వియత్నాం: ఈ చిన్న దేశానికి భారతీయ సందర్శకుల సంఖ్య ఎందుకింతలా పెరుగుతోంది..

ఫొటో సోర్స్, Andy Soloman/UCG/Universal Images Group via Getty Images
వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో 15 మంది భారతీయులు చనిపోయినట్లుగా వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు చనిపోయినట్లుగా వారి కుటుంబీకులకు, బంధువులకు ప్రభుత్వం సమాచారం అందించింది. మిగిలిన వారు తమిళనాడు సహా వివిధ రాష్ట్రాలకు చెందిన వారున్నారు.
ప్రమాదానికి గురైన పర్యటకులతోపాటు మరికొందర్ని లావా మొబైల్ కంపెనీ బిజినెస్ ట్రిప్‌లో భాగంగా వియత్నాంకు తీసుకెళ్లింది.
వీరిలో 86 మంది తిరిగి భారత్‌కు చేరుకున్నట్లుగా లావా మొబైల్ కంపెనీ ప్రకటించింది.
గత కొన్ని సంవత్సరాలుగా వియత్నాం వెళుతున్న భారత పర్యటకుల సంఖ్య బాగా పెరుగుతుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

విస్తీర్ణంలో ఇండియాలోని రాజస్థాన్ రాష్ట్రం కంటే చిన్నదిగా ఉండే ఈ దేశానికి భారతీయ పర్యటకులు పెరగడం వెనుక వివిధ కారణాలున్నాయని టూరిస్ట్ ఆపరేటర్లు చెబుతున్నారు.
''భారతీయులు కొత్త ప్రాంతాలకు వెళ్లేందుకు ఆస్తకి చూపిస్తుంటారు. అందులో భాగంగా వియత్నాం చాలా తక్కువ ఖర్చుతో వెళ్లే గమ్యస్థానంగా మారింది'' అని హైదరాబాద్‌కు చెందిన ఇమాద్ ట్రావెల్స్ డైరెక్టర్ హమీద్ అలీ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Andy Soloman/UCG/Universal Images Group via Getty Images
నాలుగు రెట్లు పెరుగుదల
గతంలో సింగపూర్, థాయిలాండ్, మలేసియా, దుబాయి వంటి దేశాలకు వెళ్లే వారని, ఇప్పుడు కొత్త గమ్యాల వైపు పర్యటకులు చూస్తున్నట్లు టూరిస్టు ఆపరేటర్లు చెబుతున్నారు.
అందులో భాగంగా తక్కువ ఖర్చులో పర్యటించేందుకు వియత్నాం దేశం ఒక గమ్యస్థానంగా మారింది.
2019తో పోల్చితే 2024 నాటికి వియత్నాంకు వెళ్లే భారతీయ ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగినట్లుగా నిరుడు ఆగస్టులో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించిన వివరాల ప్రకారం తెలిసింది.
ఈ వివరాలను రాజ్యసభలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ వెల్లడించినట్లు పీఐబీ రిపోర్టు చేసింది.
దీని ప్రకారం, 2019తో పోల్చితే 2024లో వియత్నాం వెళ్లిన భారతీయ పౌరుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది.
మిగిలిన దేశాలకు వెళ్లే భారతీయ పౌరుల సంఖ్యలో స్వల్పంగా పెరగడం లేదా మార్పులు లేకపోవడం ఉండగా, వియత్నాం వెళ్లే ప్రయాణికులు మాత్రం బాగా పెరిగారు.
2019లో 93,921 మంది భారతీయ పౌరులు వియత్నాంను సందర్శించగా, 2024 నాటికి ఈ సంఖ్య 3 లక్షల 98 వేల 673కు పెరిగినట్లుగా పీఐబీ రిపోర్టు చేసింది.
అలాగే ఈ రిపోర్టు ప్రకారం, మలేసియా, యూకే, ఒమన్, కువైట్, చైనా వంటి దేశాలకు వెళ్లే భారతీయ పౌరుల సంఖ్య తగ్గిపోయింది.
కోవిడ్ -19 తర్వాత వియత్నాంలో మార్పులు
కోవిడ్-19కు ముందు దుబాయి, థాయిలాండ్, సింగపూర్, మలేసియా వంటి దేశాలను ఎక్కువగా భారతీయులు సందర్శించేవారని, తర్వాత పర్యటకుల ఆలోచనలో మార్పు వచ్చిందని ఇమాద్ ట్రావెల్స్ డైరెక్టర్ హమీద్ అలీ వివరించారు.
''భారతీయ పర్యటకులు 90ల నుంచి పర్యటనలు ఎక్కువగా చేస్తున్నారు. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేసియాలోని బాలి.. వంటి ప్రాంతాలకు ఒకటి లేదా అంతకంటేఎక్కువసార్లు వెళ్లి ఉంటారు.
అందుకే ఇప్పుడు వియత్నాం వంటి దేశాల వైపు ఆలోచనలు మళ్లుతున్నాయి.
కోవిడ్‌కు ముందు వియత్నాంను నేను సందర్శించాను. అక్కడ అంతగా సౌకర్యాలు ఉండేవి కావు. కోవిడ్ తర్వాత పర్యటకుల కోసం అక్కడి ప్రభుత్వం పెద్దఎత్తున సౌకర్యాలు పెంచింది. టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది'' అని చెప్పారు హమీద్ అలీ.
''వియత్నాంలో బాణా హిల్స్, హనోయి, ఫూ క్వోక్ వంటి పర్యాటక ప్రదేశాలున్నాయి. భారతీయ కరెన్సీలో రూ.60-80 వేల లోపు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. సరిగా ప్లాన్ చేసుకుంటే బాలి, సింగపూర్ కంటే తక్కువ ఖర్చులోనే ట్రిప్ పూర్తవుతుంది'' అని హమీద్ అలీ తెలిపారు.

