You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముడి చమురు ధరలు భారీగా తగ్గినా, పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?
- రచయిత, సందీప్ రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
చమురు ధరలు యుద్ధం ముందున్న స్థాయికి తిరిగి వచ్చాయి. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారి అయిన భారత్‌కు ఇది అతిపెద్ద ఆర్థిక ఉపశమనం కలిగిస్తుందని విశ్లేషకులు నమ్ముతున్నారు.
గురువారం గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారల్ 72.48 డాలర్ల దిగువకు పడిపోయింది. అమెరికా-ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడి చేయడానికి ఒక రోజు ముందు అంటే ఫిబ్రవరి 28న క్రూడ్ ఆయిల్ ధర ఈ స్థాయిలోనే ఉంది.. శుక్రవారం ఈ చమురు ధరలు మరింత పడిపోయాయి.
గత నాలుగు నెలల్లో అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీసుకున్న చర్యలతో ఇంధన ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి.
చమురు, గ్యాస్ సరఫరాలకు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది.
జూన్ 17న అమెరికా, ఇరాన్ మధ్య ఎంఓయూ కుదిరిన తర్వాత.. క్రూడాయిల్ ధరలు తగ్గడం ప్రారంభమయ్యాయి.
రాబోయే రోజుల్లో చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే, పరిస్థితిని మార్కెట్ పర్యవేక్షిస్తూనే ఉంటుందన్నారు.
ఇరాన్ యుద్ధ సమయంలో ఆయిల్ ధరలు ఒక్కో బ్యారల్ 120 డాలర్లకు ఎగిశాయి.
అయితే, ప్రస్తుతం ముడి చమురు ధరలు భారీగా పడిపోయినప్పటికీ, భారత్‌లో రిటైల్ ఇంధన రేట్లలో ఎటువంటి మార్పు లేదు.
అంతర్జాతీయంగా చమురు ధరలు ఇటీవల భారీగా పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ.7.50 వరకు పెరిగాయి. ధరలను స్థిరీకరించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని కూడా తగ్గించింది.
ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం, మూడు ప్రభుత్వ రంగ కంపెనీలు ప్రస్తుతం పెట్రోల్ అమ్మకాలపై మంచి మార్కెటింగ్ మార్జిన్లను సంపాదిస్తున్నాయని, డీజిల్ అమ్మకాలపై ఇంకా స్వల్ప నష్టం ఎదుర్కొంటున్నాయని అధికారులు చెప్పినట్టుగా తెలిపింది.
''ఇటీవల తగ్గిన క్రూడాయిల్ ధరల ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించడానికి ఇంకా కొంత సమయం పట్టొచ్చని పరిశ్రమల వర్గాలు చెప్పినట్లు'' ఈ కథనం పేర్కొంది.
భారత వినియోగదారులు ఏదైనా ఉపశమనం కోసం రెండు నుంచి రెండున్నర నెలల పాటు వేచిచూడాల్సి రావొచ్చని, అది కూడా మార్కెట్ మరింతగా స్థిరపడాలని, మార్కెట్ విశ్లేషకులు బీబీసీ న్యూస్‌తో చెప్పారు.
మంత్రుల కమిటీ సమావేశాలు ఏమయ్యాయి?
మధ్యప్రాచ్యంలో భారీ సైనిక సంఘర్షణ కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని పర్యవేక్షించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా వివిధ శాఖల మంత్రులతో అంతర్ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రతిరోజూ ఏ రోజు పరిణామాలను ఆరోజు మీడియాకు వివరించేది.
''ఇంధన మార్కెట్‌లో ఇటీవల ఉద్రిక్తతలు తగ్గిన ప్రభావం భారత ప్రభుత్వ స్పందనలో కూడా ప్రతిబింబించింది. ఈ సంక్షోభం మొదలైనప్పుడు ఏర్పాటైన అంతర్ మంత్రిత్వ కమిటీ ఇచ్చే మీడియా సమాచారాన్ని కొంతకాలం పాటు నిలిపివేశారు. ఇది ఇంధన సరఫరాల్లో తక్షణమే నెలకొన్న అంతరాయాల గురించి ఆందోళనలు తగ్గాయని సూచిస్తుంది'' అని మనీ కంట్రోల్ వెబ్‌సైట్‌లోని నివేదిక పేర్కొంది.
