ఏపీ: జీతాలు పెంచాలంటూ కార్మికుల సమ్మె, ఆంధ్ర పేపర్‌ మిల్లును మూసేసిన యాజమాన్యం

ఆంధ్ర పేపర్‌ మిల్లు, మేడే మూసివేత, కార్మికుల సమ్మె

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కార్మికులకు మద్దతుగా సీఐటీయూ ఆందోళన
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 3 నిమిషాలు

తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఆంధ్ర పేపర్‌ మిల్లును యాజమాన్యం లాకౌట్‌ చేసినట్లు కార్మికశాఖ సహాయ కమిషనర్‌ విజయ్‌ ప్రకాశ్ వెల్లడించారు.

మే 1వ తేదీ రాత్రి మూడో షిఫ్ట్‌ నుంచి మిల్లును మూసివేస్తున్నట్లు ఆంధ్ర పేపర్‌ లిమిటెడ్‌ యాజమాన్యం ప్రకటించిందని బీబీసీకి తెలిపారు విజయ్‌ ప్రకాశ్.

ప్రస్తుతం యాజమాన్య ప్రతినిధులతోనూ, కార్మిక సంఘాల నేతలతోనూ శనివారం ఉదయం నుంచి చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు.

మేడే నాడే పేపర్‌ మిల్లు లాకౌట్‌ చేశారంటే కార్మికులు, వారి కుటుంబాల పట్ల యాజమాన్య వైఖరి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని కార్మిక సంఘాలు విమర్శించాయి.

కాగా, కడియంలోని యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించగా, వారు అందుబాటులోకి రాలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర పేపర్‌ మిల్లు, మేడే మూసివేత, కార్మికుల సమ్మె

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కార్మికుల నిరసన దీక్షా శిబిరం

ఐదురోజులుగా సమ్మె

కడియంలోని ఆంధ్రపేపర్‌ మిల్లులో 800 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 450 మంది పర్మినెంట్‌ ఉద్యోగులు ఉన్నారని కోస్టల్‌ పేపర్స్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు అరుణ్‌ బీబీసీకి తెలిపారు.

కాంట్రాక్టు కార్మికులకు ఆరున్నరేళ్లుగా వేతనాలు పెంచలేదని ఆయన అన్నారు.

"నిబంధనల ప్రకారమే కాకుండా, గతంలో కార్మిక సంఘాలతో యాజమాన్యం చేసుకున్న ఒప్పందం ప్రకారం మూడున్నరేళ్ల కిందటే జీతాలు పెంచాలి. కానీ, పెరగలేదు. గత ఏడాది ఆగస్టు నుంచి చర్చల పేరిట యాజమాన్యం కార్మిక సంఘాల నేతలతో మాట్లాడుతూ వస్తోంది. కానీ, ఇటీవల తాము పెంచలేమని యాజమాన్యం చెప్పింది. దాంతో ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. పర్మినెంట్‌ వర్కర్లు మాత్రం పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టు కార్మికుల సమస్యల గురించి మేనేజ్‌మెంట్‌తో మాట్లాడేందుకు వెళ్లిన 12 మంది పర్మినెంట్‌ ఉద్యోగులైన యూనియన్ల లీడర్లను సస్పెండ్‌ చేశారు. పైగా మే 1వ తేదీ రాత్రి మూడో షిఫ్ట్‌ నుంచి లాకౌట్‌ చేశారు'' అని అరుణ్‌ వివరించారు.

పర్మినెంట్‌ ఉద్యోగులు ఎవరూ కూడా మిల్లుకు రావద్దంటూ యాజమాన్యం సందేశాలు పంపిందని, ఇంతకంటే దారుణం ఏముందని ఆయన అన్నారు.

ఆంధ్ర పేపర్‌ మిల్లు, మేడే మూసివేత, కార్మికుల సమ్మె

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కడియంలోని పేపర్‌ మిల్లు ఎదుట కార్మికుల నిరసన

మేడే రోజే మూసివేత

కాంట్రాక్టు కార్మికుల నాయకుడు లోవరాజు బీబీసీతో మాట్లాడుతూ, "ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే నాడు పేపర్‌ మిల్లు లాకౌట్‌ చేశారంటే కార్మికులు, వారి కుటుంబాల పట్ల యాజమాన్య వైఖరి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాంట్రాక్టు కార్మికులకు నెలకు 12,500 వేతనం వస్తోంది. 2020 నుంచే 18 వేల వరకు వేతనం పెరగాలి. ఆ డిమాండ్‌ సాధన కోసం ఆందోళన బాట పడితే పర్మినెంట్‌ ఉద్యోగులను కూడా తొలగించి, లాకౌట్‌ చేయడం అన్యాయం" అన్నారు.

కాగా, కడియంలోని యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించగా, వారు అందుబాటులోకి రాలేదు. వారి వాదన రాగానే అప్‌డేట్ చేస్తాం.

ఆంధ్రాపేపర్‌ లిమిటెడ్‌కి దేశవ్యాప్తంగా ఆరు చోట్ల మిల్లులు ఉండగా, రిజిస్టర్డ్‌ కార్యాలయం రాజమహేంద్రవరంలో, కార్పొరేట్‌ కార్యాలయం కోల్‌కతాలో ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)