ఫొటో సోర్స్, Mauro Flamini/REDA/Universal Images Group via Getty Images
సులువుగా వీసాలు.. తక్కువగా ఖర్చులు
ఇతర సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలతో పోల్చితే వియత్నాంను సందర్శించినప్పుడు పర్యటకుల రోజూ వారీ ఖర్చులు 40-60 శాతం తక్కువగా ఉందని వియత్ దాన్ ట్రావెల్స్ చెబుతోంది.
వియత్నాంకు వెళ్లే భారత ప్రయాణికుల సంఖ్య 2026లో మరింత పెరిగిందని, మొదటి రెండు నెలల్లోనే 1.58లక్షల మంది వియత్నాం సందర్శించినట్లు ఈ కంపెనీ తెలిపింది.
''ఈ-వీసా పాలసీని వియత్నాం బాగా సరళీకరించింది. గతంలో మల్టీ ఎంట్రీ వీసా జారీకి 7 నుంచి 10 పని దినాలు పట్టగా, ఇప్పుడు 24-48 గంటల్లోనే భారతీయులకు వీసా మంజూరు అవుతోంది. సంపన్నులు, తరచూ వచ్చే ప్రయాణికుల కోసం లాంగ్ టర్మ్ వీసా ఇచ్చే అవకాశాలను వియత్నాం పరిశీలిస్తోంది'' అని వియత్ దాన్ ట్రావెల్స్ చెబుతోంది.
వియత్నాంను సందర్శించే భారతీయ సందర్శకులు ఈ-వీసా లేదా వీసా ఆన్ అరైవల్ లేదా వియత్నాం ఎంబసీ ద్వారా వీసా స్టిక్కర్ సౌకర్యం పొందే వీలుంది.
ఇందుకు సింగిల్ ఎంట్రీకి 25 యూఎస్ డాలర్లు (సుమారు రూ.2390), మల్టీపుల్ ఎంట్రీకి 50 యూఎస్ డాలర్లుగా (సుమారు రూ.4784గా) ఫీజు నిర్ణయించింది వియత్నాం ప్రభుత్వం.
అలాగే ఈ-వీసా సదుపాయం 90 రోజుల కాలపరిమితితో వియత్నాం ప్రభుత్వం జారీ చేస్తుంది.
''భారత్‌లో బీచ్‌లకు వెళ్లాలంటే గోవా అనేది పర్యటకులకు గమ్యస్థానంగా ఉండేది. విదేశాలకైతే థాయిలాండ్, ఇండోనేసియా వంటివి ఎంచుకునేవారు. ఇప్పుడు వియత్నాం వైపు భారతీయుల ఆలోచనలు మరలాయి'' హమీద్ అలీ చెప్పారు.
భారతీయ రూపాయితో పోల్చితే వియత్నాం డాంగ్ విలువ కూడా తక్కువగా ఉంది.
విమాన ప్రయాణ ఖర్చులు మినహా వియత్నాంలో రోజూ వారీ ఖర్చులు తక్కువగా ఉంటాయని పర్యటకులు చెబుతున్నారు.
''మేం నిరుడు వియత్నాం వెళ్లొచ్చాం. భారతీయ కరెన్సీలో రూ.2 వేల లోపే మంచి హోటళ్లు దొరుకుతున్నాయి. ఆహారం, ప్రయాణ ఖర్చులు కూడా తక్కువే. విమాన టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకుంటే తక్కువ బడ్జెట్లోనే వియత్నాం పర్యటన అయిపోతుంది'' అని హైదరాబాద్‌కు చెందిన ఎం.రమేశ్ వివరించారు.

