శరీర గంధం: వెల్లుల్లి తింటే ఆడవాళ్లను ఆకర్షించే వాసన వస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సోఫియా క్వాగ్లియా
- చదివే సమయం: 7 నిమిషాలు
వెల్లుల్లి, మద్యం, మాంసం. ఈ ఆహారాలను తినడం వల్ల మీ శరీరం నుంచి వెలువడే వాసన మారిపోతుందని మీకు తెలుసా?
వేలిముద్రలాగే మనందరికి భిన్నమైన శరీరపు వాసన ఉంటుంది. దీనినే శరీర గంధం అని కూడా అంటారు. మన స్వభావం నుంచి కలివిడితనం, ఉత్సాహం, ఆరోగ్యం ఇలా అనేక అంశాలు మన శరీరం నుంచి వెలువడే వాసనపై ప్రభావాన్ని చూపుతాయి.
ఆడ, మగ, చిన్నా పెద్దా, ఆధిపత్య స్వభావం, సున్నిత మనస్తత్వం, ఆరోగ్యవంతులు, అనారోగ్యపీడితులు, సంతోషంతో ఉండేవారు, దు:ఖ బాధితులు...ఇలా ఎవరికైనా ఇవే అంశాలు వర్తిస్తాయి.
ఇందులో చాలా అంశాలు మన నియంత్రణలో ఉండకపోవచ్చు. కానీ మన శరీరం నుంచి వెలువడే వాసనపై ప్రధానంగా ప్రభావం చూపే అంశాల్లో మనం తీసుకునే ఆహారం ఒకటి.
ఒక పరిశోధన ప్రకారం ఇది మొత్తంగా శరీర వాసనపైనే కాకుండా ఇతరులు మనల్ని ఎలా చూస్తారో, మనం ఇతరులకు ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తామో కూడా మనం తినే ఆహారం నిర్ణయిస్తుంది.

మొదటిది- పేగులు: ఒక బయాలాజికల్ స్థాయిలో చూసుకుంటే, మనం తినే ఆహారం శరీర వాసనను ప్రధానంగా రెండు మార్గాల్లో ప్రభావితం చేస్తుందని న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ (బింగ్హామ్టన్)లో హెల్త్ అండ్ వెల్నెస్ అధ్యయనాల అసిస్టెంట్ ప్రొఫెసర్ లీనా బెగ్డాచె చెబుతున్నారు- ఒకటి పేగులు, రెండోది చర్మం.
మన శరీరంలో ఆహారం జీర్ణమవుతున్నప్పుడు, పేగుల్లోని బ్యాక్టీరియా ఆ ఆహారాన్ని మెటాబలైజ్ చేస్తుంది. ఆహారంలోని రసాయనాలు బ్యాక్టీరియా మధ్య జరిగే ఈ చర్యల్లో కొన్ని వాయువులు విడుదల అవుతాయి.
ఇవి సులభంగా గాలిలో కలిసే వాసన గల అణువులు. ఇవి శరీరం బయటకు అదే మార్గంలో వస్తాయి - అంటే నోటిమార్గం ద్వారా. దీంతో నోటి దుర్వాసన ఏర్పడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మూడోవంతు జనాభాకు ఈ సమస్య ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. అయితే దీనికి జీర్ణక్రియ కాకుండా ఇతర కారణాలూ ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
రెండోది-చర్మం. జీర్ణక్రియ తర్వాత ఆహారంలోని రసాయనాలు, రక్తప్రసరణ ద్వారా శరీరంలోని వివిధ కణజాలాలకు చేరుతాయి. వాటిలో కొన్ని చర్మం ద్వారా చెమట రూపంలో బయటకు వస్తాయి. అక్కడ చర్మంపై ఉండే బ్యాక్టీరియాతో కలసి ప్రత్యేక వాసనను సృష్టిస్తాయి. చెమట స్వతహాగా వాసనలేనిది. చెమటలో పెరిగే బ్యాక్టీరియానే దానికి వాసనను ఇస్తుంది.
