గంటకు 60 నిముషాలే ఎందుకు ఉంటాయి, ఇలా ఉండాలని ఎవరు చెప్పారు? చరిత్రలో ఏం జరిగింది...

ఫొటో సోర్స్, The Fitzwilliam Museum, University of Cambridge
- రచయిత, జోసెలిన్ టింపర్లీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 9 నిమిషాలు
ప్రస్తుతం మనం లెక్కిస్తున్న సమయం వెనుక 5వేల ఏళ్ల క్రితం తీసుకున్న అంతు చిక్కని నిర్ణయం ఒకటుంది.
1793 అక్టోబర్‌లో కొత్తగా ఏర్పడిన ఫ్రెంచ్ రిపబ్లిక్ ఒక ప్రయోగం ఒకటి చేసింది. కాలాన్ని మార్చాలి అన్నది ఆ ప్రయోగం.
ఫ్రెంచ్ విప్లవంలో పాల్గొన్న విప్లవకారులు, రోజుకు 24 గంటలకు బదులుగా 10 గంటలు ఉండాలని, ప్రతీ గంటకు 100 నిముషాల డెసిమల్స్, ఒక్కో నిముషానికి వంద సెకండ్ల డెసిమల్స్ ఉండాలని నిర్ణయించారు.
సంవత్సరాల కేలండర్‌ను హేతుబద్దీకరించే( క్రైస్తేవతరంగా మార్చడం) లక్ష్యంలో భాగంగా కొత్త టైమ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇందులో పది రోజులు ఉండే వారాన్ని చేర్చారు.
అప్పటికే ఉన్న గడియారాలను డెసిమల్ విధానంలోకి మార్చే పని ప్రారంభించారు. టౌన్ హాల్స్‌లో గోడలకు డెసిమల్ గడియారాలను వేలాడదీశారు. కొత్త క్యాలండర్ ప్రకారం అధికారిక కార్యక్రమాలను నమోదు చేయడం ప్రారంభించారు.

ఈ ప్రయత్నంతో తలనొప్పులు మొదలయ్యాయని లండన్‌లోని గ్రీనిచ్ రాయల్ మ్యూజియంలో సైన్స్ కమ్యూనికేటర్‌గా పని చేస్తున్న ఫిన్ బర్రిడ్జ్ అన్నారు.
అప్పటికే ఉన్న గడియారాలను మార్చడం చాలా కష్టమైంది. ఈ విధానం వల్ల ఫ్రాన్స్ యూరోపియన్ దేశాల్లో ఒంటరిగా మిగిలింది.
పదో రోజు సెలవు అనేది గ్రామీణ జనాభాకు నచ్చలేదు. దీంతో డెసిమల్ టైమ్ అనేది ఫ్రాన్స్‌లో ఏడాదికే అంతరించిపోయింది.
సరే. అసలు మనం రోజుకు 24 గంటలు, గంటకు 60 నిముషాలు, నిముషానికి 60 సెకన్లు లెక్కించడం ఎలా మొదలు పెట్టాం? ఈనాటికీ ఎలా లెక్కిస్తున్నాం? దీని గురించి తెలుసుకోవాలంటే మనం అసలు సమయాన్ని గణించడానికి పూర్వం ఉన్న కాలానికి వెళ్లాలి.
ఎందుకంటే పురాతన అంకెల వ్యవస్థలలో ఒకదాని కథ మనల్ని ఈవైపు నడిపించింది. దీన్ని కనిపెట్టిన నాగరికతను దాటి ఈ విధానం ఎలా మనుగడ సాగించిందో కూడా అది వివరిస్తుంది.

ఫొటో సోర్స్, Cuneiform Digital Library Initiative
60 నిముషాల లెక్కకు పునాది ఎక్కడ?
దీనికి మూలం సుమేరియన్లు. వీరు క్రీస్తుకు పూర్వం 5300-1940 మధ్య మెసపుటోమియాలో (ప్రస్తుత ఇరాక్ ఉన్న ప్రాంతం) నివసించారు.
నగరాలను నిర్మించిన తొలి నాగరికత ఇది. నాగలితో వ్యవసాయం, నీటి పారుదల, తొలిసారిగా రాయడం వంటివాటిని మొదలుపెట్టిన ఘనతలన్నీ ఈ నాగరికతకే దక్కుతాయి.
