You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘గంటకోసారి ప్యాడ్ మార్చుకోవాల్సి వస్తుంది, ప్రతిసారి డాక్టర్ దగ్గరకు వెళ్లలేం’ - వస్త్రపరిశ్రమల్లో మహిళా కార్మికులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు?
- రచయిత, నందిని వెళ్లైసామి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో గార్మెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న మహిళలు వడగాడ్పుల కారణంగా నెలసరి సమస్యలతో పాటు పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిపై బీబీసీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
ఓ ఇంటి మిద్దెపైన పదిమిషన్లతో నడుస్తున్న ఆ చిన్న పరిశ్రమలోకి అడుగుపెట్టగానే చాలా వేడిగా అనిపించింది. అక్కడ పది ఎలక్ట్రిక్ కుట్టుమెషిన్ల ఒకదానికొకటి ఇరుకుగా అమర్చి పెట్టారు. ఆ మెషిన్లను, మహిళలు కూర్చునే ప్రదేశాన్ని తాకితే చాలు ఎంత వేడిగా ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది.
ఈ ఫ్యాక్టరీ తిరుప్పూర్‌లోని తారాపురం రహదారిలోని చెట్టిపాళయం ప్రాంతంలో ఉంది. మేం వెళ్లిన సమయంలో బయట వేడి 40 డిగ్రీల ఎండ ఉంది. దాని ప్రభావం ఈ పరిశ్రమలోనూ కనిపించింది. మేం అక్కడ గౌరీని కలుసుకున్నాం. పొద్దున్నుంచి ఆమె దుస్తులు కుడుతూ చెమటతో తడిసిపోయి కనిపించారు.
వేసవి కాలంలో సక్రమంగా రాని నెలసరితోపాటు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.
''ఎండాకాలంలో, పీరియడ్స్ సమయంలో నా పొత్తికడుపును పిండేసినట్లు నొప్పి వస్తుంది. ప్రతిసారీ డాక్టర్ దగ్గరకు వెళ్లలేను. అలా వెళ్లేంత ఆర్థిక పరిస్థితి కూడా లేదు. నేనే మెడికల్ షాప్‌కు వెళ్లి పెయిన్ కిల్లర్స్ కొనుక్కుంటాను. ఒకవేళ నొప్పి చాలా ఎక్కువుంటే, ఇంజెక్షన్ చేయించుకుంటాను. పీరియడ్స్ వచ్చిన ఐదు రోజులూ ఇదే పరిస్థితి'' అని గౌరీ తెలిపారు.
భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 2025 డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమలో నాలుగున్నర కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. వారిలో 70 శాతం మంది మహిళలే.
వస్త్ర పరిశ్రమలోని మొత్తం ఉపాధిలో తమిళనాడు వాటా 28 శాతమని తమిళనాడు వస్త్రపరిశ్రమ డేటా చెబుతోంది.
ఇరుకైన ఫ్యాక్టరీలు, తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా తీవ్ర అనారోగ్యాలపాలవుతున్నారని ప్రభుత్వేతర సంస్థ హీట్ వాచ్, ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సస్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
ఈ అధ్యయనం ఫిబ్రవరిలో ప్రచురితమైంది. ఇందుకోసం తమిళనాడు, దిల్లీలోని 115 గార్మెంట్ ఫ్యాక్టరీ కార్మికులను వడగాడ్పుల కారణంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇంటర్వ్యూ చేశారు.
'అధిక రక్తస్రావం, నొప్పి'
''నెలసరి సమయంలోనే కాదు, ఎండాకాలంలో మూత్ర విసర్జన సమయంలో చికాకు, జననేంద్రియాల్లో నొప్పి, చిన్న సెగ గడ్డలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాబ్లెట్ వేసుకున్నాక.. రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెబుతారు. కానీ, నేను చేస్తున్న పనిలో ఇలా విశ్రాంతి తీసుకోడానికి వీలుండదు. విశ్రాంతి తీసుకుంటే, పనిచేయలేం'' అని గౌరి చెప్పారు.
