హైపర్‌ఫెమిలియారిటీ ఫర్ ఫేసెస్: అపరిచితులందరూ తెలిసినవారిలా అనిపించే అరుదైన పరిస్థితి... ఇది ఎందుకు వస్తుంది?

జెన్నీ ప్యారీ

ఫొటో సోర్స్, BBC/ Emily Johnson

ఫొటో క్యాప్షన్, జెన్నీ ప్యారీ హైపర్‌ఫెమిలియారిటీ ఫర్ ఫేసెస్ (హెచ్ఎఫ్ఎఫ్) అనే ఓ అరుదైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు
    • రచయిత, ఎమిలీ జాన్సన్
    • హోదా, యార్క్ యూనివర్సిటీ
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

జెన్నీ ప్యారీ వీధిలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఎంతో మంది అపరిచితులను చూస్తుంటారు. వారందరూ ఆమెకు బాగా తెలిసిన వారిలాగానే అనిపిస్తుంటారు. ఆమె ఒక అరుదైన నాడీ సంబంధిత రుగ్మతతో బాధపడుతున్నారు.

ఈ రుగ్మత కారణంగా ఆమె ఎవరినీ చూసినా తనకు బాగా తెలిసినవారిలా భావిస్తుంటారు. వారితో కలిసి పార్టీలకు వెళ్లినట్లు లేదా ఆఫీసులో కూర్చుని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకున్నట్టు ఆమెకు అనిపిస్తుంటుంది.

''ఏడేళ్ల క్రితం నాకు మైగ్రేన్ వచ్చింది. ఆ తర్వాత నేను చూసే ప్రతి ఒక్క వ్యక్తీ నాకు బాగా తెలిసిన వారిలా అనిపిస్తోందని గ్రహించాను'' అని జెన్నీ తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు.

'‘ముందు ఆ పరిస్థితి చాలా ఒత్తిడిగా, కష్టంగా అనిపించేది. ఎందుకంటే, నేను చూసే ప్రతి ఒక్కరితో కలిసి ఏదో ఒక పని చేసినట్లు గుర్తు వస్తుండేది. కానీ, వాస్తవానికి వాళ్లెవరో నాకు తెలియదు'' అని అన్నారు.

''మొదట రెండేళ్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. నాకు అందరూ తెలిసినట్లు అనిపించేది. వారి దగ్గరకు వెళ్లేదాన్ని. నేనెవరో వారికి తెలిసేది కాదు. అలా కొన్నిసార్లు జరిగిన తర్వాత.. ఎవరి వద్దకైనా మీరు తెలుసు అని వెళ్లడం మానేశాను'' అని జెన్నీ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

స్కార్‌బారోకి చెందిన 54 ఏళ్ల జెన్నీ.. తన పరిస్థితి గురించి వివరించారు. ఆమె ఎదుర్కొనే పరిస్థితి ముఖాలు బాగా తెలిసినట్లు భావించే హైపర్‌ఫెమిలియారిటీ. సంక్షిప్తంగా దాన్ని హెచ్‌ఎఫ్ఎఫ్ అంటారు. స్థానిక జూలో పనిచేసేటప్పుడు ఆమెకు సవాళ్లు మొదలయ్యాయి.

"వారు నన్ను రిసెప్షన్‌లో కూర్చోబెట్టారు. టికెట్ ధర చాలా ఎక్కువ కాబట్టి, వచ్చిన వారు రోజులో ఎన్నిసార్లయినా లోపలికి, బయటికి వెళ్లవచ్చని నాకు చెప్పారు" అని ఆమె వివరించారు.

''వారి చేతికి స్టాంప్ వేస్తారా అని అడిగితే, 'లేదు, కొత్తవాళ్లెవరైనా లోపలికి వెళ్తే నీకు తెలిసిపోతుంది' అని చెప్పారు''

''కానీ, నేను ప్రతి ఒక్కర్ని లోపలికి వెళ్లనిచ్చేదాన్ని. వారికి చాలా డబ్బులు పోగొడుతున్నానని మెల్లిగా నాకర్థమైంది'' అని జెన్నీ వివరించారు.

జెన్నీ పరిస్థితి చాలా అరుదైనది. దానిపై ఇంకా పరిశోధన కొనసాగుతోంది.

అయితే, ఆమెకు భిన్నమైన పరిస్థితి ఉన్న వారిని ప్రోసోపాగ్నోసియా లేదా ఫేస్ బ్లైండ్‌నెస్ అంటారు. ఈ పరిస్థితిని ఉన్న వారు జనాభాలో 2 శాతం ఉంటారు.

ఇది కూడా వారిలో ఆందోళనకు, ఇతర సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.

తన విషయంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆసక్తితో, జెన్నీ ముఖ గుర్తింపు (ఫేసియల్ రికగ్నైజేషన్) సమస్యలపై ఆన్‌లైన్‌లో పరిశోధించడం మొదలుపెట్టారు.

ఇలా పరిశోధిస్తూ చివరికి ఆమె అమెరికాలోని ఒక పీహెచ్‌డీ విద్యార్థికి మెయిల్ కూడా చేశారు. ఇది ఆమెను యార్క్ విశ్వవిద్యాలయంలో ఎంఐఆర్ఐ స్కానింగ్‌ వరకు తీసుకువెళ్లింది.

