లైవ్, సీజేపీ నిరసన: సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని పోలీసులకు దిల్లీ హైకోర్టు ఆదేశం

"ఇది ఒకే ఒక్క సంఘటన అయి ఉంటే, పరిస్థితి భిన్నంగా ఉండేది. వారిని వ్యక్తిగత ఫిర్యాదు చేసుకోమని పోలీసులు కోరడం సరైనదే కావచ్చు. కానీ ఇది అలాంటి కేసు కాదు" అని కోర్టు వ్యాఖ్యానించింది.

సారాంశం

  • దిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని నివాసం ఎదుట విపక్ష నేతలు, కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులను దిల్లీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
  • రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఇతర విపక్ష నేతలను పోలీసులు మొదట ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు. ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
  • అనంతరం మంగళవారం రాత్రి పోలీసులు రాహుల్ గాంధీని విడిచిపెట్టారు. తర్వాత ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి ఒక వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రియాంక గాంధీ, అఖిలేశ్ యాదవ్, ఇతర విపక్ష నేతలనూ విడిచిపెట్టారు.
  • రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించాలని చూస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు.
  • మంగళవారం జరిగిన పరిణామాలపై మంగళవారం రాత్రి 11.35 గంటలకు 'ఎక్స్' వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఛత్రసాల్ స్టేడియం నుంచి మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఆ వీడియోలో రాహుల్ గాంధీ.. విపక్షాలన్నీ బుధవారం ఈ వ్యవహారంపై పార్లమెంటులో చర్చ జరగాలని కోరుకుంటున్నాయని చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. సీజేపీ నిరసన: సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని పోలీసులకు దిల్లీ హైకోర్టు ఆదేశం

    జంతర్ మంతర్

    ఫొటో సోర్స్, Getty Images

    జూలై 20న జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్న వారిపై పోలీసుల చర్యకు సంబంధించి దాఖలైన రెండు పిటిషన్లపై దిల్లీ హైకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి, దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది .

    బార్ అండ్ బెంచ్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం పిటిషనర్లు లేవనెత్తిన సమస్యలు కేవలం బాధితులపై వ్యక్తిగత ఫిర్యాదులు దాఖలు చేయడానికి మాత్రమే సూచించేవికావని పేర్కొంది.

    "ఇది ఒకే ఒక్క సంఘటన అయి ఉంటే, పరిస్థితి భిన్నంగా ఉండేది. వారిని వ్యక్తిగత ఫిర్యాదు చేసుకోమని పోలీసులు కోరడం సరైనదే కావచ్చు. కానీ ఇది అలాంటి కేసు కాదు" అని కోర్టు వ్యాఖ్యానించింది.

    దీని తర్వాత కోర్టు పోలీసులను తమ సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది.

    సీసీటీవీ ఫుటేజ్, ఇతర వీడియో సాక్ష్యాలను భద్రపరచాలని కూడా కోర్టు పోలీసులను ఆదేశించింది.

    ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 11న జరగనుంది.

  2. ప్రభుత్వం తీరు నచ్చక మళ్లీ ‘మత్తు మందు’ సాగు మొదలుపెడుతున్న రైతులు

  3. కాక్రోచ్ జనతా పార్టీ: ‘‘ కేంద్ర మంత్రి ఇంట్లో చర్చలకు ఆహ్వానించారు. కానీ, మేం తిరస్కరించాం’’

    సౌరవ్ దాస్

    ఫొటో సోర్స్, ANI/X

    ప్రభుత్వం చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసానికి రావాల్సిందిగా తమకు ఆహ్వానం అందిందనీ, కానీ దాన్ని తిరస్కరించామని కాక్రోచ్ జనతా పార్టీ వెల్లడించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ విషయంలో ఒక ప్రకటన చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. సౌరవ్ దాస్ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే...