వివిధ రకాల ఆహారాల్లో భిన్నమైన రసాయన పదార్థాలు ఉంటాయి. ఇవి వేర్వేరు దశల్లో పని చేసి వాసన తీవ్రతను మార్చుతాయి. అయితే బలమైన దుర్వాసనకు కారణమయ్యే ఆహారాల్లో సాధారణంగా కనిపించే రసాయనం సల్ఫర్. చిత్రం ఏంటంటే ఇలాంటి వాసన గల ఆహారాలు కొన్నిసార్లు మనల్ని మరింత ఆకర్షణీయంగా చూపించేంత ప్రభావాన్ని కూడా కలిగిస్తాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
బ్రోకోలీ, క్యాబేజీ, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేసినా వీటిలో సల్ఫర్‌కు సంబంధించిన రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పాడైపోయిన గుడ్ల వాసనను గుర్తు చేసేలా ఉండవచ్చు. ఇవి రక్తప్రసరణ ద్వారా చర్మానికి చేరి బ్యాక్టీరియాతో కలిసినప్పుడు చెమటకు ఘాటైన వాసనను ఇవచ్చు
వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి అలియం క్యాటగిరీకి చెందిన ఆహారాలు కూడా ఇలాంటి ప్రభావం చూపుతాయి. ఇవి జీర్ణక్రియలో విచ్ఛిన్నమైనప్పుడు డైలిల్ డైసల్ఫైడ్, అలిల్ మెథైల్ సల్ఫైడ్ వంటి వాసన గల కెమికల్ కాంపౌండ్లుగా మారతాయి. ఇవి తిన్న వెంటనే, లేదా గరిష్ఠంగా 30 నిమిషాల తర్వాత శరీరం నుంచి వాసన రూపంలో బయటకు వెలువడతాయి.
అయితే వెల్లుల్లి విషయంలో ఆసక్తికరమైన ఫలితాలు కనిపించాయి. ఒక ప్రయోగంలో 42 మంది పురుషులు 12 గంటల పాటు చెమట ప్యాడ్లు ధరించారు. కొందరు తక్కువ వెల్లుల్లి, కొందరు ఎక్కువ వెల్లుల్లి, మరికొందరు వెల్లుల్లి సప్లిమెంట్లు తీసుకున్నారు.
ఆ చెమట వాసనకు 82 మంది మహిళలు రేటింగ్ ఇచ్చారు. ఎక్కువ వెల్లుల్లి తీసుకున్న పురుషుల చెమటను మహిళలు ఎక్కువ ఆకర్షణీయంగా భావించారు. వెల్లుల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచే యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబియల్ గుణాలు కలిగి ఉండటంతో ఈ ప్రభావం ఉండొచ్చని శాస్త్రవేత్త యాన్ హవ్లిచెక్ భావిస్తున్నారు. చెక్ రిపబ్లిక్‌లోని చార్లెస్ యూనివర్సిటీలో హ్యూమన్ ఎథాలజీ అండ్ కెమికల్ కమ్యూనిరేషన్ పై హవ్లిచెక్ అధ్యయనం చేస్తున్నారు.
ఈ పరిశోధన ఫలితాలు ఊహించని విధంగా రావడంతో దానిని మూడుసార్లు మళ్లీ నిర్వహించాల్సి వచ్చిందని శాస్త్రవేత్త యాన్ హవ్లిచెక్ చెప్పారు. వెల్లుల్లిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, జీవాణు నిరోధక గుణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని, అదే ప్రభావం పురుషుల శరీరపు వాసనను మహిళలకు మరింత ఆకర్షణీయంగా అనిపించేలా చేసి ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర కూరగాయలు కూడా మన శరీర వాసనపై ప్రత్యేకమైన ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, ఆస్పరగస్ అనే కూరగాయలో అస్పరగ్యూసిక్ యాసిడ్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది మన శరీరంలో జీర్ణమయ్యే సమయంలో సల్ఫర్ కాంపౌండ్లు విడుదలవుతాయి. మెథానీథియాల్, డై మిథైల్ సల్ఫైడ్ వంటి ఈ రసాయనాలే చెమటకూ, మూత్రానికీ ఒక ప్రత్యేకమైన వాసన రావడానికి కారణం.
