బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ఇంతటితో ముగిస్తున్నాం.
తాజా వార్తల కోసం రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
అస్సాంలో భారీ వరదల కారణంగా గత 24 గంటల్లో మరో పది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 41కి చేరింది. వరదల కారణంగా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో దాదాపు వెయ్యి గ్రామాలు నీట మునిగాయని అస్సాం ప్రభుత్వ విపత్తు విభాగం ప్రకటించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ఇంతటితో ముగిస్తున్నాం.
తాజా వార్తల కోసం రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, NDRF
అస్సాంలో భారీ వరదల కారణంగా గత 24 గంటల్లో మరో పది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 41కి చేరింది.
వరదల కారణంగా రాష్ట్రంలోని 11 జిల్లాల్లో దాదాపు వెయ్యి గ్రామాలు నీట మునిగాయని, 6.53 లక్షల మంది ప్రభావితులయ్యారని అస్సాం ప్రభుత్వ విపత్తు విభాగం ప్రకటించింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో సుమారు 25 వేల మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందినట్లు విపత్తు నిర్వహణ శాఖ నివేదిక పేర్కొంది.
ఎగువ అస్సాంలో వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. శివసాగర్, చరాయిదేవ్, గోలాఘాట్, జోర్హాట్ జిల్లాల్లో వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారత సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. మారుమూల ప్రాంతాల్లోని వరద బాధితులను గుర్తించేందుకు సైనిక హెలికాప్టర్లు గగనతల నిఘా నిర్వహిస్తున్నాయి.
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వరద పరిస్థితి గురించి వివరించారు.

ఫొటో సోర్స్, PTI
దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో కేంద్ర మంత్రులు, సీజేపీ ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన చర్చలు ముగిశాయి. ఈ చర్చలు దాదాపు రెండు గంటలపాటు సాగాయి.
అనంతరం కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ, ప్రభుత్వం రేపు మధ్యాహ్నం వరకూ సమయం కోరిందని అన్నారు.
ప్రభుత్వం తరఫున చర్చలకు వచ్చిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సమావేశం అనంతరం సీజేపీ అధికార ప్రతినిధి ఏఎన్‌ఐతో మాట్లాడారు."ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న మా డిమాండ్‌పై రేపు మధ్యాహ్నం వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం త్వరలోనే ఆయన్ను పదవి నుంచి తొలగిస్తుందని ఆశిస్తున్నాం. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థుల కుటుంబాలకు నష్టపరిహారం, విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ డిమాండ్లకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది" అని అన్నారు.
మరోవైపు, సీజేపీ ప్రతినిధులతో భేటీ అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, "మా సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. వారు మూడు ప్రధాన డిమాండ్లు మా ముందుంచారు. పరీక్షల సంస్కరణలకు సంబంధించి మరో ఐదు సూచనలు చేశారు. వీటిపై ప్రభుత్వంతో చర్చించి, వివరాలు తెలియజేసేందుకు రేపు మధ్యాహ్నం మరోసారి సమావేశమవుతామని వారికి చెప్పాం" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీ యూనివర్సిటీ తర్వాత, ఇప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలకు సంబంధించి తమ విద్యార్థులకు పలు సూచనలు చేసింది.
దిల్లీలోని జంతర్ మంతర్ లేదా పరిసర ప్రాంతాల్లో నిర్వహించే ఎలాంటి సమావేశాలకు హాజరుకావద్దని తమ విద్యార్థులకు సూచించింది.
దీనికిముందు దిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) కూడా తమ విద్యార్థులకు ఇదే తరహా సూచనలు చేసింది.
"జేఎన్‌యూ స్టూడెంట్ కమ్యూనిటీలోని సభ్యులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ తమ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నాం. బహిరంగ ప్రదర్శనలకు సంబంధించి భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా, జంతర్ మంతర్ వద్ద లేదా పరిసర ప్రాంతాల్లో జరిగే సమావేశాలు, ప్రదర్శనలకు దూరంగా ఉండాలని కోరుతున్నాం" అని జేఎన్‌యూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
"సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించండి. సోషల్ మీడియా నిబంధనల ఉల్లంఘలనకు పాల్పడితే ఆయా చట్టాలతో పాటు యూనివర్సిటీ నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది."
ఇంతకుముందు దిల్లీ విశ్వవిద్యాలయం కూడా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల్లో పాల్గొనవద్దని తమ విద్యార్థులకు సూచించింది.
అయితే, ఈ ఆదేశాలపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, విద్యార్థులను విశ్వవిద్యాలయం బెదిరించలేదని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్ష విరమించిన తీరుపై తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆమె ‘ఎక్స్’లో వరుస పోస్ట్‌లు పెట్టారు.
ప్రభుత్వం ట్రాప్‌లో పడొద్దంటూ ఆమె వాంగ్‌చుక్‌కు సూచించారు.
నిరాహార దీక్ష తరువాత.. విద్యార్థుల ఆందోళనలను ఆపడానికి ప్రభుత్వం మీ వాయిస్‌ను ఉపయోగించకుండా చూసుకోవాలని ఆమె వాంగ్‌చుక్‌కు సూచించారు.

