You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వెనెజ్వెలాలో భారీ భూకంపం, వేల మంది చనిపోయి ఉండొచ్చని యూఎస్‌జీఎస్ అంచనా
వెనెజ్వెలా రాజధాని కారకస్‌లో భారీ భూకంపం సంభవించింది. సెకన్ల వ్యవధిలోనే రెండుసార్లు భారీ భూప్రకంపనలు వచ్చాయి. మొదటిసారి ప్రకంపనలు 7.2 తీవ్రతతో రాగా, రెండోసారి 7.5గా నమోదైంది.
భూకంపం కారణంగా భవనాలు కూలిపోయాయి. ప్రజలు ఇళ్లను వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు. ఇళ్లు ఖాళీ చేసి బయటకు వచ్చేయాలని ఆ దేశ హోం మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
భారీ ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించే అవకాశముందన్న భయాందోళనలు నెలకొన్నాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, మృతుల సంఖ్య 10,000 దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
వెనెజ్వెలాలో జాతీయ సెలవుదినం కావడంతో ఎక్కువ మంది ఇళ్లలోనే ఉండే అవకాశముంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:04 గంటలకు ఈ భూకంపం సంభవించింది.
భూకంపం తర్వాతి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కారకస్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ధ్వంసమైన ప్రాంతాల వైపు వెళ్లొద్దని, పాడైపోయిన భవనాల్లోకి వెళ్లొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
వీధుల్లోకి పరుగులు తీసిన జనం
తొలుత 7.2 తీవ్రతతో సంభవించిన భూకంప కేంద్రం రాజధాని కారకస్‌కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని కారాబోబో రాష్ట్రంలో కేంద్రీకృతమైంది.
అనంతరం, కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరోసారి తీవ్రమైన ప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఈ భూకంపం కారణంగా ఏ స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగాయనే వివరాలు తెలియాల్సి ఉంది.
మరణాలు సంఖ్యను అంచనా వేసిన యూఎస్ జియోలాజికల్ సర్వే.. 10 వేల మంది మరణించడానికి 44 శాతానికి పైగా అవకాశముందని తెలిపింది. రెండోసారి సంభవించిన తీవ్రత దృష్ట్యా మరణాల సంఖ్య లక్షదాటే అవకాశం 30 శాతం ఉందని అంచనా వేసింది.
రాజధాని కారకస్‌లో భవనాలు ధ్వంసమయ్యాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. జనాలు శిథిలాల కింద చిక్కుకుపోయి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కొన్ని వీడియోల్లో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
పొరుగుదేశం కొలంబియా వరకూ ప్రకంపనలు
ప్రజలు ఇళ్లు విడిచిపెట్టి వెళ్లాలని వెనెజ్వెలా హోం మంత్రి డియోస్‌డాడో కాబెల్లో విజ్ఞప్తి చేసినట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా చాలా భవానాలకు గ్యాస్ సరఫరా నిలిపివేశామని హోంమంత్రి కాబెల్లో తెలిపారు.
‘‘కొన్ని భవనాలు, నిర్మాణాలు దెబ్బతిన్నాయి. గ్యాస్‌కు సంబంధించి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అని చెప్పారు.
వెనెజ్వెలాలోని అనేక రాష్ట్రాలపై భూకంపం ప్రభావం ఉందని కాబెల్లో ప్రభుత్వ టీవీతో చెప్పారు.
''ఏడుకన్నా చాలా ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అన్ని సూచనలూ కనిపిస్తున్నాయి'' అని వీటీవీతో ఫోన్‌లో చెప్పారు.
ట్రుజిల్లో, యరకుయ్, కారాబోబో, అరాగ్వా, మిరాండా, కారకస్, లా గైరాపై భూకంప ప్రభావం తీవ్రంగా ఉందన్నారు.
రాజధాని కారకస్‌లోని పాలోస్ గ్రాండెస్, ఆల్టామిరా ప్రాంతాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు.
వెనెజ్వెలా భూ ప్రకంపనల ప్రభావం పొరుగదేశం కొలంబియా వరకూ కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
భూకంపం సంభవించిన వెంటనే వెనెజ్వెలాకు సునామీ హెచ్చరిక చేశారు. తర్వాత దాన్ని ఎత్తివేశారు.
భూకంప కేంద్రం ఆగ్నేయ యుమారేకు 23 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉంది.
‘1967 భూకంపం కన్నా తీవ్రమైనది’
''మా భవనంలో చాలా గోడలు ధ్వంసమయ్యాయి. చాలా గోడలు బీటలు వారాయి'' అని ఓ ప్రత్యక్షసాక్షి రాయిటర్స్‌తో చెప్పారు.
చాలా పెద్ద శబ్దం వచ్చిందని మరో ప్రత్యక్ష సాక్షి కోరో మార్టినెజ్ చెప్పారు. తూర్పు కారకస్‌లో ఆయన నివసిస్తున్నారు.
''ఇంట్లో వస్తువులన్నీ పడిపోయాయి. ఫ్రిజ్‌లో వస్తువులు పడిపోయాయి. ఇలాంటిది నా జీవితంలో చూడలేదు'' అని 56 ఏళ్ల వ్యక్తి చెప్పారు.
మరియా రొమెరా అనే మరో పెన్షనర్ 1967 నాటి విపత్తుతో దీన్ని పోల్చారు. కారకస్‌లో సంభవించిన ఆ ప్రకృతి విపత్తు కంటే ఇది మరింత తీవ్రమైనదన్నారు.
వెనెజ్వెలాను భారీ భూకంపం వణికించడం ఇదే మొదటిసారి కాదు.
1967లో 6.6 తీవ్రతతో కారకస్‌లో సంభవించిన భూకంపంతో 200 మందికిపైగా ప్రజలు చనిపోయారు. మధ్యతరగతి ప్రజలు నివసించే పాలోస్ గ్రాండెస్, ఎగువ మధ్యతరగతి ప్రజలు నివసించే అల్టామిరాలో అప్పుడు భవనాలు ధ్వంసమయ్యాయి.
ఇప్పటిలానే 1967లో కూడా రెండు భూకంపాలు సంభవించాయి.
ఇలాంటి భూకంపాన్ని జీవితంలో చూడలేదు: బీబీసీ జర్నలిస్ట్
ఇలాంటి భూకంపాన్ని తన జీవితంలో చూడలేదని జర్నలిస్ట్, బీబీసీ ముండో కంట్రిబ్యూటర్ నికోల్ కొల్‌స్టెర్ చెప్పారు.
భూకంపం మొదలైనప్పుడు ఆమె పాలోస్ గ్రాండెస్ అపార్ట్‌మెంట్ భవనంలో ఏడో అంతస్తులో ఉన్నారు.
''కిటికీలు కదలడం చూశాను. ఆ సమయంలో నన్ను నేను రక్షించుకోవాలంటే ముందు తలుపుకి, రాతి గోడకి మధ్య నిలబడాలన్నది నాకొచ్చిన ఒకే ఒక్క ఆలోచన. నా అంచనా ప్రకారం ఆ గోడ చాలా బలంగా ఉంది'' అని కోల్‌స్టర్ అన్నారు.
కాసేపు అక్కడ ఉన్న ఆమె, అందరూ బయటకు వచ్చేయండి అంటూ పొరుగువారి కేకలు విన్నారు.
భవనం తన మీద పడిపోతుందేమోనని అనిపించిందని ఆమె అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)