సల్ఫర్ కాంపౌండ్లు చాలా తేలికగా గాలిలో కలిసిపోతాయి. అందుకే టాయిలెట్ నుంచి కూడా ఆ వాసన సులభంగా గుర్తించవచ్చు. సాధారణంగా ఈ వాసన ఐదు గంటలకు మించి కొనసాగవచ్చు.
అయితే ఈ వాసన అందరిలోనూ ఏర్పడదు. దీనిపై జరిగిన అధ్యయనాలు వేర్వేరు ఫలితాలు చూపించాయి. 1950లలో జరిగిన పరిశోధనల్లో 50 శాతంకన్నా తక్కువమందిలో మాత్రమే ఆస్పరగస్ మూత్రం వాసన వస్తుందని భావించారు. కానీ 2010లో చేసిన మరో అధ్యయనంలో 90శాతంమందికి పైగా ఈ వాసన ఉత్పత్తి అవుతుందని తేలింది.
అంతేకాదు, ఆ వాసనను అందరూ గుర్తించలేరు కూడా. ఆస్పరగస్ వల్ల వచ్చే ఈ ఘాటైన వాసనను పసిగట్టే సామర్థ్యం కూడా జన్యుపరమైనదేనని భావిస్తున్నారు.
సాధారణంగా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల శరీర వాసన మరింత ఆహ్లాదకరంగా మారవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. 2017లో ఆస్ట్రేలియాలో జరిగిన ఒక అధ్యయనంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకునే పురుషుల శరీర వాసనను ఇతరులు మరింత ఫ్రూటీ, పుష్పాల వాసనలా, తీయనిదిగా ఉందని పేర్కొన్నారు.
ఇదే అధ్యయనం మరో ఆసక్తికర విషయాన్ని కూడా చెబుతుంది. క్యారెట్, గుమ్మడికాయ, టమాట, బొప్పాయి వంటి వాటిలో ఉండే క్యారోటినాయిడ్లు చర్మానికి స్వల్పమైన స్వర్ణపు వర్ణాన్ని ఇస్తాయి. అలాంటి చర్మం ఉన్న ముఖాలను కూడా ఎక్కువగా ఆకర్షణీయంగా భావిస్తున్నారని గుర్తించారు. అదే సమయంలో కొద్దిగా కొవ్వు, మాంసం, గుడ్లు వంటి ఆహారాలు తీసుకునే వారిలో కూడా చెమట వాసన మరింత ఆహ్లాదకరంగా ఉందని తేలింది. అయితే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకునే వారి శరీర వాసన మాత్రం చాలా తక్కువ ఆకర్షణీయంగా ఉన్నట్లు పరిశోధన సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Serenity Strull/ Getty Images
మరి మాంసం, చేపలు?
మాంసం, చేపలు కూడా శరీరానికి ప్రత్యేకమైన వాసన రావడానికి కారణమవుతాయి. జంతు ప్రోటీన్లు శరీరంలో విచ్ఛిన్నం అవుతూ అమినో ఆమ్లాలు, కొవ్వులుగా మారుతాయి. ఇవి చెమట ద్వారా బయటకు వెళ్లి చర్మంపై ఉండే బ్యాక్టీరియాతో ప్రతిక్రియ చెందుతాయి. దాంతో ప్రత్యేకమైన శరీర వాసన ఏర్పడుతుంది.
ఉదాహరణకు చేపలు, పప్పుధాన్యాలు ట్రైమెథైలమైన్ అనే బలమైన వాసనగల సంయోగంతో నిండుగా ఉంటాయి. ఈ కారణంగా శరీర వాసన పెరగవచ్చు. శరీరం ట్రైమెథైలమైన్ను వాసనలేని రూపంగా మార్చలేని పరిస్థితిని ట్రైమెథైలమిన్యూరియా అంటారు. దీనిని "ఫిష్ ఓడర్ సిండ్రోమ్" అని కూడా పిలుస్తారని పోషకాహార నిపుణురాలు కెర్రీ బీసన్ అన్నారు. ఈ పరిస్థితిలో శరీరం నుంచి బలమైన చేపల వాసన వస్తుంది. అయితే ఇది చాలా అరుదుగా కనిపించే సమస్య. ఉదాహరణకు, 2025లో నమోదైన ఒక 10 నెలల బాలుడి కేసు రిపోర్టులో ఆ పిల్లాడు చేపలు, ముఖ్యంగా స్వార్డ్‌ఫిష్ తిన్న తర్వాత అతనిలో ట్రైమెథైలమిన్యూరియా లక్షణాలు కనిపించాయి. అతని దగ్గరి నుంచి పాడైపోయిన చేపల వాసన వచ్చింది. తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ఆ సమస్య పరిష్కారమైంది. తరువాత మళ్లీ చేపలు తిన్నా ఆ లక్షణాలు కనిపించలేదు.