    ‘‘బుధవారం ఉదయం మా దగ్గరికి పోలీసులు వచ్చారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాతో మాట్లాడలనుకుంటున్నారని మాకు చెప్పారు. ఈ చర్చల కోసం మమ్మల్ని ఆయన ఇంటికి ఆహ్వానించారు. అయితే మేం ఆ అభ్యర్థనను తిరస్కరించాం. మేం ఎవరి ఇంటికి, ఆఫీసుకి వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడ ఒక జనతా దర్బార్‌ను నిర్వహిస్తున్నాం. ఒకవేళ మంత్రులు మాతో చర్చలు జరపాలనుకుంటే వాళ్లే జనం దగ్గరికి రావాలి. చర్చలు జంతర్ మంతర్ దగ్గరే జరగాలి. ఒకవేళ నిరసన స్థలంలో భద్రతా ఆందోళనకరమని ప్రభుత్వం భావిస్తే, జంతర్ మంతర్ సమీపంలో ఏదైనా ఒక తటస్థ వేదిక దగ్గర చర్చలకు కూడా మేము సిద్ధమే. ఈ విషయమై మేము ప్రభుత్వం నుంచి ,స్పందన కోసం ఎదురు చూస్తున్నాం’’ అని అన్నారు.

    తాము ప్రతిపాదించిన డిమాండ్లను అంగీకరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉండాలనీ, ఎటూ తేలని భేటీలకి తమను పిలవడం వల్ల లాభం లేదని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. సీజేపీ నిరసనకారులపై దాడుల పిటిషన్‌‌ను తక్షణమే విచారించేందుకు సీజేఐ నిరాకరణ

  5. దిల్లీ వీధుల్లోకి వచ్చిన యువత మోదీ సర్కారుకు సమస్యలు పెంచుతుందా?

  6. షార్క్స్: వీటికి మ్యాథ్స్ తెలుసు, మ్యూజిక్ అంటే ఇష్టం – సొరచేపల గురించి మీకు తెలియని తొమ్మిది విషయాలు

  7. ‘రాహుల్ గాంధీతో ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి’

    తమిళనాడు

    ఫొటో సోర్స్, R. Satish BABU / AFP via Getty Images

    ఫొటో క్యాప్షన్, తమిళనాడు సీఎం విజయ్

    లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకోవడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ పార్టీ ఖండించింది.

    రాహుల్ గాంధీని నిర్బంధించి, చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లడం ప్రజాస్వామ్య హక్కులపై నేరుగా చేసిన దాడని తమిళగ వెట్రి కళగం(టీవీకే)ఆరోపించింది.

    ‘‘దేశ రాజధానిలో ప్రజాస్వామ్యాన్ని అణచివేయడాన్ని తీవ్రంగా ఖండించాలి. రాహుల్ గాంధీని పోలీసులు ఈడ్చుకెళ్లడం ప్రజాస్వామ్య హక్కులపై ప్రత్యక్ష దాడి. నీట్ పరీక్ష విశ్వసనీయత మొదటినుంచీ ప్రశ్నార్థకంగా ఉంది. విద్యార్థులపై నిరంతర మానసిక ఒత్తిడి పెరిగింది. వారి కలలు ప్రశ్నార్థకంగా మారాయి. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలి ’’ అని టీవీకే ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.

  8. దిల్లీలో 16 మెట్రో స్టేషన్ల మూసివేత

    central secretariat metro station

    ఫొటో సోర్స్, Getty Images

    సీజేపీ నిరసనల నేపథ్యంలో దిల్లీలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసినట్లు ‘దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్’ ప్రకటించింది. తదుపరి సూచనలు వచ్చేవరకు ఈ స్టేషన్ల నుంచి రాకపోకలు ఆపుతున్నట్లు పేర్కొంది.

    అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ప్రయాణికులు ఒక లైన్ నుంచి మరొక లైన్‌కు మారడంపై ఎలాంటి ఆంక్షలు లేవని వెల్లడించింది.

    మూసివేసిన స్టేషన్లు ఇవే..

