరికా-ఇరాన్ చర్చలకోసం అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ వాషింగ్టన్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఇవాళ స్విట్జర్లాండ్‌లో చర్చలు జరగనున్నాయి.
అణ్వాయుధాల అంశం, లెబనాన్ కాల్పుల విరమణ అంశంపై పురోగతి ఉంటుందని భావిస్తున్నానని జేడీ వాన్స్ విలేకరులతో చెప్పారు.
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ఘర్షణలపై అమెరికా ఉపాధ్యక్షుడు స్పందించారు. పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, ఉద్రిక్తత కొంత తగ్గుతోందని చెప్పారు.
''ఇజ్రాయెల్, లెబనాన్ రెండూ సురక్షితంగా, భద్రంగా ఉండేలా నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రాంతాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచడమే ప్రధాన లక్ష్యం'' అని జేడీ వాన్స్ చెప్పారు.
‘ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించింది’
అవతలి పక్షం తన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నామని ఇరాన్ విదేశాంగశాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి అన్నారు.
చర్చల ప్రారంభంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి హాజరవుతారని ఆయన కార్యాలయం బీబీసీకి తెలిపింది. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరించింది. ఏప్రిల్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన తొలి దశ చర్చలకు ఇస్లామాబాద్ ఆతిథ్యమిచ్చింది.
యుద్ధాన్ని ముగించేందుకు ఈ వారం ప్రారంభంలో అమెరికా, ఇరాన్ అధ్యక్షులు ప్రాథమిక ఒప్పందంపై సంతకం చేశారు. లెబనాన్ అంశం కూడా భాగమైన ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చింది. వచ్చే 60రోజుల్లో తుది ఒప్పందం కుదుర్చుకునేలా చర్చలు జరపేందుకు రెండు పక్షాలూ అంగీకరించాయి.
అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదరకపోతే హార్ముజ్ జలసంధి గుండా రాకపోకలు సాగించే నౌకలపై అమెరికా తన సొంత పన్నులు విధించే అవకాశం ఉందని డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో శనివారం(జూన్ 20) పోస్ట్ చేశారు.
జలసంధిని మూసివేస్తున్నామన్న ప్రకటనను ఇరాన్ మిలటరీ సమర్థించుకుంది. 14పాయింట్ల అమెరికా-ఇరాన్ అవగాహన ఒప్పందంలోని మొదటి అంశాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది. లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో మిలటరీ ఆపరేషన్లను తక్షణమే శాశ్వతంగా తొలగించాలని ఒప్పందంలో ఉంది.
ఇజ్రాయెల్ దాడులపై అమెరికా విమర్శలు
శనివారం కనీసం ఐదు ట్యాంకర్లు హార్ముజ్ జలసంధిని దాటాయని, అనేక నౌకలు యూ-టర్న్స్ తీసుకున్నాయని బీబీసీ వెరిఫై పరీశీలించిన ట్రాకింగ్ డేటాలో తేలింది. వాణిజ్య నౌకల రాకపోకలు హార్ముజ్‌లో పెరిగాయని, 55 వ్యాపార నౌకలు జలసంధిని దాటాయని సెంట్‌కామ్ తెలిపింది.
దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 20మంది చనిపోయినట్టు సమాచారం. ఇజ్రాయెల్-హిజ్బొల్లా కొత్త కాల్పుల విరమణ ప్రకటించిన 24గంటలలోపు ఈ దాడులు జరిగాయి. ఆ తర్వాత ఇరాన్ ఈ ప్రకటన చేసింది.
మార్చి 2న ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య సంక్షోభం తిరిగి మొదలయిన తర్వాత 4,057మంది చనిపోయారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
శుక్రవారం(జూన్ 19)కుదిరిన కాల్పుల విరమణను ఉల్లంఘించినట్టు ఇజ్రాయెల్, హిజ్బొల్లా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
పదుల సంఖ్యలో హిజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఇజ్రాయెల్ మిలటరీ చెప్పింది. ఇరాన్ మద్దతున్న హిజ్బొల్లా రాత్రికి రాత్రే ఇజ్రాయెల్ బలగాలపై 50కి పైగా క్షిపణులు, రాకెట్లు ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది.
ఇజ్రాయెల్ దాడుల్లో బారిచ్ పట్టణంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారని లెబనాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
దక్షిణ లెబనాన్‌లో జరిగిన పోరాటంలో ఇజ్రాయెల్ సైనికుడు ఒకరు మరణించారని ఇజ్రాయెల్ మిలటరీ కూడా ప్రకటించింది.
లెబనాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించకునే ఉద్దేశంలేదని అంతకుముందు ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. ఇరాన్ మద్దతున్న హిజ్బొల్లాతో సంక్షోభం, ఇరాన్‌తో యుద్ధం రెండూ వేర్వేరు అంశాలని అన్నారు.
ఇజ్రాయెల్ దాడులు అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నమని హిజ్బొల్లా ఆరోపించింది.
లెబనాన్‌లో ఇజ్రాయెల్ ఆపరేషన్లను అమెరికా విమర్శించింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)