ఫొటో సోర్స్, ANI
విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం, సంస్కరణలు కావాలని విద్యార్థులు డిమాండ్ చేశారని, అయితే వారి ధైర్యానికి మోదీ ప్రభుత్వం "పిరికితనం, క్రూరత్వంతో" సమాధానమిచ్చిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ శుక్రవారం అన్నారు.
"ప్రభుత్వం విద్యార్థులను దేశ భవిష్యత్తును నిర్మించే పౌరులుగా కాకుండా, దేశానికి శత్రువులుగా చూసింది" అని సోనియా అన్నారని పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది.
మోదీ ప్రభుత్వం భారతదేశ విద్యా వ్యవస్థను బలహీనపరిచిందని సోనియా ఆరోపించారు. దేశ విద్యార్థులు మోదీ ప్రభుత్వ వాదనలను, అహంకారాన్ని బట్టబయలు చేశారని ఆమె అన్నారు.
విద్యార్థులకు అండగా నిలబడి, వారి భవిష్యత్తును కాపాడటం మన నైతిక, రాజకీయ, రాజ్యాంగ బాధ్యత అని సోనియా గాంధీ అన్నారు.
నీట్-యూజీ పరీక్ష పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత జంతర్ మంతర్ వద్ద తమ నిరసనను కొనసాగిస్తున్నారు.
అయితే, ఈ డిమాండ్‌కు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన దీక్షను విరమించారు.

ఫొటో సోర్స్, Getty Images
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా తమ డిమాండ్లన్నీ యథాతథంగానే ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు. వాటిపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు.
"తటస్థ వేదికపై చర్చలు జరపాలన్న మా డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. మాకు సంతోషంగా ఉంది. చర్చల కోసం కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాను ఎంపిక చేశారు. ప్రభుత్వం విశాల దృక్పథంతో మా ముందుకు వచ్చినందుకు, వీధుల్లోకి వచ్చిన ప్రజల మాట వినడానికి సుముఖంగా ఉన్నందుకు మాకు ఆనందంగా ఉంది" అని సౌరవ్ దాస్ చెప్పారు.
"వారు జంతర్ మంతర్‌కూ వచ్చుండొచ్చు. కానీ మేమే ప్రత్యామ్నాయంగా తటస్థ వేదికను సూచించాం. వారు జంతర్ మంతర్‌కు రావడానికి సంకోచించవచ్చని మాకు అర్థమైంది. మేము చదువుకున్న, తెలివైన వ్యక్తులం. అందుకే ఈ తటస్థ వేదికను ప్రతిపాదించాం" అని ఆయన తెలిపారు.
నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిన తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు మరికొన్ని డిమాండ్లతో కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు నెల రోజులకు పైగా దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్నారు.
అయితే ఈ డిమాండ్లకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను విరమించారు.

ఫొటో సోర్స్, Getty Images
సోనమ్ వాంగ్‌చుక్ గురువారం అర్ధరాత్రి తర్వాత తన నిరాహార దీక్షను విరమించడంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే సంతోషం వ్యక్తంచేశారు.
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణపై అభిజిత్ దీప్కే ‘ఎక్స్’లో ఓవీడియో విడుదల చేశారు.
"సోనమ్ సర్ 26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను విరమించడం మాకు ఉపశమనం, సంతోషాన్ని కలిగించింది. సర్.. మీ అసాధారణ ధైర్యానికి, త్యాగానికి ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి, యావత్ దేశ మనస్సాక్షిని కదిలించారు. మీ జీవితం ఈ దేశానికి చాలా విలువైనది" అని అందులో రాశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసన కొనసాగుతుందని తెలిపారు.
నీట్-యూజీ పేపర్ లీక్‌కు నిరసనగా విద్యార్థులు గత నెల రోజులుగా జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ డిమాండ్‌కు మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.

ఫొటో సోర్స్, x.com/sonamwangchuk
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల తర్వాత తన నిరాహార దీక్షను విరమించారు.
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్‌లతో పాటు లేహ్-లడఖ్ అపెక్స్ బాడీకి చెందిన సీనియర్ నాయకుల సమక్షంలో తాను నిరాహార దీక్ష విరమించినట్టు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
"గతంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు నిరాహార దీక్ష విరమించాలని కోరుతూ ఒక లేఖ రాశారు" అని సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు.
దేశంలో హింస చెలరేగే అవకాశం ఉన్నందున, అనేక షరతులపై సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
"ఈ షరతులను నేను త్వరలోనే ఒక ప్రత్యేక వీడియోలో వివరంగా వివరిస్తాను. ఈలోగా మీరందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి హింస జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను" అని ఆ పోస్ట్‌లో రాశారు.
నీట్-యూజీ పేపర్ లీక్‌కు నిరసనగా విద్యార్థులు గత నెల రోజులుగా జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ గత 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు.
దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ అప్టేడ్ చేస్తాం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బీబీసీ న్యూస్ తెలుగు వెబ్‌సైట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన వార్తలను ఇక్కడ చదవొచ్చు.