మాంసాహారం మనల్ని ఆకర్షణీయమైన వ్యక్తులుగా మార్చడంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి 2006లో హవ్లిచెక్ బృందం ఒక అధ్యయనం చేసింది. 30 మంది పురుషులు రెండు వారాలు మాంసాహారం లేదా మాంసం లేని ఆహారం తీసుకున్నారు. ఆ తరువాత మహిళలు వారి శరీర వాసనను ఆహ్లాదకరత, ఆకర్షణ, ఘాటుదనం వంటి ప్రమాణాలను పరిశీలించారు. మాంసం తినని పురుషుల వాసన సగటున మరింత ఆకర్షణీయంగా, మరింత ఆహ్లాదకరంగా, తక్కువ ఘాటుగా ఉందని తేలింది.
"మాకు ఇది నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది. మాంసం తినేవారి వాసన, వారు మాంసం తీసుకోనప్పుడు ఉన్న దానికంటే స్వల్పంగా అసహ్యంగా ఉందని గుర్తించాం" అని హవ్లిచెక్ చెప్పారు.
మద్యం తాగినా ఆకర్షణీయమైన వాసనే, కానీ..
మద్యం - ముఖ్యంగా ఎక్కువ మోతాదులో, తరచూ తీసుకుంటే జీర్ణాశయ వ్యవస్థ నుంచీ, చెమట గ్రంథుల నుంచీ దుర్వాసనకు కారణమవుతుందని లీనా బెగ్డాచే చెబుతున్నారు. కాలేయంలో మద్యం నుంచి అసిటాల్డిహైడ్ అనే విషపూరితమైన, వేగంగా ఆవిరయ్యే రసాయనం ఉత్పత్తి అవుతుంది. దీనికి పాత మద్యం వాసనలాగే బలమైన ప్రత్యేక గంధం ఉంటుంది. ఒక అధ్యయనంలో, ఒక వ్యక్తి మద్యం తాగాడో లేదో కేవలం నోటి వాసన ద్వారా పోలీసులు 60% నుంచి 85% వరకు గుర్తించగలిగారని తేలింది. అది వారు ఎంత మోతాదు తాగారనేదానిపై ఆధారపడి ఉంది.
మద్యం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది, అలాగే నోటిలో లాలాజలం ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో బ్యాక్టీరియా ఎక్కువసేపు నోటిలో ఉండి వృద్ధి చెందడానికి అవకాశం లభిస్తుంది. ఫలితంగా దుర్వాసన ఎక్కువసేపు కొనసాగుతుంది.
235 మందిపై చేసిన ఒక పరిశోధనలో ప్రతిరోజూ మద్యం తీసుకునేవారే ఎక్కువగా నోటి దుర్వాసన గురించి ఫిర్యాదు చేశారని గమనించారు. వారి శ్వాసలో వోలటైల్ సల్ఫర్ కాంపౌండ్లు కూడా ఎక్కువగా ఉన్నాయని తేలింది. 2010లో జరిగిన మరో అధ్యయనంలో ప్రయోగం సమయంలో కొందరు పురుషులు బీర్ తాగగా, మరికొందరు నీళ్లు తాగారు. బీర్ తాగినవారు "మరింత ఆకర్షణీయంగా" ఉన్నారని ఫలితం చెప్పింది. అయితే అది దురదృష్టవశాత్తూ మనుషులకు కాదు, దోమలకు మాత్రమే.
