కరీంనగర్: 'సాయం కోసం అరుస్తూ ఉండిపోయాను, కప్పలు కాళ్లను కొరికేశాయి', రాత్రీపగలు బావిలోనే భయంభయంగా గడిపిన మహిళ ఎలా బయటపడ్డారంటే..

ఆన్‌లైన్ గ్యాంబ్లిగ్, అప్పులు, కూలీ, మహిళ, కరీంనగర్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

కూలీ కోసం వెళ్లిన 55 ఏళ్ల మహిళను దోచుకుని వ్యవసాయ బావిలోకి తోసేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేశారు కరీంనగర్ పోలీసులు.

బావిలో మునిగిపోకుండా, తన ప్రాణాలను కాపాడుకుంటూ ఆ మహిళ ఓపికతో రాత్రి, పగలు దాదాపు 24 గంటలపాటు సహాయం కోసం ఎదురు చూశారని పోలీసులు తెలిపారు.

ఆన్‌లైన్ బెట్టింగ్, జూదానికి బానిసై అప్పుల్లో కూరుకుపోయిన డిగ్రీ విద్యార్థి ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు.

మహిళను స్థానికులు సురక్షితంగా బావి నుంచి బయటకు తెచ్చారు.

కూలీ పని కోసం వెళ్లి మోసపోయానని బాధిత మహిళ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆన్‌లైన్ గ్యాంబ్లిగ్, అప్పులు, కూలీ, మహిళ, కరీంనగర్

ఫొటో సోర్స్, karimnagar police

ఫొటో క్యాప్షన్, కూలీ పని కోసం తీసుకెళ్లి తనను బావిలో తోసేసినట్లు బాధిత మహిళ చెప్పారు.

అసలేం జరిగింది?

‘‘కరీంనగర్ కిసాన్‌నగర్‌కు చెందిన గంగాధర లక్ష్మి(55) జూలై 1న టవర్ సర్కిల్ లేబర్ అడ్డాకు కూలీ పని కోసం వెళ్లారు. చీకటిపడినా లక్ష్మి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుమారులు కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశాం’’ అని కరీంనగర్ పోలీసులు తెలిపారు.

ఆ రోజు ఏం జరిగిందో బాధితురాలు లక్ష్మి స్థానిక మీడియాకు వివరించారు.

"జూలై 1న కూలీ పని ఉందని చెప్పిన యువకుడు బైక్ పై(రాపిడో ) తిమ్మాపూర్‌లో డ్రాప్ చేశాడు. అక్కడ నన్ను బైక్ ఎక్కించుకున్న అతను నుస్తుల్లాపూర్ శివార్లలోని పొలాల వద్దకు తీసుకుపోయి నా దగ్గరున్న సెల్ ఫోన్ లాక్కుని, ఒంటిపై ఉన్న బంగారం దోచుకున్నాడు. సహాయం కోసం అరుస్తుంటే నోటిలో కర్చీఫ్ కుక్కాడు. పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి తోసేశాడు" అని లక్ష్మి చెప్పారు.

ఆ హఠాత్పరిణామంతో జీవితమంతా ఒక్కసారి కళ్లముందు కదిలిందని, తన పిల్లలు, కుటుంబం గుర్తుకొచ్చి కన్నీళ్లు ఆగలేదని లక్ష్మి వివరించారు.

బావిలో నుంచి రబ్బరుతాడు సహాయంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటే పైనుంచి తాడును విప్పేయడంతో తిరిగి బావిలో పడిపోయానని ఆమె చెప్పారు.

ఆన్‌లైన్ గ్యాంబ్లిగ్, అప్పులు, కూలీ, మహిళ, కరీంనగర్

ఫొటో సోర్స్, karimnagar police

ఫొటో క్యాప్షన్, వ్యవసాయ బావిలో రాత్రంతా అనేక ఇబ్బందులు పడ్డానని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

‘వైర్లు చుట్టుకుని, కాళ్లను కప్పలు కొరికి...’

"నాకు ఈత వచ్చు. కొన్ని గంటలు ఈదుతూ ఉన్నాను. బావిలోని మోటార్‌‌కు కట్టిన వైర్లు, రబ్బరు తాళ్ల సహాయంతో పైకి వచ్చేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ నీళ్ల తడికి కాళ్లు జారి బావిలోనే పడిపోయాను. నీళ్లలో తడిచి చీర బరువైందని విప్పేశాను. చివరకు కాళ్లు, చేతులకు వైర్లను చుట్టుకుని అలాగే సహాయం కోసం అరుస్తూ ఉండిపోయాను. రాత్రంతా నీళ్లలో ఉండడం వల్ల బావిలోని కప్పలు కాళ్లను కొరికేశాయి" అని తన బాధను ఆమె మీడియాకు వివరించారు.