60 అనే భావనపై ఆధారపడిన అంకెల వ్యవస్థ ఈ నాగరికతలోనే అభివృద్ధి చెందింది.
మీ చేతిని మీ ఎదురుగా తీసుకురండి. ఒక వేలిని వంచండి. ఆ వేలికున్న మూడు జాయింట్లు మీకు కనిపిస్తాయి. ఒక చేతికున్న అన్ని వేళ్లకున్న( బొటనవేలు తప్ప) జాయింట్లను లెక్కించండి. మీ లెక్క 12 దగ్గర ఆగిపోతుంది.
ఈ 12 అంకెల్ని మరో చేతికున్న వేళ్ల మీద లెక్కించండి. తిరిగి 12 జాయింట్లను మరో చేతి మీద లెక్కించండి. ఇలా రెండు చేతుల్లో ఐదు వేళ్లను లెక్కించండి. మొత్తం ఎన్ని వచ్చాయి? 60.
సుమేరియన్ల గణాంక విధానంలో 10కి బదులు 60 ఆధారంగా ఎందుకు రూపొందించుకున్నారనే దానిపై ఉన్న ఊహాజనిత సిద్ధాంతాలలో ఇదొకటి.
ఈ నిర్ణయం ప్రస్తుత మనం కాలాన్ని గణించే విధానంపై ఉన్న ప్రభావాన్ని చూపుతోంది.
పెరుగుతున్న తమ నగరాలకు అవసరమైన ఆహార సరఫరా కోసం భారీ స్థాయిలో చేస్తున్న వ్యవసాయానికి సంబంధించిన రికార్డుల నిర్వహణ కోసం సుమేరియన్లు అంకెలను అభివృద్ధి చేశారని క్యూనిఫాం( ప్రాచీన మధ్య ప్రాచ్యపు లిపి వ్యవస్థలు) సంస్కృతుల నిపుణుడు మార్టిన్ విల్లిస్ మన్రో చెప్పారు.
వారు సంఖ్యలను నమోదు చేయడానికి ఇప్పటి స్మార్ట్ ఫోన్ సైజు లేదా అంతకంటే చిన్నగా ఉండే మట్టి పలకలు ఉపయోగించడం మొదలుపెట్టారు.
మెత్తటి బంక మట్టి మీద వివరాలను ముద్రించేవారు. తర్వాతి కాలంలో బొమ్మలు వేయడం మొదలైంది. ఇది సుమేరియన్ల లిపిగా అభివృద్ధి చెందింది.
19వ శతాబ్ధం మధ్య కాలంలో ఈ మట్టి పలకలను కనుక్కున్న తర్వాత సుమేరియన్ల నాగరికతను అర్థం చేసుకున్నారు.
సుమేరియన్లు అన్ని రకాల గణిత విధానాలను అనుసరించినట్లు అవి చూపిస్తున్నాయని మన్రో చెప్పారు.
గణిత శాస్త్రానికి దాని ద్వారా ఖగోళ శాస్త్రానికి, సమయగణనకు, 60ని ఉపయోగించే షష్ట్యంశమాన వ్యవస్థల లాంటివి ఇందులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, BBC/willismonroe
సుమేరియన్లతో మొదలు
మనమిపుడు 10ని ఎలా ఉపయోగిస్తున్నామో, సుమేరియన్లు 60ని అలాగే ఉపయోగించారు. మనం 9కి చేరుకున్న తర్వాత ఎడమవైపున ఒక స్పేస్ ఇచ్చి ఒకటి రాసి దానికి కుడివైపున సున్నా చేరుస్తామని అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో హిస్టరీ ఆఫ్ ది ఎగ్జాట్ సైన్సెస్‌లో డాక్టరేట్ చేసిన ఎరికా మెస్జారోస్ చెప్పారు.
"60లతో గణించేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. 59కి చేరుకున్న తర్వాత 59 కంటే ఎక్కువ సంఖ్యను ఉపయోగించడానికి బదులు దాని తర్వాత ఒకటి ఉపయోగిస్తారు" అని ఆమె వివరించారు.
వేళ్లతో లెక్కించే విధానం ఉన్నప్పటికీ, సుమేరియన్లు 60 ఆధారంగా గణన వ్యవస్థను ఎందుకు ఎంచుకున్నారనే దానిపై స్పష్టత లేదు.
