ఎండాకాలంలో వండిన ఎంతసేపటికి ఆహారం పాడవుతుంది? ఫుడ్ పాయిజన్‌గా ఎప్పుడు మారుతుంది?

    • రచయిత, ఓంకార్ కరంబేల్కర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 7 నిమిషాలు

వేసవిలో కిచెన్‌లో చేసే ఒక చిన్న పొరపాటైనా ఆరోగ్యానికి పెద్ద ప్రమాదంగా పరిణమించవచ్చు.

వండిన ఆహారాన్ని కొంతసేపు బయట ఉంచినా, కోసిన పండ్లను అలాగే వదిలేసినా, లేదా మిగిలిపోయిన ఆహారాన్ని సరైన సమయంలో ఫ్రిజ్‌లో పెట్టకపోయినా, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

తరచూ.. ఆహారం చూడటానికి బాగుండి, వాసన మంచిగా ఉంటే చాలు ఎలాంటి సంకోచం లేకుండా తినేస్తుంటాం.

అయితే, శరీరానికి హాని కలిగించే ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఎలాంటి సంకేతాలు లేకుండానే ఆహారంలో పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఆహార భద్రతలో "2 గంటల నియమం" చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దీని అర్థం.. వండిన ఆహారాన్ని గది ఉష్ణోగ్రతలో రెండు గంటలకంటే ఎక్కువసేపు ఉంచకూడదు.

అత్యంత వేడి వాతావరణంలో ఈ సమయాన్ని గంటకు తగ్గించవచ్చు. వేసవిలో అన్నం, బిర్యానీ, కూరగాయలు, మాంసాహారాలు, పాలు, పెరుగు, ముక్కలు ముక్కలుగా కోసిన పండ్లు చాలా త్వరగా పాడైపోతాయి.

ఆహారం నిల్వ సరిగ్గా ఉంచకపోవడం, పరిశుభ్రత లోపించడం, తినడానికి పనికి రాని ఆహారాన్ని తిరిగి వేడి చేయడం వంటి వాటివల్ల, వేసవిలో చాలా కుటుంబాల్లో ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలు పెరుగుతున్నాయి.

అయితే, వేసవిలో ఆహారాన్ని పాడవ్వకుండా ఉంచుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఫుడ్ పాయిజనింగ్‌కు కారణాలేంటి?

వేసవిలో తరచూ ఆహారం పాడవ్వడానికి ప్రధాన కారణాలు.. ఆహారం తయారు చేసేటప్పుడు లేదా నిల్వ చేసేటప్పుడు చేసే తప్పిదాలే.

కలుషితమైన నీటిని వాడటం, పరిశుభ్రత లోపించడం, ఒకే కట్టింగ్ బోర్డుపైన పచ్చి, వండిన ఆహారాన్ని కోయడం, ఆహారాన్ని ఎక్కువసేపు ఫ్రిజ్‌లో కాకుండా బయట ఉంచడం లేదా మిగిలిపోయిన ఆహారాన్ని సరిగ్గా వేడి చేయకపోవడం వంటివి ఆహారం విషపూరితంగా మారే ప్రమాదాలను పెంచుతాయి.

కొన్ని సూక్ష్మక్రిములు ముఖ్యంగా బియ్యం, బియ్యం ఆధారిత ఆహారాల్లో ఉండేవి గది ఉష్ణోగ్రతల వద్ద వేగంగా పెరుగుతాయని నిపుణులు చెప్పారు. వేడికి కూడా నశించని విష పదార్థాలను ఇవి ఉత్పత్తి చేయగలవని నిపుణులు అంటున్నారు.

అందుకే వండిన ఆహారాన్ని గంట, రెండు గంటల్లోగా ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్లాట్ కంటైనర్లలో నిల్వ చేయాలి. తినడానికి ముందు పూర్తిగా వెచ్చగా అయ్యేలా మళ్లీ వేడి చేసుకోవాలి. కేవలం వాసన లేదా రుచిని బట్టి ఆహారం బాగుందని అనుకోవద్దు.