జెన్నీ మెదడులో నాడుల మధ్య అనుసంధానంలో మార్పు వల్ల హెచ్‌ఎఫ్ఎఫ్ వచ్చిందని యూనివర్సిటీకి చెందిన సీనియర్ రీసర్చర్ ప్రొఫెసర్ టిమ్ ఆండ్రూస్ గుర్తించారు.

ఆమె చూపు, జ్ఞాపకశక్తి బాగానే పనిచేస్తున్నప్పటికీ.. రెండింటి మధ్య చాలావేగంగా కమ్యూనికేషన్ జరుగుతూ... ఫెమిలియారిటీకి సంబంధించి తరచూ ఒక తప్పుడు సూచనను అందిస్తోంది. అంటే ఆమెకు ఎవరైనా కనిపించినప్పుడు, వారు తనకు ముందే బాగా తెలుసనే సంకేతాలను ఇస్తోంది.

జెన్నీ ప్యారీ

తొలుత తీసిన స్కాన్‌లన్నీ సాధారణంగానే అనిపించిన తర్వాత... గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ టీవీషోను ఉపయోగించి పరిశోధకులు ఒక ప్రయోగం చేశారు.

అంతకుముందు ఈ సిరీస్ చూడని వారి మెదళ్లను, ఆ సిరీస్‌లోని పాత్రలు బాగా తెలిసిన అభిమానుల మెదళ్లను పరిశోధకులు స్కాన్ చేశారు.

ఈ రెండు గ్రూప్‌ల మధ్య మెదడు పనితీరులో తేడాలున్నాయని తాము గుర్తించినట్లు ప్రొఫెసర్ ఆండ్రూస్ చెప్పారు.

''జెన్నీ మెదడును స్కాన్ చేస్తున్నప్పుడు ఆమెకు ఒక వీడియో సిరీస్ చూపించాం. ఆ సమయంలో ఆమె మెదడులోని ‘హిప్పోక్యాంపస్’ అనే భాగం, ఆ సిరీస్‌ను క్రమం తప్పకుండా చూసే అభిమానుల మెదడు స్పందనల మాదిరిగా స్పందించడాన్ని మేం కనుగొన్నాం’’

దీన్ని స్కాన్‌లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇది జెన్నీ ఎదుర్కొంటున్న ప్రతి దాన్ని ధ్రువీకరించింది.

''నిత్యం ఈ పరిస్థితిని ఎదుర్కొనే వారికి, దీని వెనుక కూడా ఒక కారణం ఉందని తెలుసుకోవడం నిజంగా ఊరటనిస్తుంది'' అని ప్రొఫెసర్ అన్నారు.

జెన్నీ జీవితం ప్రస్తుతం కాస్త భిన్నంగా ఉంది.

ఇప్పుడు ఆమె అపరిచితులతో నేరుగా మాట్లాడటం లేదు. ఎవరైనా వారంతట వారే పరిచయం చేసుకునేవరకు వారి జుట్టు ఎలా ఉంది, ఎలాంటి దుస్తులు ధరించారు అనే విషయాలను గమనించడం నేర్చుకున్నారు జెన్నీ.

''నేను ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకు వెళ్తే, కాస్త ప్రశాంతంగా హాజరవ్వాలనుకుంటే, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ముఖంలోకి చూస్తాను. అప్పుడు ఆ వ్యక్తి ఎన్నో ఏళ్లుగా తెలిసిన వ్యక్తిగా అనిపిస్తారు'' అని చెప్పారు.

''ఇప్పుడు నేనీ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఒక విధానాన్ని కనుగొన్నాను. అది బాగా పనిచేస్తుంది'' అని తెలిపారు.

జెన్నీ మెదడు స్కానింగ్
ఫొటో క్యాప్షన్, జెన్నీ మెదడు స్కాన్ చేస్తూ ప్రయోగం నిర్వహిస్తున్న ప్రొఫెసర్ టిమ్ ఆండ్రూస్

తను ఎదుర్కొనే పరిస్థితిని జెన్నీ చాలా తేలికగా తీసుకుంటున్నారు. ఫైలీ జూలో కీపర్‌గా తన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే, తనను తాను సంతోషంగా ఉంచుకునే మార్గాలను వెతుకుతున్నారు.

''నేను ఇప్పుడు దీని గురించి అందరితో చాలా నిజాయితీగా, ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడుతున్నాను. దీన్నొక సానుకూల అంశంగా చూస్తున్నాను'' అని తెలిపారు.

''చుట్టూ ఉన్న ప్రజలతో నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటే, వారి ముఖాలను చూసి సంభాషిస్తుంటాను. ఆందోళనగా ఉండేవారు అలా చేస్తే.. ఎంత బాగుంటుంది కదా?''

హెచ్‌ఎఫ్‌ఎఫ్ సమస్యతో బాధపడుతూ, ఒంటరితనం భావించే వారికి తన అనుభవం స్ఫూర్తి ఇస్తుందని జెన్నీ ఆశిస్తున్నారు.

"ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు, 'సరే, జీవితాన్ని ఇంకొంచెం ప్రయత్నించి చూద్దాం, నాకు ఏం పనిచేస్తుందో చూద్దాం' అని ఆలోచిస్తే చాలా బాగుంటుంది" అని జెన్నీ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)