అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం: అంతర్జాతీయంగా పతాక శీర్షికలలో నిలిచిన పాకిస్తాన్, భారత్‌ దీనిని ఎలా చూడాలి?

    • రచయిత, కైసర్ అంద్రాబి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

నాలుగు నెలల ఘర్షణకు ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్టు వెలువడిన ప్రకటనను మధ్యప్రాచ్యంతో పాటు ప్రపంచమంతా స్వాగతించింది.

ఈ చర్చల్లో పాకిస్తాన్ దౌత్యపరంగా కీలక పాత్ర పోషించింది. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో చోటుచేసుకున్న ముఖ్యమైన దౌత్య పరిణామాలలో ఒకటైన ఈ ఒప్పందం విషయంలో న్యూదిల్లీ పాత్ర లేకపోవడంపై దేశంలో చర్చను రేకెత్తించింది.

పాకిస్తాన్, గల్ఫ్ దేశాలు, ఇతర దేశాల కృషితో కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతోంది. ముఖ్యంగా.. పాకిస్తాన్ ఈ ప్రక్రియలోని వివిధ దశల్లో కీలక పాత్ర పోషించిందని భావిస్తున్నారు.

ఈ ఒప్పందాన్నిభారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఇది శాంతి పునరుద్ధరణకు, కీలక సముద్ర మార్గాలలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి భరోసానిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇరుదేశాల మధ్య వైరానికి ముగింపు పలికి, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి మార్గం సుగమం చేసే ఈ ఒప్పందంపై జూన్ 19న స్విట్జర్లాండ్‌లో సంతకాలు చేయనున్నారు.

పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండా..

మధ్యప్రాచ్యంలో సంఘర్షణకు ముగింపు పలికే లక్ష్యంతో కుదిరిన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ఇది ప్రపంచవ్యాప్తంగా ''తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు'' కలిగించిందని, పలు దేశాల్లో ప్రాణ నష్టానికి కారణమైందన్నారు.

ఈ ఒప్పందం అమలు '' శాంతిపునరుద్దరణకు, ప్రాంతీయ స్థిరత్వానికి'' తోడ్పడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

మిగిలిన సమస్యలపై చర్చల ద్వారా ఒక సుస్థిరమైన శాశ్వత ఒప్పందానికి వస్తారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే, శాంతి ఒప్పందంలో పాకిస్తాన్ పాత్రను మోదీ ఎక్కడా ప్రస్తావించలేదు.

దశాబ్దాలుగా భారత్, పాకిస్తాన్ మధ్య వైరం కొనసాగుతోంది. అయితే నిరుడు పహల్గాంలో మిలిటెంట్లు 26 మంది భారతీయ పర్యటకులను చంపిన తర్వాత ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.

ఈ దాడికి పాకిస్తానే కారణమని భారత్ ఆరోపించింది. ఈ ఆరోపణను ఇస్లామాబాద్ ఖండించింది. అనంతరం పాకిస్తాన్‌లోని ‘మిలిటెంట్ స్థావరాలపై’ వైమానిక దాడులు నిర్వహించినట్టు భారత్ ప్రకటించింది.

అణ్వస్త్రసామర్థ్యం కలిగిన ఈ పొరుగుదేశాల మధ్యన కొన్నిరోజులపాటు వైమానిక దాడులు, కాల్పులు జరిగాయి. అనంతరం కాల్పుల విరమణను ప్రకటించాయి. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదర్చడానికి తమ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

న్యూదిల్లీలో జరిగిన ఒక సమావేశంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం ఈ ప్రాంతంలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హార్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుతమైన రాకపోకలను భారత్ కోరుకుంటుందని, శాంతి, ప్రాంతీయ స్థిరత్వాన్ని నెలకొల్పే అన్ని ప్రయత్నాలను స్వాగతిస్తోందని ఆయన చెప్పారు.

ఈ ఒప్పందం యుక్రెయిన్‌లో శాంతి ప్రయత్నాలను కూడా వేగవంతం చేస్తుందని కూడా రణధీర్ జైస్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేతలు ఈ ఒప్పందాన్ని పశ్చిమాసియాకు కీలక దౌత్య పురోగతిగా అభివర్ణించారు.

పాకిస్తాన్ ఈ చర్చల్లో మధ్యవర్తిత్వం వహించిన దేశాల్లో ఒకటి. ఈ ఒప్పందాన్ని తొలుత ప్రకటించిన దేశం పాకిస్తానే.