''వేసవిలో వండిన బియ్యం (బాసిల్లస్ సెరియస్ ప్రమాదం కారణంగా), మాంసం, చికెన్, చేప, బిర్యానీ, మిశ్రమ పదార్థాలు, పాలు, పాల పదార్థాలు, కోసిన పండ్ల ముక్కలు ముఖ్యంగా పుచ్చకాయ, కర్బూజా, బొప్పాయి, మామిడి, సూప్, కూరగాయలు, తేమ, ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలు త్వరగా పాడవుతాయి'' అని డోంబివాలిలోని డైటీషియన్, న్యూట్రిషనిస్ట్‌గా పనిచేసే ధన్వి మైషేరి చెప్పారు.

''వేసవిలో 2 గంటల నియమం తప్పనిసరిగా పాటించాలి. 32 డిగ్రీల సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రతల్లో ఈ వ్యవధిని గంటకు తగ్గించాలి. 5 డిగ్రీల నుంచి 60 డిగ్రీల ఉష్ణోగ్రతల రేంజ్‌లో సూక్ష్మక్రిములు చాలా వేగంగా పెరుగుతాయి. వేసవిలో వండిన ఆహారాన్ని ఎక్కువసేపు బయట ఉంచితే, అది చూడ్డానికి బాగున్నా, వాసన మంచిగా వస్తున్నా, తినడానికి ప్రమాదకరం'' అని ఆమె తెలిపారు.

బయట ఉంచిన ఆహారంలో ఏ బ్యాక్టీరియ ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

దీని గురించి మరింత సమాచారాన్ని థానేలోని జుపిటర్ హాస్పిటల్‌లో ఇంటర్నల్ మెడిసిన్ డైరెక్టర్‌గా పనిచేసే డాక్టర్ అమిత్ సరాఫ్ బీబీసీకి తెలిపారు.

‘‘సాల్మోనెల్లా, ఇ. కోలి, స్టాఫిలోకాకస్ ఆరియస్, క్యాంపిలోబాక్టర్ అనేవి ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ప్రధాన బ్యాక్టీరియాలు" అని ఆయన అన్నారు.

"అంతేకాకుండా, కొన్ని బ్యాక్టీరియాలు ఆహారాన్ని వేడి చేసినా నశించని విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల అనారోగ్యం బారిన పడే ప్రమాదం పెరుగుతుంది" అని డాక్టర్ సరాఫ్ తెలిపారు.

ప్రమాద సంకేతాలు ఏంటి?

చాలామంది కొద్దిగా కడుపు నొప్పి వచ్చినా లేదా నీళ్ల విరోచనాలు ఒకేసారి అయినా పెద్దగా పట్టించుకోరు. అయితే, ఫుడ్ పాయిజనింగ్‌కు ఇవి కూడా సంకేతాలని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

వాంతులు తరచూ అవుతుంటే, ఏదో జరిగిందనడానికి స్పష్టమైన సంకేతం. 38 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ జ్వరం రావడం అనేది, అంత చిన్న విషయం కాదు. ఇది కూడా ఇన్‌ఫెక్షన్ అభివృద్ధి చెందుతుందనడానికి సంకేతం.

ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ ప్రతీక్ష కదమ్ దీనిపై మరిన్ని వివరాలు అందించారు.

''మలంలో రక్తం పడటం వ్యాధి తీవ్రంగా మారిందనడానికి సంకేతం. నిలబడినప్పుడు కళ్లు తిరిగితే, శరీరానికి అవసరమైన ద్రవాల కొరత పెరుగుతుందనడానికి ఒక సంకేతంగా అర్థం చేసుకోవాలి. ఆహారాన్ని తిరిగి వేడి చేసినప్పుడు అది పూర్తిగా సురక్షితం అనేది ఒక పెద్ద అపోహ. కొన్ని క్రిములు ఆహారంలోనే విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. అవి మళ్లీ ఉడకబెట్టినా నశించవు. అందువల్ల, ఎక్కువసేపు బయట ఉంచిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినడం ప్రమాదకరం కావచ్చు'' అని చెప్పారు.