ఫొటో సోర్స్, Michael Nguyen/NurPhoto via Getty Images
భారత్ నుంచి నేరుగా విమాన సర్వీసులు
వియత్నాం చేరుకునేందుకు దేశంలోని ప్రధాన నగరాల నుంచి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వియత్నాం చేరుకునేందుకు సుమారు మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య సమయం పడుతోంది. ఇది భారత్‌లోని ఆయా నగరాలను బట్టి ప్రయాణ సమయం ఆధారపడి ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి అయితే.. నాలుగున్నర గంటల్లో వియత్నాం చేరుకోవచ్చు.
దిల్లీ, ముంబయి, కోల్కత్తా, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు సహా వివిధ నగరాల నుంచి వారానికి 90 విమానాలు నేరుగా వియత్నాంలోని హనోయి, హొ చి మిన్ నగరాలకు నడుస్తున్నాయి.
భారతీయులకు వియత్నాం ఈ-వీసా సదుపాయం కల్పిస్తోంది. ఇది కూడా చాలా త్వరగా ప్రాసెస్ అవుతున్నట్లుగా టూరిస్టు ఆపరేటర్లు చెబుతున్నారు.
''సింగపూర్ వీసాల పరంగా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దుబయి వంటి దేశాలు వీసా ఫ్రెండ్లీ అయినప్పటికీ, జూన్ నుంచి ఆగస్టు, సెప్టెంబరు వరకు వేడి బాగా ఉంటుంది. బ్యాంకాక్ కాకుండా కొత్తగా బీచ్ ప్రాంతాలలో సేద తీరాలనుకునే వారికి వియత్నాం గమ్యస్థానంగా మారింది'' అని హమీద్ అలీ వివరించారు.

ఫొటో సోర్స్, Allison Joyce/Getty Images
చిన్న దేశం.. బీచ్‌లు ప్రధాన ఆకర్షణ
వియత్నాం అనేది సౌత్ ఈస్ట్ ఆసియాలోని ఒక దేశం. ఒకవైపు తీర ప్రాంతం, మరోవైపు దట్టమైన అడవులు కలిగిన దేశం. సుమారు పది కోట్ల జనాభాతో 3,31,699 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంటుంది.
వైశాల్యంలో భారత్‌లోని రాజస్థాన్ రాష్ట్రం (3.42 లక్షల చదరపు కిలోమీటర్లు) కంటే కూడా చిన్నది.
దేశానికి బీచ్‌లు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఎటుచూసినా పచ్చదనం కనిపిస్తుంటుంది.
వియత్నాంలో చాలా పర్యటక ప్రాంతాలు ఉండగా, హనోయి, హోచిమిన్ సిటీ, డానాంగ్ వంటి ప్రధాన పర్యటక ప్రాంతాలుగా ఉన్నాయి.
భారత్‌తో వియత్నాం 1972 నుంచి పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు కొనసాగిస్తోంది.
ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయని వియత్నాంలోని భారత్ ఎంబసీ చెబుతోంది.
2025-26లో రెండు దేశాల మధ్య సుమారు 16 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగినట్లుగా ఎంబసీ లెక్కల ప్రకారం తెలుస్తోంది.
ఇందులో వియత్నాంకు భారత్ ఎగుమతులు 6.11 బిలియన్ డాలర్లుగా ఉండగా, వియత్నాం నుంచి భారత్‌కు ఎగుమతులు 10.35 బిలియన్ డాలర్లుగా ఉంది.
వియత్నాంలో సుమారు 8 వేల మంది భారతీయులు నివాసం ఉంటున్నట్లుగా ఎంబసీ చెబుతోంది. వీరు ఐటీ, హోటళ్లు, మైనింగ్, యోగా సంస్థలు, పౌర విమానయాన ఎంటర్ ప్రైజెస్, విద్యాసంస్థలు వంటి రంగాల్లో పనిచేస్తున్నారు.
వాణిజ్యం, సాంస్కృతిక, విద్యా, రక్షణ, పర్యటక రంగాలలో వియత్నాంతో భారత్ సంబంధాలు కొనసాగిస్తోంది.
రెండు దేశాల అధినేతలు 1954-55 నుంచి అధికారిక పర్యటనలు కొనసాగిస్తున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