లెబనాన్‌ సహా అన్ని చోట్లా సైనిక కార్యకలాపాలను తక్షణమే, శాశ్వతంగా నిలిపివేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ తెలిపారు.

"సాంకేతిక అంశాలపై చర్చలకు" పునాది వేయడానికి మధ్యవర్తిత్వ దేశాలు ఈ వారం సమావేశమవుతాయని ఆయన తెలిపారు.

ఆ తర్వాత డోనల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకాదళం కొనసాగిస్తున్న దిగ్బంధనాన్ని ముగించడానికి తాను ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

''అందరికీ అభినందనలు!'' అని సోషల్ మీడియాలో రాశారు. 'ప్రపంచంలోని నౌకలన్నీ ఇక తమ ఇంజిన్లు ఆన్ చేయొచ్చు. ఇక చమురు ప్రవహించనీ' అంటూ ఆయన పోస్ట్ చేశారు.

ఈ ఒప్పందం నుంచి పాకిస్తాన్ ఏం పొందింది?

అమెరికా-ఇరాన్ ఒప్పందంలో పాకిస్తాన్ పాత్ర మధ్యప్రాచ్యంలో దాని స్థానాన్ని బలోపేతం చేయగలదని, భారత్‌తో వ్యూహాత్మక పోటీలో పై చేయి కాగలదని వూడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్‌ లో సౌత్ ఏషియా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ కుగెల్‌మన్ బీబీసీతో అన్నారు.

ఈ ఒప్పందం ఇస్లామాబాద్‌కు దౌత్యపరమైన విజయం మాత్రమే కాదు, అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఏకాకిని చేయాలన్న భారత ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బని చెప్పారు.

"అమెరికా, ఇరాన్‌ మధ్య ఈ ఒప్పందాన్ని కుదర్చడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు ఆ దేశానికి భారత్‌తో జరుగుతున్న వ్యూహాత్మక పోటీలో ఒక పెద్ద విజయాన్ని అందించాయి" అని కుగెల్‌మన్ అన్నారు.

రెండు దేశాలకు మధ్య ప్రాచ్యం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఇంధన, పెట్టుబడుల వనరుగా, రాజకీయ ప్రభావానికి మూలంగా ఉంటోంది.

ఈ ఒప్పందం వల్ల ఆ ప్రాంతంలో పాకిస్తాన్‌కు పెరుగుతున్న ప్రభావాన్ని భారత్ ఎదుర్కోవలసి వస్తుందని ఆయన చెప్పారు.

"మధ్యప్రాచ్యంలోని అనేక ప్రధాన దేశాలు ఇప్పుడు పాకిస్తాన్‌ను ఒక ముఖ్యమైన అధికార మధ్యవర్తిగా, బహుశా భద్రతను చేకూర్చే దేశంగా చూస్తున్నాయి" అని ఆయన అన్నారు.

రాజకీయ అణచివేత, ప్రజల అసంతృప్తి కారణంగా అటు ప్రభుత్వం, ఇటు సైన్యం విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో, ఈ దౌత్యపరమైన విజయం సొంత దేశంలో పాకిస్తాన్ నాయకుల ప్రతిష్ఠను పెంచవచ్చని కుగెల్‌మన్ అభిప్రాయపడ్డారు.

"తీవ్రవాదం, రాజకీయ అస్థిరతకు సంబంధించిన సంవత్సరాల తరబడి ప్రతికూల వార్తలు వెలువడిన తర్వాత, ఇది ఆ దేశ అంతర్జాతీయ ప్రతిష్ఠను పునర్నిర్మించడంలో ఈ దౌత్య విజయం సహాయపడగలదు" అని ఆయన వివరించారు.

ఈ మధ్యవర్తిత్వం విషయంలో పాకిస్తాన్ పాత్రపై భారత్‌కు ఉన్న అనుమానాలు దశాబ్దాల వైరం నుంచి పుట్టినవేనని సౌత్ ఏషియన్ సింఫనీ ఆర్కెస్ట్రా వ్యవస్థాపకురాలు, మాజీ భారత దౌత్యవేత్త నిరుపమా మేనన్ రావు బీబీసీకి తెలిపారు. అయితే, దౌత్యాన్ని భావోద్వేగాల కోణం నుంచి కాకుండాప్రయోజనాల కోణం నుంచి చూడాలన్నారు.

