You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రజినీకాంత్: ముఖ్యమంత్రి విజయ్ అంటే అసూయా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు?
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్‌తో తనకు వైరం ఉందన్న వార్తలను తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఖండించారు.
విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే లక్ష్యంతో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య జరిగినట్లు చెబుతున్న చర్చలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయం గురించి జరుగుతున్న ప్రచారం పట్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని రజినీకాంత్ పేర్కొన్నారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో తన భేటీకి సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, తమ ఇద్దరి మధ్య స్నేహం రాజకీయాలకు అతీతమైనదని రజినీకాంత్ స్పష్టం చేశారు.
తమిళనాడు సీఎం కాకుండా విజయ్‌ను అడ్డుకునేందుకు రజినీకాంత్ ప్రయత్నించారన్న ప్రచారం నేపథ్యంలో రజినీకాంత్ తన పోయెస్ గార్డెన్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.
విజయ్‌కు, నాకూ వైరం లేేదు: రజినీకాంత్
‘‘ఈ ఎన్నికల నేపథ్యంలో, విజయ్‌కు, నాకు మధ్య ఉన్న సంబంధం గురించి అనేక ఊహాగానాలు చెలరేగాయి. అందుకే నేను ఈ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశా. నేను ఈ ఆరోపణలను ఖండించకపోతే, ప్రజలు అవే నిజమని భావించే అవకాశం ఉంది" అని రజినీకాంత్ వ్యాఖ్యానించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
‘‘ఎన్నికల ఫలితాల తర్వాత నేను స్టాలిన్‌ను కలవడానికి వెళ్లాను. అయితే, నేను అలా వెళ్లడాన్ని చాలామంది విమర్శించారు. వాస్తవానికి, స్టాలిన్ గత మూడు దశాబ్దాలుగా నాకు మిత్రుడు. ఆయన ఓటమి నన్ను బాధించింది. అందుకే, ఒక స్నేహితుడిగా ఆయన్ని కలిశాను" అని రజినీకాంత్ చెప్పారు.
‘‘కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు నన్ను మరింత కలచివేశాయి. విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు, ఆ రెండు రాజకీయ పార్టీలు (డీఎంకే, అన్నాడీఎంకే) సమావేశాలు నిర్వహిస్తున్నాయని, ఆ చర్చల్లో నేను కూడా పాలుపంచుకుంటున్నానని చెబుతూ వార్తలు రావడం మొదలయ్యాయి. నేను మీకు ఒక్క విషయం స్పష్టం చేయదలుచుకున్నా. రజినీకాంత్ అంతటి దిగజారుడు స్థాయికి దిగే వ్యక్తి కాదు" అని స్పష్టం చేశారు.
‘‘నన్ను విజయ్‌తో పోల్చడం కరెక్ట్ కాదు’’
తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకున్నప్పటికీ, విజయ్ పార్టీ మెజారిటీ మార్కును చేరుకోలేకపోయింది.
మెజారిటీ సంఖ్యను చేరుకునేందుకు విజయ్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలో, ఆ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరిగింది.
ఈ రెండు వర్గాల మధ్య జరిగినట్లు చెబుతున్న చర్చల్లో రజినీకాంత్ కూడా పాల్గొన్నారని వార్తలు వచ్చాయి.
సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగిన ఈ ప్రచారంపై కూడా రజినీకాంత్ వివరణ ఇచ్చారు. విజయ్‌తో తనకున్న సంబంధం గురించి కూడా ఆయన మాట్లాడారు.
విజయ్ ముఖ్యమంత్రి అయ్యే చాన్స్‌ల గురించి తాను చేసిన వ్యాఖ్యలను చాలామంది విమర్శిస్తున్నారని రజినీకాంత్ అన్నారు.
‘‘విజయ్‌కు విమానాశ్రయంలో నేను అభినందనలు తెలపలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే, విజయ్ గెలిచిన మరుక్షణమే, నేను ఎక్స్‌లో అభినందనలు తెలియజేశాను. నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. నేను రాజకీయాలను పూర్తిగా వదిలేశాను. రాజకీయ రంగంలో లేను కాబట్టి విజయ్ పట్ల నాకు అసూయ ఉండాల్సిన అవసరం ఎందుకుంటుంది? నన్ను నేను విజయ్‌తో పోల్చుకోవడం ఎంత అనుచితమో, అలాగే విజయ్ తనను నాతో పోల్చుకోవడం కూడా అంతే అనుచితం. విజయ్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుండి నేను అతని ఎదుగుదలను చూస్తూనే ఉన్నాను. కేవలం అతను ముఖ్యమంత్రి అయ్యాడన్న ఒక్క కారణంతో నేను ఎందుకు అసూయపడతాను?" అన్నారు రజినీకాంత్.
‘‘కేవలం 52 ఏళ్ల వయసులోనే, ఎంజీఆర్, ఎన్టీయార్ వంటి దిగ్గజాల విజయాలను సైతం అధిగమించే స్థాయి విజయాన్ని అతను సాధించాడు. సినిమా రంగం నుండి వచ్చిన అతను ఒంటరిగానే బీజేపీ సహా అన్ని బలమైన రాజకీయ పార్టీలను ఓడించాడు. నాకు ఏమాత్రం అసూయ లేదు. పైగా, అతని విజయాన్ని చూసి నేను ఆశ్చర్యపోయా. అతని గెలుపు చూసి నేను నిజంగా సంతోషించా. ప్రజలకు విజయ్‌పై ఎంతో నమ్మకం, భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అతను తప్పక నెరవేరుస్తాడన్న పూర్తి విశ్వాసం నాకు ఉంది" అన్నారాయన.
విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేదని విలేఖరులు ప్రశ్నించినప్పుడు ‘‘గతంలో ఏ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా నేను హాజరు కాలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.
రజినీకాంత్ గురించి కమల్ హాసన్ ఏమన్నారు?
మరోవైపు ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా రజినీకాంత్ గురించి వ్యాఖ్యానించారు. తాను, రజినీకాంత్ ఆరోగ్యకరమైన పోటీదారులుగా ఉన్నప్పటికీ, తమ ఇద్దరి మధ్య అసూయ లేదని కమల్ హాసన్ అన్నారు.
ఒకదశలో తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు ఒక బలమైన ప్రత్యామ్నాయంగా రజినీకాంత్‌ను పరిగణించేవారు.
ఆయనకు బీజేపీ మద్దతిస్తుందని భావించేవారు. అయితే, రజినీకాంత్ చివరకు రాజకీయాల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)