ఇక కాఫీ, టీ ల్లో ఉండే కేఫిన్ అపోక్రైన్ గ్రంథులను ఉత్తేజితం చేస్తుంది. ఇవే కక్ష ప్రాంతం, జననాంగాల చుట్టుపక్కల చెమట ఉత్పత్తి చేసే గ్రంథులు. చెమట ఉత్పత్తి పెరగడం వల్ల బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దాంతో శరీర వాసన బలంగా మారే అవకాశం ఉందని కేరీ బీసన్ చెబుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం, కెఫిన్ అణువులు చెమటలో కూడా కనిపిస్తాయి. అయితే కెఫిన్ స్వయంగా శరీర వాసనపై నేరుగా ప్రభావం చూపుతుందో లేదో ఇప్పటివరకు స్పష్టమైన డేటా లేదు.
"మనుషులు కూడా క్షీరదాలే. కాబట్టి ఇతర జంతువుల మాదిరిగానే సామాజిక సంబంధాల్లో వాసన కీలక పాత్ర పోషించే అవకాశముంది" అని వాసన- సామాజిక బంధాల మధ్య సంబంధంపై అధ్యయనం చేసే రాబర్ట్స్ చెబుతున్నారు.
మనల్ని ఇతరులు ఎంత ఆకర్షణీయంగా భావిస్తారో నిర్ణయించే అనేక అంశాల్లో శరీర వాసన ఒకటి. కానీ మన రూపం, ప్రవర్తన, మాట్లాడే తీరు వంటి ఇతర సంకేతాల నుంచి వాసన ప్రభావాన్ని వేరుచేసి కచ్చితంగా అంచనా వేయడం "చాలా కష్టం - దాదాపు అసాధ్యం" అని రాబర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
అయినా, ఈ సున్నితమైన మార్పులను పరిశీలిస్తున్న సమయంలో శాస్త్రీయ పరిశోధనలు తరచూ భిన్నమైన ఫలితాలను ఇస్తున్నాయి.
ఉదాహరణకు, హవ్లిచెక్ చేసిన ఒక ప్రయోగంలో కొంతమంది మహిళలు సాధారణంగా ఆహారం తీసుకోగా, మరికొందరు 48 గంటలు ఉపవాసం ఉన్నారు. తర్వాత పురుషులు వారి బాహుమూలల్లో పెట్టుకునే చెమట ప్యాడ్ల వాసనను సౌకర్యం, ఆకర్షణ, తీవ్రతవంటి ప్రమాణాలపై అంచనా వేశారు. పెద్ద తేడా కనిపించకపోయినా, ఉపవాసం ఉన్న మహిళల చెమట వాసన కొంతమేర ఎక్కువగా ఆకర్షణీయంగా ఉందని తేలింది. "ఇది కూడా మేము ఊహించని ఫలితం" అని హవ్లిచెక్ అన్నారు.
అయితే, ఈ ఫలితాలు స్పష్టంగా నిర్థరించాలంటే మరిన్ని పరిశోధనలు అవసరం. అంతేకాదు, చెమట వాసన మెరుగుపడవచ్చుగానీ, 2018లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఉపవాసం వల్ల నోటి దుర్వాసన మాత్రం పెరిగే అవకాశం ఉందని గుర్తించారు.
ఇలాంటి అనూహ్య ఫలితాల వల్ల రాబర్ట్స్, హవ్లిచెక్ వంటి పరిశోధకులు ఒక విషయం గుర్తించారు ఆహారం శరీర వాసనపై, అలాగే ఆ వాసనను ఇతరులు ఎలా గ్రహిస్తారన్న దానిపై ప్రభావం చూపే ఒకే విధమైన నియమం లేదు. ఇందులో చాలా మార్పులు, వ్యక్తిగత తేడాలు ఉంటాయి.
‘‘వాసన కలిగించే రసాయనాలు అనేకం ఉంటాయి. వాటిలో ఎక్కువ రసాయనాల ప్రభావం మన శరీర వాసనపై ఎలా ఉంటుందో మనకు పూర్తిగా తెలియదు. కానీ అవి ప్రభావం చూపే అవకాశాలు చాలా ఎక్కువ" అని హవ్లిచెక్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