"అసలు 60 ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పడానికి పెద్దగా ఆధారాలు లేవు" అని మన్రో చెప్పారు.
60తో గణించే విధానం సుమేరియన్ల కంటే ముందే ఉండి ఉండవచ్చనేది కొంతమంది స్కాలర్ల అభిప్రాయ.
ఏదేమైనప్పటికీ, దీని ఉపయోగం చాలా తేలిక. 60ని భిన్నాలు, దశాంశాలతో పని లేకుండా ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, పది, పన్నెండు, పదిహేను, ఇరవై, ముప్పై, అరవైతో భాగించవచ్చు.
దీనికి భిన్నంగా ఒకటి, రెండు, ఐదు, పదితో మాత్రమే భాగించగలిగే వీలున్న 10ని చూస్తే 60తో గణన ప్రయోజనాలు ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, The Board of Trustees of the Science Museum, London
సమయం పుట్టుక
సుమేరియన్లు సమయం ఉపయోగించారని చెప్పేందుకు స్పష్టమైన ఆధారం లేదు. అయితే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరం ప్రాంతంలో బాబిలోనియన్లు సూర్యుడు, నీటి ఆధారంగా రూపొందించిన గడియారాలను ఉపయోగించినట్లు చరిత్ర పుస్తకాల్లో నమోదైంది. అయితే దీనికి ముందే ఆ ప్రాంతంలో కాలాన్ని లెక్కించే విధానం ఉండి ఉండవచ్చని మన్రో చెప్పారు.
రోజును గంటలుగా విభజించిన తొలి నాగరికత ఈజిప్షియన్లదేనని స్విట్జర్లాండ్‌లోని బాసెల్ యూనివర్సిటీలో ఖగోళశాస్త్రవేత్త రీటా గౌట్చీ చెబుతున్నారు.
క్రీస్తు పూర్వం 2500 నాటి మత గ్రంథాలలో ఇది కనిపిస్తుంది. గంటలకు సంబంధించి చారిత్రకంగా ఉన్న ప్రస్తావనలలో మొదట 12 గంటలే ఉన్నట్లు చెబుతున్నాయి.
ఇవి క్రీస్తు పూర్వం 2100 నుంచి 1800 మధ్య ఈజిప్షియన్ ఉన్నత వర్గీయుల శవపేటికల లోపలి మూతల్లో గుర్తించిన నక్షత్ర ఆధారిత గడియారాలని గౌట్చీ చెప్పారు.
ఈజిప్షియన్లు రోజును 12 గంటలకుగా ఎందుకు విభజించారనే దానిపై స్పష్టత లేనప్పటికీ, ఇది తర్వాతి కాలంలో రోజును 24 గంటలుగా గుర్తించడానికి దారి తీసింది.
ఈజిప్షియన్లకు 12 నక్షత్ర రాశుల రాశిచక్రం ఉండేది. అయితే ఇది 12 గంటల సమయ గణన తర్వాత అమల్లోకి వచ్చి ఉండవచ్చు.
ఒకచేతి వేళ్లకుండే జాయింట్లను 12గా లెక్కించడం వల్ల కూడా 12 గంటలు అనే దానికి ప్రామాణికం కావచ్చనేది మరో థియరీ.
కొన్ని నక్షత్రాలు కనిపించే విధానం ఆధారంగా పదిరోజుల వారాన్ని నిర్ణయించుకున్నట్లే రోజుకు 12 గంటలు అనేది వచ్చి ఉండవచ్చని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, BBC/ Getty image
‘టైమ్ కంటే ఆచారాలకే ప్రాధాన్యం’
సమయాన్ని కొలవడంతో తొలి పరికరాలుగా గుర్తింపు పొందిన సన్ డయల్, వాటర్ క్లాక్స్ లాంటివి క్రీస్తుపూర్వం 1500 కాలంలో ఈజిప్టులో వెలుగులోకి వచ్చాయి.
అయితే వాటిలో కొన్నింటిని రోజువారీ అవసరాల గణన కోసం ఉపయోగించినప్పటికీ, ఎక్కువ భాగం మతపరమైన అంశాలు, ఆచార వ్యవహారాలకు ఉపయోగించారు" అని గౌట్చీ చెప్పారు.
