ఇరాన్ డీల్‌‌ను అమెరికా ఓటమిగా చైనా గెలుపుగా నిపుణులు ఎందుకు చెబుతున్నారు?

    • రచయిత, బీబీసీ మానిటరింగ్
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని శాశ్వత శాంతి స్థాపనకు ముందడుగుగా భావించకూడదని చైనాలోని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం, ఇజ్రాయెల్-హిజ్బొల్లా ఘర్షణ వంటి విషయాలపై ఆ ఇరు దేశాల మధ్య ఇంకా తీవ్రమైన విభేదాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

చైనా ''శాంతియుత విధానం'', ‘‘ఇంధన భద్రతా వ్యూహం’’ అంతర్జాతీయంగా అత్యున్నత గుర్తింపును పొందేలా చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇరాన్, అమెరికా సంఘర్షణ తైవాన్‌ విషయంలో అమెరికా సామర్థ్యాన్ని కూడా బలహీనపరిచిందని వారు అంటున్నారు.

అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్నిచైనా ప్రభుత్వం స్వాగతించినప్పటికీ.. తదుపరి చర్చల విషయంలో చైనా నిపుణులు మరింత అప్రమత్తతో ఉన్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో చైనానే విజేతగా అవతరిస్తుందని వారు భావిస్తున్నారు.

చర్చలు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం

జూన్ 15న చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో ప్రచురితమైన వ్యాసంలో .. అమెరికా-ఇరాన్ డీల్ విషయంలో ''అప్రమత్తతో కూడిన విధానాన్ని'' అనుసరించాలని చైనా నార్త్‌వెస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాంగ్ జిన్ సూచించారు.

హార్ముజ్ జలసంధి తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమం, లెబనాన్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు వంటి పలు విషయాల్లో ఇరు పక్షాల మధ్య చాలా విభేదాలు ఉన్నాయని తెలిపారు.

అందువల్ల ఈ ఒప్పందం తీవ్ర అనిశ్చితితో, అస్థిరతతో కూడుకుని ఉందని చెప్పారు.

తదుపరి చర్చల కోసం విధించిన 60 రోజుల గడువు చాలా తక్కువని ప్రముఖ వ్యాఖ్యాత చైర్మన్ రాబిట్ జూన్ 16న ప్రభుత్వ అనుబంధ వార్తా వేదిక గ్వాన్‌చాలో రాశారు.

అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీ కాలంలో 20 నెలల పాటు జరిగిన సంయుక్త సమ్రగ కార్యాచరణ ప్రణాళిక (జేసీపీఓఏ) తో దీన్ని పోల్చారు.

2015 నాటి ఇరాన్ న్యూక్లియర్ డీల్‌లో అమెరికా, పలు యూరప్ దేశాలు పాలుపంచుకున్నాయి.

ఈ ఒప్పందం కింద... ఇరాన్ తన అణుశుద్ధి కార్యక్రమంపై పరిమితులు విధించుకోవడానికి అంగీకరించడంతో , ఆ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలను కొంత సడలించాల్సి వచ్చింది.

అయితే, డోనల్డ్ ట్రంప్ 2018లో తన తొలి పదవీ కాలంలో ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తాజా చర్చలు ఎటూ తెగకుండా నిరవధికంగా కొనసాగవచ్చని, అమెరికా-ఇరాన్‌లు శాశ్వత శాంతి లేదా యుద్ధం లేని పరిస్థితిలో ఉండిపోయే ప్రమాదం ఉందని రాబిట్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమయంలో చర్చలు అసంపూర్తిగా మిగిలిపోతాయని, ఎలాంటి ఖచ్చితమైన ఫలితాలను సాధించవని పేర్కొన్నారు.

చైనా ఏం నేర్చుకుంది?

ఎంఓయూను ''చారిత్రాత్మక శాంతి'' అని పిలవడం పొరపాటు అవుతుందని జూన్ 16న నేషనలిస్ట్ కామెంటేటర్, ఫుడాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షెన్ యి చెప్పారు.

అణు కార్యక్రమం, అమెరికా ఆంక్షలు, ఇజ్రాయెల్-హిజ్బొల్లా వివాదం, అమెరికా-ఇరాన్‌ల మధ్య దీర్ఘకాలంగా ఉన్న అపనమ్మకం వంటి లోతుగా పాతుకుపోయిన సమస్యలను ఈ ఒప్పందం పరిష్కరించడం లేదని షెన్ యి అన్నారు.

ఈ ఒప్పందం ''వ్యూహాత్మక విజయాన్ని'' సాధించకపోయినప్పటికీ.. యుద్ధం, ఇంధన సరఫరాలతో భాగమైన ఒత్తిళ్ల నుంచి అమెరికా తాత్కాలికంగా బయటపడేందుకు సాయపడుతుందని చెప్పారు.