''తొలుత ఈ సమావేశాలు రోజూ ఉండేవి. ఆ తర్వాత వారానికి రెండుసార్లకు తగ్గించారు. కీలక మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు ఈ సమావేశాలకు హాజరయ్యేవారు. ప్రభుత్వ సంసిద్ధత, సంక్షోభ నిర్వహణ సామర్థ్యం గురించి కమిటీ ముందు చర్చించేవారు'' అని తెలిపింది.
"పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారులు ఈ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యారు. ఇంధన సరఫరాను సురక్షితంగా ఉంచడానికి, మార్కెట్లో స్థిరత్వాన్ని నిర్వహించడానికి తీసుకున్న చర్యల గురించి తెలియజేసేవారు. ఈ వారం షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సోమ, గురువారాలనాటి సమావేశాలు లేవు" అని మనీ కంట్రోల్ పేర్కొంది.
భారత్‌కు ఉపశమనం
ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం.. ఫిబ్రవరి 27న భారత్ కొనుగోలు చేసిన ముడి చమురు సగటు ధర బ్యారల్‌కు 71.17 డాలర్లుగా ఉంది.
ఆ తర్వాత అంటే ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌పై దాడి చేశాయి.
చమురు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) డేటా ప్రకారం.. జూన్ 24న ఇండియన్ బాస్కెట్ సగటు ధర బ్యారల్ 70.71 డాలర్లు పలికింది.
పీపీఏసీ ప్రకారం... ఫిబ్రవరి 2026లోని సగటు ధర ఒక బ్యారల్ 72.47 డాలర్లతో పోలిస్తే... జూన్ మొత్తం కాలానికి గానూ ఇండియన్ బాస్కెట్ సగటు ధర బ్యారల్‌కు 86.31 డాలర్లుగా ఉంది.
భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు సగటు అంతర్జాతీయ ధరనే ఇండియన్ బాస్కెట్ అంటారు.
ఇండియన్ బాస్కెట్ ధర చాలా ఎక్కువగా ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) డైరెక్టర్ అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.
''ముడి చమురు దిగుమతిదారుగా భారత్ మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్ కంటే తక్కువ ధరకు భారత్‌కు చమురులభించాలి. ఈ బాస్కెట్ ధర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం వ్యూహాన్ని రూపొందించాలి'' అని ఆయన అన్నారు.
ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం తర్వాత ఇరాన్ చమురుపై ఉన్న నిషేధాన్ని అమెరికా 60 రోజుల పాటు ఎత్తివేసింది. ఇప్పుడు ఇరాన్ చమురు ఇండియన్ బాస్కెట్‌లో చేరే అవకాశం పెరిగిందని కొందరు విశ్లేషకులు అన్నారు.
అటువంటి పరిస్థితిలో, ముఖ్యంగా ముడి చమురు ధరలు చాలా కాలం తక్కువగా ఉన్నప్పుడు వినియోగదారులకు ఉపశమనం కల్పించాలని ఇంధన కంపెనీలపై, ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండొచ్చు.
ఇంధన ధరలు తక్కువగా ఉండటం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను మరింత తగ్గిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌కు చమురు బిల్లులు తగ్గుతాయి. కరెంట్ ఖాతా లోటు కూడా తగ్గుతుంది.
హార్ముజ్ జలసంధి తెరవడంతో అంతర్జాతీయంగా ధరలు తగ్గాయి. గత 24 గంటల్లో హార్ముజ్ జలసంధి గుండా సుమారు 20 లక్షల బ్యారళ్ల చమురు తరలి వెళ్లిందని అమెరికా అధికారులు చెప్పారు. పరిస్థితి మరింత మెరుగుపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సముద్ర రవాణా కదలికలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ కెప్లర్ అంచనాల ప్రకారం.. జూన్ 25న హార్ముజ్ జలసంధి గుండా మొత్తం 54 ధ్రువీకరించిన వాణిజ్య, ఇంధన నౌకల రాకపోకలు సాగించాయి.