''కొన్ని సమయాల్లో, నెలసరి సమయంలో గర్భాశయం తొలగిస్తారేమో అనిపిస్తుంది. దీర్ఘకాలం టాబ్లెట్లు వాడటం వల్ల ఇన్‌ఫెర్టిలిటీకి దారితీయచ్చని డాక్టర్లు హెచ్చరించారు'' అని తెలిపారు.
ఆ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుందని, ప్రతి గంటకు లేదా గంటన్నరకు ఒకసారి ప్యాడ్ మార్చాల్సి వస్తుందని గౌరి చెప్పారు.
"ఈ వేడిలో పనిచేయడానికి అలవాటు పడ్డాం" అని గౌరి తెలిపారు.
ఇది కేవలం గౌరి సమస్య మాత్రమే కాదు. 96.8 శాతం మహిళా కార్మికులు మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపిస్తుందని తెలిపినట్లు హీచ్ వాచ్ అధ్యయనంలో వెల్లడైంది. 94 శాతం మంది మహిళా కార్మికులు వైట్ డిశ్చార్జ్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. దీన్ని సాధారణంగా ఈస్ట్ ఇన్‌ఫెక్షన్ లక్షణంగా భావిస్తారు.
92.6 శాతం మంది మహిళలు అపసవ్య నెలసరితో పాటు విపరీతమైన నొప్పిని అనుభవిస్తున్నారు.
వేసవి కాలంలో తాను తీవ్రమైన వైట్ డిశ్చార్జ్, మూత్రనాళ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నట్లు గౌరితో పనిచేసే మరో కార్మికురాలు కలైసెల్వి చెప్పారు.
''ఉదయం ఆరు గంటలకే లేచి, నా పిల్లలు, భర్త కోసం వంట చేయాలి. బయలుదేరడానికి ముందే అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఎండాకాలంలో ఇంట్లో ఈ పనులు చేయడానికే తీవ్రమైన అలసట వస్తుంది. ఇంటి నుంచి పనిచేసే ప్రాంతానికి వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు నడవాలి. అక్కడికి చేరుకునేటప్పటికే విపరీతమైన వేడి ఉంటుంది. ఈ వేసవి కాలంలో కొన్ని నెలలుగా నాకు కేవలం ఒక్కరోజు మాత్రమే నెలసరి అవుతోంది. ఆ ఒక్కరోజు కూడా తీవ్రమైన చికాకు, అధిక రక్తస్రావం, భరించలేని కడుపు నొప్పి వస్తుంది. డాక్టర్ ఏదైనా సమస్య చెబుతారేమోనని భయపడి ఆస్పత్రికి కూడా వెళ్లడం లేదు. నాకీ సమస్య ఉందని ఎవరితోనూ చెప్పుకోలేను'' అని కలైసెల్వి చెప్పారు.
పని సామర్థ్యంపై ప్రభావం
కార్మికులకు ఎండ నుంచి ఉపశమనానికి ఫ్యాన్ మాత్రమే ఉంది. దాని నుంచి కూడా కేవలం వేడి గాలే వస్తుంది. ''ఈ మండుటెండలో కనీసం బయటికి కూడా వెళ్లలేం'' అని కార్మికులు చెప్పారు.
''చాలా సార్లు విశ్రాంతి తీసుకోడానికి సమయం కూడా దొరకదు. విరామం సమయంలో ఫ్యాక్టరీ లోపలే టీ ఇస్తారు'' అని కలైసెల్వి తెలిపారు.
ఎండ కారణంగా కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నా.. అది వారి పనిపై, ఆదాయంపై ప్రభావం చూపుతుందని అన్నారు.
''ఎక్కువ సేపు కూర్చుని కుట్టలేం. సాధారణంగా మేం రోజుకు 350 నుంచి 400 పీసులు కుడతాం. కానీ, వేసవిలో 300 పీసులు మాత్రమే కుట్టగలం. వారానికి రూ. 3,500 నుంచి రూ.4,000 తీసుకునే చోట, ఇప్పుడు రూ. 3,000 మాత్రమే తీసుకోగలుగుతున్నాం. దానితోనే మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం" అని తెలిపారు.