పిల్లల్ని, పెద్దవారిని పాడైన ఆహారం నుంచి ఎలా సంరక్షించాలి?

పిల్లల రోగనిరోధక వ్యవస్థ అప్పుడే పూర్తిగా అభివృద్ధి చెందదు. చాలా తక్కువ సమయంలోనే వారి శరీరాలు డీహైడ్రేటెడ్ అవుతాయి. పెద్ద వారికి స్టమక్ యాసిడ్‌ తక్కువగా ఉంటుంది. సూక్ష్మక్రిములపై పోరాడేందుకు స్టమక్ యాసిడ్ అనేది సహజ రక్షణ వ్యవస్థ.

అంతేకాకుండా, చాలామంది వృద్ధులు అప్పటికే ఇతర అనారోగ్యాలతో బాధపడుతుంటారు కాబట్టి వారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

చిన్నపిల్లలు, వృద్ధులు లేదా గర్భిణీ స్త్రీలలో లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లు అనిపిస్తే, వారు ఆలస్యం చేయకుండా ఆసుపత్రిలో చూపించుకోవాలి.

ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు అనిపిస్తే ఏం చేయాలి?

ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు అనిపిస్తే, ముందుగా చేయాల్సింది డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) కాకుండా చూసుకోవాలి. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్), తగినంత ద్రవ పదార్థాలు, తేలికపాటి ఆహారం తీసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. వైద్యుడిని సంప్రదించకుండా సొంతంగా మందులు వేసుకోకూడదు.

''ఒకరోజు కంటే ఎక్కువ కాలం లక్షణాలు కనిపిస్తే.. ఒకవేళ వాంతులు అలానే ఉన్నా, కడుపులో నీరు లేదా ద్రవ పదార్థాలు ఉండకుండా బయటికి వచ్చేస్తుంటే, ఎక్కువ జ్వరం వస్తే, డీహైడ్రేషన్ అయిన సంకేతాలు కనిపిస్తే ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్ద వారు ఆలస్యం చేయకుండా వైద్యసాయం తీసుకోవాలి'' అని డాక్టర్ అమిత్ సరాఫ్ తెలిపారు.

ఆహారం పాడైనట్లు ఎలా తెలుస్తుంది?

ఆహారం పాడైపోయిందని మనం తరచూ గుర్తించలేం. అందుకే తినే ముందు ఆహారాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం.

చాలా సందర్భాలలో, ఒక ఆహార పదార్థం పాడైపోతే, అది పుల్లగా లేదా వింత వాసన వస్తుంది. అది జిగటగా మారుతుంది.

పెరుగు వంటి ప్యాక్ చేసిన ఆహారాలలో గ్యాస్ పేరుకుపోయి ప్యాకెట్లు ఉబ్బుతాయి.

కొన్ని ఆహార పదార్థాలపై తెల్లటి లేదా ఆకుపచ్చ బూజు పడుతుంది. ఆహార పదార్థాల రంగులు కూడా మారుతాయి.

అయితే, ఆహారం చూడటానికి, వాసన చూడటానికి బాగానే ఉన్నప్పటికీ, అందులో కొన్ని ప్రమాదకరమైన క్రిములు పెరగగలవు. అందుకే నిల్వ పద్ధతులు చాలా ముఖ్యం.