    1) లోక్ కల్యాణ్ మార్గ్

    2) రాజీవ్ చౌక్

    3) పటేల్ చౌక్

    4) రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్

    5) బారాకంబా రోడ్

    6) సుప్రీంకోర్ట్

    7) సేవా తీర్థ్

    8) జన్‌పథ్

    9) మండీహౌస్

    10) సెంట్రల్ సెక్రటేరియట్

    11) ఐటీఓ

    12) దిల్లీ గేట్

    13) ఇంద్రప్రస్థ

    14) ఖాన్ మార్కెట్

    15) జోర్ బాగ్

    16) శివాజీ స్టేడియం

  9. అమిత్ షా, ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ

    రాహుల్

    ఫొటో సోర్స్, https://x.com/RahulGandhi

    ఫొటో క్యాప్షన్, ఛత్రసాల్ స్టేడియంలో రాహుల్ గాంధీ

    ప్రధాని ఇంటి ముందు మంగళవారం చేపట్టిన ధర్నా, తనను పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టడం తరువాత రాహుల్ గాంధీ మంగళవారం రాత్రి ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

    పోలీసులు తనను ఉంచిన ఛత్రసాల్ స్టేడియంలో రికార్డ్ చేసినట్లుగా చెబుతున్న ఆ వీడియోలో రాహుల్ గాంధీ ఒక కాలికి మాత్రమే షూ వేసుకుని కనిపించారు.

    ‘సోమవారం జరిగిన ఘటనలపై చర్చకు అనుమతి ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరాం. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని స్పీకర్ చెప్పారు. దీనిపై చర్చించేందుకు ప్రభుత్వానికి ఆసక్తి లేదని తర్వాత స్పష్టమైంది. దీంతో ప్రధాని నివాసం ముందు ధర్నా చేయాలని, విద్యార్థుల సమస్యలు, దేశంలోని సమస్యలన్నింటినీ ప్రజల దృష్టికి తేవాలని నిర్ణయించుకున్నాం.

    భారత విద్యావ్యవస్థ ఎందుకు నాశనమైంది, పేపర్లు ఎందుకు లీకవుతున్నాయి?విద్య ఎందుకు భారత్‌లో ఖరీదైన వ్యవహారంగా మారింది, పిల్లలను చదివించడానికి ప్రజలు ఆర్థికంగా ఎందుకు పూర్తిగా నష్టపోతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రావాలి. ఈ ప్రశ్నలు అడగడంలో ఎలాంటి తప్పూలేదు.

    విద్యార్థులు కోరినట్టుగా అమిత్ షా, ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులతో అవమానకరంగా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి. ఈ మొత్తం వ్యవహారంపై

    పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ జరపాలి.

    ప్రతిపక్షనేతగా నేను ప్రధాని మోదీకి ఓ సలహా ఇస్తున్నా. సోమవారం జరిగిన ఘటనపై ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి. పరీక్షల వ్యవస్థ, విద్యావ్యవస్థల్లో వీలయినంత తొందరగా సంస్కరణలు తేవాలి.

    విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్న ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని రాహుల్ అన్నారు.

  10. రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు: ధర్మేంద్ర ప్రధాన్

    Dharmendra Pradhan

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించాలని చూస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు.

    రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి బయట ధర్నా చేయడంతో సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగిందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.

    మంగళవారం రాత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో దీనికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన.. ‘లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ... పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించడానికి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను వాడుకుంటున్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల ప్రజలకు అసౌకర్యం కలగించడమే కాకుండా భద్రత నిబంధనలనూ ఉల్లంఘించారు’ అని రాశారు.

    ‘పూర్తిస్థాయి చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రజాస్వామ్య చర్చకు బదులుగా రాజకీయ ప్రదర్శననే ఎంచుకుంది. వారి లక్ష్యం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కాదు, అడ్డంకులు సృష్టించడమే’ అని రాశారు.

    ‘నీట్ పరీక్షపై పార్లమెంట్‌లో చర్చించడానికి, యువత ఆందోళనలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. భారతదేశ విద్యార్థులను ఒక రాజకీయ ప్రచారంలో భాగం చేయడం కంటే మెరుగైన రీతిలో చూడాలి. వారికి కావాల్సింది నమ్మకం.. అంతేకానీ గందరగోళం కాదు. వారికి కావాల్సింది పరిష్కారాలు.. నినాదాలు కాదు. వారికి కావాల్సింది జవాబుదారీతనం, అడ్డంకులు కాదు’ అన్నారు ధర్మేంద్ర ప్రధాన్.

    విద్యార్థుల సమస్యలపై పనిచేయడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.

  11. నమస్తే, బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ అప్టేడ్ చేస్తాం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    బీబీసీ న్యూస్ తెలుగు వెబ్‌సైట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన వార్తలను ఇక్కడ చదవొచ్చు.