అనేక నౌకలు 'డార్క్', లేదా 'అన్‌నౌన్' కేటగిరీలో వాటి రాకపోకలను సాగిస్తున్నాయి.
అదే సమయంలో.. ఒమన్‌లోని దహిత్ పోర్టుకు ఆగ్నేయంగా ఒక నౌకపై గుర్తు తెలియని పేలుడు పదార్ధంతో దాడి జరగడంతో.. ప్రమాదం మళ్లీ పెరిగింది.
నిపుణులు ఏం చెబుతున్నారు?
అంతర్జాతీయ ముడి చమురు ధరల తగ్గింపు భారతీయ వినియోగదారులకు వెంటనే ప్రయోజనం చేకూర్చదని నిపుణులు భావిస్తున్నారు.
అయినప్పటికీ, ఇది ఇంధన సబ్సిడీల భారాన్ని తగ్గిస్తుంది. ప్రభుత్వ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.
సెప్టెంబర్ ముందు వరకు దేశీయ వినియోగదారులకు ఇంధన ధరలు తగ్గే అవకాశం లేదని అంతర్జాతీయ చమురు మార్కెట్ నిపుణుడు నరేంద్ర తనేజా బీబీసీతో అన్నారు.
ప్రస్తుత ధరల ఆధారంగా, కొనుగోలు చేసిన ఇంధనం భారత్‌కు చేరడానికి ఒక వారం నుంచి రెండు నెలల సమయం పట్టవచ్చు. ఎందుకంటే, ఇప్పుడు అధిక ధరలకు కొనుగోలు చేసిన చమురు వస్తోంది.
ప్రస్తుతం భారత్ 40 దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. అమెరికా, మెక్సికో, బ్రెజిల్ నుంచి భారత్‌కు చమురు రావడానికి రెండు నెలలు, రష్యా నుంచి ఒక నెల సమయం పడుతుంది.
వాస్తవానికి భారత్ తన మొత్తం క్రూడాయిల్ అవసరాల్లో 88 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటోంది. పీఐబీ డేటా ప్రకారం.. భారత్ చమురు దిగుమతులలో సగం అంతకుముందు హార్ముజ్ జలసంధి గుండా వచ్చేది. కానీ, యుద్ధం తర్వాత ఇప్పుడు అది 30 శాతానికి తగ్గింది. ఇది కూడా ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురు భారత వినియోగదారులకు చేరుకునే సరికి సుమారు రెండున్నర నెలలు పడుతుందని నరేంద్ర తనేజా చెప్పారు. అంతకుముందు, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి చమురు వచ్చినప్పుడు, భారత్‌కు చేరుకునే సమయం తక్కువగానే ఉండేది.
''ఇవాళ పెట్రోల్ బంకులలో లభించే చమురును రెండున్నర నెలల క్రితం బ్యారెల్‌కు 110 డాలర్ల నుంచి 130 డాలర్ల చొప్పున భారతీయ కంపెనీలు కొనుగోలు చేశాయి'' అని చెప్పారు.
"నా అభిప్రాయం ప్రకారం, సెప్టెంబర్ నాటికి చౌకైన చమురు అందుబాటులోకి వస్తుంది. అప్పటికి కంపెనీలు తమ నష్టాలను కొంతవరకు భర్తీ చేసి ఉంటాయి. ఆ సమయంలో తీజ్ పండుగ సీజన్ కూడా ప్రారంభమై ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం ఇంధన ధరలలో కొంత ఉపశమనం లభిస్తుంది" అని ఆయన అన్నారు.
కానీ, ఇరాన్-అమెరికా మధ్య ప్రతిదీ చక్కగా జరుగుతుందనే ఊహపై ఈ అంచనా ఆధారపడి ఉందని ఆయన హెచ్చరించారు. అయితే, ఈ రెండు దేశాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈలోగా ధరలు పెరగవచ్చని కూడా చెప్పారు.