దీనిద్వారా సరికొత్తగా దౌత్య అవకాశాలను అన్వేషించే పరిమిత అవకాశం పొందుతుందన్నారు.

యుద్ధం తర్వాత ఇరాన్ అనేక సవాళ్లను ఎదుర్కోనుందని షెన్ యి భావిస్తున్నారు. వాటిలో పలు రాజకీయ, సామాజిక బృందాల మధ్య సమన్వయం నెలకొల్పడం, దేశీయ పాలనను బలోపేతం చేయడం వంటివి ఉన్నట్లు షెన్ యి అభిప్రాయపడ్డారు.

చైనా కోణం నుంచి చూస్తే.. సైనిక బలగాలతో పోలిస్తే దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారానే ఉత్తమమైన ఫలితాలను పొందగలమని ఈ సంక్షోభం నుంచి చైనా నేర్చుకుందని షెన్ యి చెప్పారు.

ప్రత్యేకమైన లేదా పరిమితమైన సైనిక కూటములపై ఆధారపడకుండా, ప్రాంతీయ భద్రత కోసం ఒక ఉమ్మడి వ్యవస్థను నిర్మించడంలో చైనా సానుకూల పాత్ర పోషించగలదని ఆయన అన్నారు.

"ఈ యుద్ధం చైనా శాంతియుత నమూనా సరైనదని మరోసారి నిరూపించింది" అని గ్లోబల్ టైమ్స్ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ హు క్సిజిన్ జూన్ 15న క్సినా వీబో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో రాశారు.

'తైవాన్ విషయంలో బలహీనపడ్డ అమెరికా'

ఇరాన్ యుద్ధం అమెరికా వనరులపై తీవ్రమైన భారాన్ని మోపింది. ఇదే సమయంలో చైనా తన స్థిరత్వాన్ని, శాంతియుత అభివృద్ధిని కొనసాగించిందని హు క్సిజిన్ అభిప్రాయపడ్డారు.

గత కొన్నేళ్లుగా చైనా అభివృద్ధిలో సరికొత్త స్థాయులను చేరుకుంటోందని, ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన సరఫరాగొలుసులను కలిగిన దేశంగా అవతరించిందని పేర్కొన్నారు. అంతేకాక, చాలా రంగాల్లో ప్రపంచ నాయకత్వ హోదాను సాధించిందని చెప్పారు.

ఇరాన్ యుద్ధంలో అమెరికా తీరు తైవాన్ జలసంధిలో మొత్తం శత్రువును అడ్డుకునే తన సామర్థ్యాన్ని గణనీయంగా బలహీనపర్చిందని హు క్సిజిన్ వ్యాఖ్యానించారు.

ఒక మధ్య స్థాయి దేశంతో జరిగే యుద్ధంలో అమెరికా నిర్ణయాత్మక విజయం సాధించడంలో విఫలమైతే, తైవాన్ విషయంలో చైనా వంటి ప్రధాన శక్తిపై ఉన్నత స్థాయి సైనిక జోక్యం చేసుకునే అవకాశాన్ని దాదాపుగా వదులుకున్నట్లేనని ఆయన అన్నారు.

బహిరంగంగా దీన్ని అంగీకరించకపోయినా.. అమెరికా వ్యూహాత్మక, మీడియా సర్కిళ్లలో ఈ విషయం మెల్లగా అంగీకారం పొందుతుందని హు క్సిజిన్ తెలిపారు.

అంతేకాక, చైనా ఇంధన భద్రతా వ్యూహాన్ని కూడా హు క్సిజిన్ కొనియాడారు.

పలు ఇంధన సరఫరాలు, పెద్ద మొత్తంలో వ్యూహాత్మక నిల్వలు, కొత్త ఇంధన సాంకేతికతల అభివృద్ధి, ఈవీల మార్కెట్‌ విస్తరణ, ఎలక్ట్రిసిటీపైనే ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడటం వంటివి చైనాకు ప్రత్యేక బలాన్ని చేకూర్చాయని వెల్లడించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ గ్రిడ్ చైనా ఆర్థిక వ్యవస్థకు "అద్భుతమైన స్థిరత్వాన్ని" ఇచ్చిందన్నారు. ఈ గ్రిడ్ ఎక్కువభాగం చమురుపై ఆధారపడకుండా.. స్వతంత్రంగా పనిచేస్తుంది. అందుకే చైనా ఆర్థిక బలం, స్థిరత్వం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని హు క్సిజిన్ తెలిపారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)