"వ్యక్తిగతంగా, అందులో చాలావరకు భగవంతుడికి సమర్పించిన కానుకలు, మొక్కుగా ఇచ్చిన బహుమతులనేది నా అభిప్రాయం. ఆ కాలం నాటి శాస్త్రీయ కాల గణన గురించి మన దగ్గర పెద్దగా సమాచారం లేదు" అని ఆమె వివరించారు.
మొదట్లో రోజువారీ జీవితం గురించిన రచనల్లో పని చేసే సమయం చాలా చిన్నదిగా పేర్కొన్నారని అది ఉదయం లేదా మధ్యాహ్నం లేదా సాయంత్రం కావచ్చని గౌట్చీ చెప్పారు.
అయితే ప్రాచీన రోమన్ల కాలంలో ( క్రీ.పూ 30) గంటలు ప్రామాణికంగా ఉన్నాయని, అరగంటలు కూడా వచ్చాయని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Cheng Xin/Getty Images
నిముషాలు ఎలా వచ్చాయి?
బాబిలోయన్లు కూడా గంటల వినియోగాన్ని మెరుగు పరుస్తూ వచ్చారు. గంటను చిన్న చిన్న విభాగాలుగా విభజించిన వారిగా గుర్తింపు పొందారు. అయితే వాళ్లిలా చేసింది కాలాన్ని లెక్కించేందుకు కాదు.
క్రీస్తుపూర్వం 2000 నుంచి 540 వరకు ఉన్న మెసపుటోమియా నాగరితక( బాబిలోనియన్లది) అంతకు ముందున్న సుమేరియన్ల నుంచి క్యూనిఫామ్ లిపిని, 60తో గణించే సంఖ్యల వ్యవస్థను స్వీకరించింది.
ఆకాశంలో సూర్యుడు ఒకచోట నుంచి బయల్దేరి తిరిగి అదే ప్రాంతానికి రావడానికి పట్టే సమయం ఆధారంగా క్రీస్తుపూర్వం 1000 నాటికి వారొక క్యాలెండర్ రూపొందించారు. అందులో ఏడాదికి 365 కంటే ఎక్కువ రోజులు ఉన్నాయని మెస్జారోస్ చెప్పారు.
"వాస్తవానికి ఇది 12 నెలలు, 30 రోజులకు దారి తీసింది. చంద్రుడి భ్రమణానికి కూడా సరిగ్గా సరిపోయింది" అని మెస్జారోస్ చెప్పారు.
ఈజిప్షియన్ల మాదిరిగానే బాబిలోనియన్లు కూడా రోజువారీ అవసరాల కోసం రాత్రి12 గంటలు, పగలు 12 గంటలుగా విభజించే ఆచరణాత్మక సమయ విధానాన్ని అమలు చేశారు.
రేయింబవళ్లకు సంబంధించిన 12 గంటల నిడివి రుతువుల్నిబట్టి మారుతూ ఉండేది.
ప్రాచీన నాగరికతల్లో అనేకం రుతువులనుబట్టి గంటలను లెక్కించే విధాన్ని ఉపయోగించాయి. 15వ శతాబ్ధంలో యూరప్, 19వ శతాబ్ధంలో జపాన్‌లో ఇదే విధానాన్ని కొనసాగించాయి.
రోజువారీ అవసరాల కోసం కాకుండా, ఖగోళ పరిణామాలను లెక్కించేందుకు బాబిలోనియన్లు మరో టైమ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు.
ఇది రోజును 12 'బెరు'లుగా విభజిస్తుంది. వీటిని అధునిక గంటలుగా భావించవచ్చు. బాబిలోనియన్ల తర్వాత వాటిని ప్రాచీన చైనా, జపాన్ కూడా ఉపయోగించాయి.

ఫొటో సోర్స్, BBC/ Ercia Meszaros
బాబిలోనియన్ల కొత్త గడియారం
బాబిలోనియన్లు కాలాన్ని మరింత సూక్ష్మ స్థాయిలో కొలిచేందుకు రెండు 'బెరు'లను 'ఉష్' అని పిలిచే 30 నిముషాలుగా విభజించారు. ఈ 30 నిముషాల్లో ఒక్కొక్కటి ప్రస్తుతం 4 నిముషాలకు సమానం.