‘మంచినీళ్లు కూడా తాగం’
కుప్పుచిపాళయంలోని సుమారు 100 కుట్టు మెషిన్లతో నడిచే ఒక పెద్ద గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే భాగ్యలక్ష్మిని మేం కలిశాం.
ఎక్కువ మొత్తంలో బట్టలు కుట్టాల్సి వచ్చినప్పుడు, టాయిలెట్‌కు వెళ్లడాన్ని కూడా ఆపుకోవాల్సి వస్తుందని ఆమె చెప్పారు.
''పని ఎక్కువగా ఉన్నప్పుడు, మంచినీళ్ల గురించి కూడా ఆలోచించం. మూత్ర విసర్జన సరిగ్గా చేయలేం. చికాకుగా అనిపిస్తుంది. పీరియడ్స్ సమయంలో రక్తస్రావం ఎక్కువ అవుతుంది. విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. ఎండాకాలంలో ఎలక్ట్రిక్ కుట్టు మెషిన్ నుంచి వచ్చే వేడి సెగ శరీరానికి అంత మంచిది కాదు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. కానీ, మేం అలా చేయలేం. నొప్పి తగ్గే మాత్రలు వేసుకుని, పనిచేస్తుంటాం'' అని భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.
మేం ఆమెను కలిసినప్పుడు సాయంత్రం ఆరు అవుతోంది. భాగ్యలక్ష్మితో పాటు ఇంకా కార్మికులు అక్కడే ఉన్నారు.
ఉదయం 9 గంటలకే పని ప్రారంభించినప్పటికీ, ఒక్కసారిగా ఎక్కువ బట్టలు కుట్టాల్సి రావడంతో, ఆ రోజు పని ముగిసే సరికి సాయంత్రం 8 అవుతుందని భాగ్యలక్ష్మితో పాటు అక్కడున్న మిగతా కార్మికులు తెలిపారు.
"చాలా సమయం ఒకేచోట కూర్చుని కుట్టడం వల్ల కళ్లు తిరుగుతాయి. అప్పుడు నీళ్లు మాత్రమే తాగుతాం. లేదంటే సోయంతా పని మీదే. ఎండాకాలంలో నెలసరి కూడా సరైన సమయానికి రాదు" అని భాగ్యలక్ష్మి చెప్పారు.
కుప్పుచిపాళయంలో ప్రాంతంలో ఒక బట్టల దుకాణం నడిపే మేనేజింగ్ డైరెక్టర్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ.. ''ప్రభుత్వ నిబంధనల ప్రకారం టాయిలెట్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించాం. ప్రతి పది అడుగులకు ఒక కిటికీ ఏర్పాటు చేశాం. తగినన్ని ఫ్యాన్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మంచి వెలుతురు, గాలి వస్తాయి'' అని చెప్పారు.
''గార్మెంట్ ఫ్యాక్టరీల్లో ఏసీలు ఏర్పాటు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఏసీలు ఏర్పాటు చేస్తే.. దుమ్మంతా లోపలే పేరుకుపోయి, సమస్యలు ఎక్కువ అవుతాయి'' అని తెలిపారు.
కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం ఉందని చెప్పారు. వడగాడ్పుల ప్రభావాన్ని తగ్గించడానికి కార్మికులకు తాము నిమ్మరసం, మజ్జిగ అందించాలని యోచిస్తున్నట్టు చెప్పారు.
‘తగినంత నీరు తాగాలి’
ఎండాకాలంలో ఎక్కువసేపు కుట్టు మెషిన్‌పై కూర్చుని పనిచేయడం వల్ల మహిళలు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తిరుప్పూర్ ఆస్పత్రిలోని గైనకాలజిస్ట్ కవిత ముత్తువేల్ చెప్పారు.