జూలై 2న వ్యవసాయ బావి దగ్గరకు వచ్చిన నుస్తుల్లాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు లక్ష్మిని సురక్షితంగా బావిలో నుంచి పైకి తెచ్చారు. పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించారు.

ఘటన జరిగిన రోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు రెస్క్యూ ముగిసే వరకు సుమారు 24 గంటలు లక్ష్మి ఒంటరిగా బావిలో నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.

ఆన్‌లైన్ గ్యాంబ్లిగ్, అప్పులు, కూలీ, మహిళ, కరీంనగర్

ఫొటో సోర్స్, Ugc

ఫొటో క్యాప్షన్, మంచానికి తాళ్లు కట్టి బావిలోకి దించి మహిళను స్థానికులు బయటకు తీశారు.

మంచం బావిలోకి దించి...

నుస్తుల్లాపూర్‌కు చెందిన రైతు వంగల శ్రీనివాస్ రెడ్డి బీబీసీతో మాట్లాడుతూ, "ఆ వ్యవసాయ బావి మా పొలం పక్కనే ఉంటుంది. ఆ బావిని లీజుకు తీసుకున్నా. బావిలో మోటార్ ఇటీవల కాలిపోయింది. దాన్ని రిపేర్‌కు పంపుదామని చూస్తుండగా బావి లోపల మహిళ కనిపించారు. వివరాలు అడిగినా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారామె" అని అన్నారు.

"సహాయం కోసం మరికొందరు గ్రామస్థులను పిలిచాను. పొలంలో విశ్రాంతి కోసం వాడుకునే మంచానికి నాలుగు వైపులా తాళ్లు కట్టి లోపలికి దించాం. మంచం పైకి వచ్చి కూర్చున్నాక ఇక ఆమె సేఫ్ అనుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించాం. ఆ లోపు బావిలోకి ఓ వ్యక్తిని దింపి టిఫిన్, పొడి దుస్తులను ఇచ్చాం. పోలీసులు వచ్చాక మంచాన్ని పైకి లాగి రెస్క్యూ పూర్తి చేశాం" అని రైతు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

"ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడని అనిపించింది" అన్నారు వంగల శ్రీనివాస్ రెడ్డి.

ఆన్‌లైన్ గ్యాంబ్లిగ్, అప్పులు, కూలీ, మహిళ, కరీంనగర్

ఫొటో సోర్స్, karimnagar police

ఫొటో క్యాప్షన్, నిందితుడి నుంచి మహిళ వస్తువులను పోలీసులు రికవరీ చేశారు.

'ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ఆడి అప్పుల ఊబిలో కూరుకుపోయి..'

ఈ కేసులో నిందితుడైన దమ్మ దినేశ్ రెడ్డి(21)ని సాంకేతిక ఆధారాలతో పట్టుకున్నామని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు.

"ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, కలర్ ట్రేడింగ్, లాటరీ గేమ్‌లకు బానిసైన నిందిడుతు ఇప్పటికే 4 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. లోన్ యాప్‌ల ద్వారా తీసుకున్న అప్పుల ఒత్తిడి పెరగడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పథకం వేశాడు. కరీంనగర్ మార్కెట్‌లోని అమరవీరుల స్థూపం దగ్గర అతన్ని అరెస్టు చేశాం. కిడ్నాప్, దోపిడీ, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశాం" అని ఆయన చెప్పారు.

విచారణలో భాగంగా ... నిందితుడు దోపిడీ చేసిన ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు, 20 గ్రాముల వెండి మెట్టెలు కరీంనగర్ టవర్ సర్కిల్‌లోని ఓ నగల వ్యాపారికి 30,000 రూపాయలకు విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు. దోపిడీ సొత్తుతో పాటు 5 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

''ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, అక్రమ బెట్టింగ్ యాప్‌లు వ్యక్తులను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తాయి. ఇది చివరకు తీవ్రమైన నేరాలకు దారితీసే ప్రమాదం ఉంది. కూలీ పనుల కోసం వెళ్లే వారు అపరిచితులను నమ్మి ఒంటరిగా వెళ్లొద్దు. పనికి తీసుకెళ్లే వ్యక్తి వివరాలు, వాహనం నంబర్, గమ్యస్థానం వంటి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు లేదా తోటి కూలీలకు తప్పనిసరిగా తెలియజేయాలి" అని పోలీస్ కమిషనర్ సూచించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)