చాలామంది విశ్లేషకుల మాదిరిగానే.. ఇరాన్ యుద్ధం నుంచి బయటపడాలని అమెరికా కోరుకుంటున్నందున పరిస్థితి సాధారణంగా ఉందని నరేంద్ర తనేజా కూడా భావిస్తున్నారు. అమెరికాలో దేశీయ చమురు ధరలు 70 శాతం పెరగడం దీనికి అతిపెద్ద కారణమని నరేంద్ర తనేజా అభిప్రాయపడ్డారు.
''యుద్ధం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. ఈ యుద్ధం నుంచి బయపడటానికి మార్గం లేదు. ఇలాంటి పరిస్థితిలో, అంతర్జాతీయ చమురు మార్కెట్లో స్థిరత్వాన్ని ఆశించాలి'' అన్నారు.
'భారత్‌లో పారదర్శకత లోపం'
అంతర్జాతీయంగా ముడి చమురు ధరల తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాన్ని భారత వినియోగదారులకు అందించడంపై సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతోంది.
''గత మూడు నెలల్లో క్రూడాయిల్ ఫ్యూచర్స్ సుమారు 15 శాతం తగ్గాయి. కానీ, భారత్‌లో ఇంధన ధరలు ఆ స్థాయిలో తగ్గలేదు'' అని రెడిట్‌లో ఒక యూజర్ ప్రశ్నించారు.
''ఇదే సమయంలో కొన్ని దేశాలు ఇంధన ధరలు తగ్గించినట్లు ప్రకటించాయి. చమురు ధరలు పెరిగినప్పుడు, దేశీయ ధరలు కూడా భారీగా పెరుగుతాయి, కానీ చమురు ధరలు పడిపోయినప్పుడు, వినియోగదారులకు ఎందుకు ప్రయోజనం లభించడం లేదు?'' అనే ప్రశ్న ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
''ముడి చమురు ధరకు, బంకుల వద్ద చమురు ధరలకు ఎటువంటి సంబంధం లేదు. క్రూడ్ ధర బ్యారెల్‌కు 30 డాలర్లు ఉన్నప్పుడు కూడా.. దేశీయంగా లీటరుకు రూ.90-100 వరకు చాలాసార్లు వసూలు చేశారు. ధరలు స్థిరీకరించే వరకు పరిస్థితిపై నిఘా ఉంచాలని ప్రభుత్వం కూడా చెప్పవచ్చు'' అని జీటీఆర్ఐ డైరెక్టర్ అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో 'అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఫారిన్ ట్రేడ్' పోస్టును ఆయన నిర్వహించారు.
''ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు.. ప్రభుత్వం పన్నులు పెంచుతుంది. నేడు, ప్రభుత్వం పారదర్శక వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉంది. బాస్కెట్ ధరతో పోలిస్తే పెట్రోల్ బంకుల్లో లభించే చమురులో ఎంత శాతం రిఫైనింగ్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు లభిస్తుంది, అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పన్నుల శాతం ఎంత ఉందో స్పష్టంగా చెప్పాలి'' అన్నారు.
''2010 ఏడాదిలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చమురు ధరల నియంత్రణ విధానాన్ని రద్దు చేయడం ద్వారా చమురు ధరలపై నియంత్రణను ఎత్తివేసింది. ఈ వ్యవస్థ 2016-17 వరకు ఉండేది. కానీ, ఆ తర్వాత పన్నులను పెంచడం ద్వారా చమురు ధరలను ప్రభుత్వాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి'' అని చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరలను తగ్గించడం గురించి మాట్లాడిన అజయ్ శ్రీవాస్తవ.. ''ధరలు తగ్గుతాయో లేదో చెప్పలేం. అంతా ప్రభుత్వ చేతుల్లోనే ఉంది. దానిలో పారదర్శకత లేదు" అని తెలిపారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)