''సూక్ష్మక్రిములు అభివృద్ధి చెందడాన్ని ఫ్రిజ్ తగ్గిస్తుంది. అయితే, అప్పటికే కలుషితమైన ఆహారాన్ని మాత్రం ఇది సురక్షితంగా మార్చదు. అన్ని సూక్ష్మక్రిములను లేదా విషపూరిత పదార్థాలను చంపేయదు. ఫ్రిజ్‌లో పెట్టడానికి ముందే ఆహారాన్ని సరిగ్గా నిర్వహించకపోతే, ఆ ప్రమాదం అలానే ఉంటుంది'' అని ధన్వి మైషేరి చెప్పారు.

''కోసిన పండ్ల ముక్కలను బయట అలానే 2 గంటల కంటే ఎక్కువ సేపు పెట్టకూడదు. బయట వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు గంటల్లోపే తినాలి. ఒక్కసారి పండ్లను కోసిన తర్వాత, అవి పాడయ్యే, పోషకాలు క్షీణించే ప్రమాదం ఉంది. అందుకే, కోసిన పండ్ల ముక్కులను ఫ్రిజ్‌లో పెట్టాలి, వెంటనే తినేయాలి. కొన్ని ప్రాంతాల్లో ఇటీవల రోజుల్లో పుచ్చకాయ ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు రంగులను, రసాయనాలను వాడుతున్నారు. అలాంటి పుచ్చకాయను తినడం వల్ల కడుపునొప్పి, డయేరియా, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి'' అని ధన్వి తెలిపారు.

ఇంట్లో ఆహారం విషయంలో సాధారణంగా చేసే తప్పులు

  • వండిన ఆహారాన్ని ఎక్కువ సేపు బయట ఉంచడం
  • తిరిగి సరిగ్గా వేడిచేయకపోవడం
  • గంటల తరబడి పెద్ద పాత్రలో ఆహారాన్ని వేడిగా ఉంచడం
  • పండ్లను కోయడం, వాటిని బయట అలానే తెరిచి ఉంచడం
  • పచ్చి, వండిన ఆహారానికి ఒకే రకమైన కత్తిని, కట్టింగ్ బోర్డును ఉపయోగించడం
  • చేతులు శుభ్రంగా ఉంచుకోకపోవడం
  • మిగిలిపోయిన ఆహారాన్ని పదేపదే వేడి చేయడం
  • రుచి లేదా వాసన బట్టి ఆహారం బాగుందని అనుకోవడం

వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ కాకుండా ఉండేందుకు సులభమైన చిట్కాలు

వేసవిలో వీలైనంత తాజా ఆహారాన్ని వండుకోవాలి. ఎల్లప్పుడూ 1-2 నియమాన్ని గుర్తుంచుకోవాలి. వీలైనంత త్వరగా ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఎక్కువసేపు బయట వదిలేయకుండా, ఫ్రిజ్‌లో పెట్టుకోండి. కోసిన పండ్ల ముక్కలను తర్వాత తినాలనుకుంటే, వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

ఆహారాన్ని ముట్టుకునే ముందు చేతులను, పాత్రలను శుభ్రంగా కడుక్కోవాలి. నిల్వ ఉన్న ఆహారాన్ని తినొద్దు. వీధుల్లో బయట తెరిచి ఉంచే ఆహారాన్ని తినొద్దు. మిగిలిపోయిన ఆహారాన్ని తినాలనుకుంటే, దాన్ని సరిగ్గా వేడి చేయాలి. కిచెన్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం పాడైందని అనుమానం వస్తే, దాన్ని తినకపోవడం మంచిది.

మీ జీవనశైలిలో ఏమైనా గణనీయమైన మార్పులను కోరుకుంటే, మీ ఆహార అలవాట్లను మార్చుకోవడం, లేదా ప్రాణాయామం చేయడం లేదా శారీరక వ్యాయామం చేయాలనుకుంటే, డాక్టర్, క్వాలిఫైడ్ ట్రైనర్ సాయం తీసుకోవడం మంచిది. వైద్యుడిని సంప్రదించకుండా సొంతంగా చికిత్స చేసుకోవడం ప్రమాదకరం కావచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)