తర్వాత వాటిని 60 చిన్న విభాగాలుగా మార్చి 'నిండా' అని పిలిచేవారు. ఇవి ఆధునిక నాలుగు సెకన్లకు సమానం.
అయితే బాబిలోనియన్లు కాలాన్ని కొలిచేందుకు ఇలాంటి విభజన చేయలేదు. ఆకాశంలో దూరాన్ని, గ్రహల వేగాన్ని కొలిచేందుకు కాలాన్ని ఇలా విభజించారని మన్రో పేర్కొన్నారు.
ప్రాచీన నాగరికతల్లో కాలక్రమేణా జరిగిన ఈ మార్పులు దేని ఆధారంగా ఎవరు చేశారో చెప్పడం కష్టమని గౌట్చీ చెప్పారు.
"క్రీస్తుపూర్వం 330 నుంచి ఈజిప్టులోని అలెగ్జాండ్రియా సైన్స్‌కు కేంద్రంగా మారింది. ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు, వారి ఆలోచనలు కలిసి పని చేశాయి. అందుకే దాన్ని మనం గ్రీకుల ప్రపంచంగా పిలుస్తాం" అని గౌట్చీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సెకన్లను లెక్కించడం
"న్యాయస్థానంలో ప్రజలు వారికి కేటాయించిన నిర్ణీత సమయం మాట్లాడేందుకు వీలుగా గ్రీకులు ఇసుక గడియారాలను ఉపయోగిస్తే, బాబిలోనియన్ల కాలమానాన్ని జ్యోతిష్యులు మాత్రమే ఉపయోగించారు. దానికి ప్రజల దైనందిన జీవితంతో పెద్దగా సంబంధం లేదు" అని గౌట్చీ చెప్పారు.
హెలెనిస్టిక్ సంస్కృతుల నుంచి వచ్చిన గంటలు, నిముషాలు, సెకన్లు శతాబ్దాలుగా కొనసాగుతూ నేటి వరకు వచ్చాయి. అయితే సమయాన్ని గణించడం ప్రారంభమైన తర్వాత నిముషాలు, సెకన్లలను రోజువారీగా ఉపయోగించేందుకు అవసరమైన గడియారాలు రావడానికి చాలా కాలం పట్టింది.
సెకనును ఇప్పుడు లెక్కలేనన్ని శాస్త్రీయ నిర్వచనాలతో ఉపయోగిస్తున్నారు. సెకను కంటే తక్కువ టైమ్‌ను లెక్కించడం మొదలుపెట్టాక శాస్త్రవేత్తలు మెట్రిక్ సిస్టమ్ వైపు మళ్లారు. సెకనును మిల్లీ, మైక్రో సెకనుగా విభజించారు.
20వ శతాబ్దంలో అటామిక్ క్లాక్స్ సాయంతో సెకనుని మరింత కచ్చితంగా పునర్నిర్వించారు. ప్రపంచవ్యాపంగా వివిధ దేశాల్లో ఏర్పాటు చేసిన అటామిక్ క్లాక్స్ నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా సమయాన్ని నిర్దేశిస్తోంది. ఇంటర్నెట్ మొదలుకొని జీపీఎస్ వరకు, అత్యంత కచ్చితత్వాన్ని చూపించే ఎంఆర్ఐ ఇమేజింగ్ వరకు ప్రతీదాని వెనుక ఈ నెట్‌వర్క్ ఉంది.
కాలగణన చరిత్రను పరిశీలిస్తే ఇదంతా మానవ నిర్మితమని తెలుస్తుంది. గంటలు, నిముషాలు, సెకన్లు అనేవి యాదృచ్ఛిక సంఘటనలు, అనుకోని పరిణామాల వల్ల మన వద్దకు వచ్చాయి. అయితే అవి శతాబ్దాలుగా ఉపయోగకరమైన వారసత్వంగా మనతో ఉన్నాయి.
ఈ వ్యవస్థ ప్రాచీనకాలం నుంచి మనతో ఎంతలా ముడిపడిదంటే ఇప్పుడు దీన్ని మార్చడం బహుశా మనం భరించలేని అంశం కావచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