''సాధారణంగానే.. ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే, మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. పైగా సరిగ్గా మంచినీరు తాగకపోతే, అది మీ నెలసరిపై ప్రభావం చూపుతుంది. అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, అసౌకర్యం వంటివి కలగవచ్చు. 40 ఏళ్లు పైబడిన మహిళలకు అత్యధికంగా వైట్ డిశ్చార్జ్ అవ్వొచ్చు. గర్భాశయ పుండ్లు కూడా రావొచ్చు. గార్మెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేసే వారు ముఖ్యంగా మహిళలు.. మంచి పరిశుభ్రతను పాటించాలి, తగినంత నీరు తాగాలి, పోషకాహారాన్ని తీసుకోవాలి'' అని సూచించారు.
మూత్రనాళ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అది గర్భాశయ ముఖద్వారాన్నిప్రభావితం చేయగలదని డాక్టర్ కవిత తెలిపారు.
''నీళ్లు సరిగ్గా తాగకుండా, మూత్ర విసర్జన సరిగ్గా చేయకపోతే.. మూత్రనాళ ఇన్ఫెక్షన్ రావొచ్చు. మూత్రనాళం, గర్భాశయ ముఖద్వారం పక్కపక్కనే ఉండటం వల్ల, ఈ ఇన్ఫెక్షన్ వస్తే.. అది గర్భాశయ ముఖద్వారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది వైట్ డిశ్చార్జ్‌కు కారణమవుతుంది'' అని చెప్పారు.
''డీహైడ్రేషన్ వల్ల హార్మోన్ల ఉత్పత్తి దెబ్బతిని, నెలసరి ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాకుండా... జననేంద్రియాల్లో దురద, పుండ్లు, బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంది. వీటిని నివారించుకునేందుకు, రోజూ 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడంతో పాటు.. ద్రవ పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి'' అని ఆమె సూచించారు.
వైద్యుల సలహా లేకుండా దీర్ఘకాలం పాటు పెయిన్ కిల్లర్స్ వాడితే... కిడ్నీ సమస్యలు, ఇన్‌ఫెర్టిలిటీ వంటి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తవచ్చని డాక్టర్ కవిత ముత్తువేల్ హెచ్చరించారు.
ఈ సమస్యలకు పరిష్కారమేంటి?
ఇటువంటి ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులపై వడగాడ్పులు చూపించే ఆరోగ్య ప్రభావాలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని, ఉచితంగా పీరియడ్ ప్యాడ్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని మహిళా హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు.
''గార్మెంట్ ఫ్యాక్టరీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. అలాంటి కార్మికులకు పని చాలా ఎక్కువగా ఉంటుంది. వారికి జీతం కూడా తక్కువే. ఉదయం 8 గంటలకు వస్తే.. రాత్రి 8 వరకి చేస్తుంటారు. ఎక్కువ సేపు కూర్చుని, మెషిన్ కుట్టడం వల్ల పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.’’ అన్నారు అఖిల భారత ప్రజాస్వామ్య మహిళ సంఘం తిరుప్పూర్ జిల్లా సహకార్యదర్శి ఆర్.కే సెల్వి
‘‘కంపెనీలు విరామం సమయంలో వేడి నుంచి ఉపశమనానికి పానీయాలు అందించాలి. ఉచితంగా నాణ్యమైన నాప్‌కిన్లు ( అందించే ఏర్పాట్లు చేయాలి. పరిశుభ్రమైన మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించాలి'' అన్నారు సెల్వి.
తీవ్రమైన వేడి వాతావరణంలో పనిచేసే కార్మికులకు ప్రత్యేక అలవెన్స్‌ను అందించాలని హీట్ వాచ్ అధ్యయనం సూచించింది. ఈ సమస్యలను పని సంబంధిత అనారోగ్య సమస్యలుగా పరిగణించాలి. ఈఎస్ఐ యాక్ట్ 1948ను సవరించి, హీట్ స్ట్రెస్ సంబంధిత అనారోగ్య సమస్యల చికిత్సను చేర్చాలి. కార్మికులలో ఈ లక్షణాలను గుర్తించేందుకు వారి సూపర్‌వైజర్లకు కంపెనీలు శిక్షణ ఇవ్వాలని పేర్కొంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)