‘‘పాకిస్తాన్‌తో భారత్‌ సంబంధాలు చాలా దారుణంగా ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ పోషిస్తున్న పాత్రపై స్పందించే విషయంలో కొంత నిరాసక్తత కనిపిస్తోంది’’ అని చెప్పారు. అయినపట్పికీ, దౌత్యాన్ని భావోద్వేగాల ఆధారంగా కాక, సాధించిన ఫలితాల ఆధారంగానే అంచనా వేయాలన్నారు.

భారత్ ఏం నేర్చుకోవాలి?

భారత ప్రభుత్వం అధికారికంగా ఈ ఒప్పందాన్ని స్వాగతించినప్పటికీ, ఈ కీలకమైన దౌత్యపరమైన కార్యక్రమంలో భారత్ గణనీయ పాత్ర పోషించడంలో విఫలమైందని, ఇప్పుడు ప్రాధాన్యం లేకుండా పోయిందని ప్రతిపక్ష నాయకులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అధికార భారతీయ జనతా పార్టీ నాయకత్వం, దౌత్యపరమైన చర్యలపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు పవన్ ఖేరా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పలు ప్రశ్నలు సంధించారు.

''భారత్‌కు, ఈ పరిమాణం నవీన ప్రపంచ వ్యవస్థలో మన స్థానం గురించి పలు ఇబ్బందికరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వ ప్రయత్నాల ద్వారా ఈ ఒప్పందం కుదిరింది. ఇరాన్‌తో నాగరికతపరమైన సంబంధాలు ఉన్నప్పటికీ.. అలాగే ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య విస్తృత ప్రచారం పొందిన వ్యక్తిగత స్నేహం ఉన్నప్పటికీ, ఈ విషయంలో భారత్‌కు ఎక్కడా కనిపించలేదు" అని చెప్పారు.

ఈ సంబంధాలను సద్వినియోగం చేసుకోవడంలో, భారత్ దౌత్య ప్రాధాన్యాన్ని పెంచడంలో, లేదా శాంతి ప్రయత్నాలకు అర్థవంతమైన సహకారం అందించడంలో భారత ప్రభుత్వం విఫలమైందని ఖేరా అన్నారు.

''టెర్రరిజానికి మద్దతు ఇవ్వడం, దానిని ఇతర దేశాలకు విస్తరించడంలో పాకిస్తాన్ పాత్రను ప్రపంచానికి చాటిచెప్పేందుకు భారత్ ఎన్నోఏళ్లుగా పనిచేస్తోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో నిరంతర దౌత్య ప్రయత్నాల ఫలితంగా పాకిస్తాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితాలో చేర్చగలిగాం. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రపంచ స్థిరత్వంలో భాగస్వామిగా, శాంతికి మార్గదర్శిగా తనను తాను విజయవంతంగా ప్రదర్శించుకోగలిగింది" అని ఆయన అన్నారు.

శాంతి నెలకొల్పడంలో పాకిస్తాన్ పాత్రను కచ్చితంగా స్వాగతించాలని, ఎందుకంటే, ప్రాంతీయ స్థిరత్వం భారత్‌కూ ప్రయోజనకరమని సీనియర్ జర్నలిస్ట్, రచయిత కల్లోల్ భట్టాచార్జీ చెప్పారు.

ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి ఇంధన సరఫరాల కోసం, ఆర్థికాభివృద్ధికి ఆ ప్రాంతంపై భారత్ ఆధారపడటం చూస్తే ఇది చాలా అవసరమని చెప్పారు.

ప్రత్యర్థి దేశం పోషించిన సానుకూల పాత్రను అంగీకరింత పరిణితి, బలం భారత్‌కు ఉందన్నారు.

‘‘పాకిస్తాన్ చొరవగా చేసిన పని భారత్‌కు ఉపయోగపడుతుంది. అందుకే భారత్, పాకిస్తాన్ వైరమనే దక్షిణాసియా ప్రాంతీయ రాజకీయ పరిమితులను దాటి, నిర్మాణాత్మక దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని భట్టాచార్జీ వివరించారు.

పాకిస్తాన్ దౌత్యపాత్రపై భారత్ న్యూనతకు గురికావాల్సిన అవసరం లేదని, దీనికి బదులుగా చిరకాల భాగస్వామి అయిన ఇరాన్‌తో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని సూచించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)